Intermediate Education: ఇంటర్ తరగతులు రేపటి నుంచే
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:25 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పూర్తిగా మార్చింది. 2025-26 విద్యా సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సబ్జెక్టులలో మార్పులతో పాటు కాలేజీ పనివేళలు, పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు చేశారు.

ఏప్రిల్ 7 నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు
ఇకపై సైన్స్ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులే
ఇంటర్ విద్యలో సమూల మార్పులు
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. 2025-26 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచే ప్రారంభిస్తోంది. ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి, తర్వాత వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 1న విద్యా సంవత్సరం పునఃప్రారంభమవుతుంది. ఈసారి ప్రైవేటు కాలేజీల తరహాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా అడ్మిషన్లకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నాయి. జూనియర్ కాలేజీల పనివేళలను కూడా ఇంటర్ బోర్డు మార్చింది. ప్రస్తుతం రోజుకు ఏడు పీరియడ్లు ఉండగా, ఇకపై ఎనిమిది పీరియడ్లు ఉండేలా టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలు పనిచేస్తాయి. సబ్జెక్టులు, కోర్సుల్లో ఇంటర్ బోర్డు కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఎంపీసీ విద్యార్థులకు గణితం ఏ, బీలుగా ఉండగా.. దాన్ని ఒక్కటిగా చేసింది. బైపీసీలో బోటనీ, జువాలజీని బయాలజీగా మార్చింది. సైన్స్ విద్యార్థులకు ఆరు సబ్జెక్టుల స్థానంలో ఐదు సబ్జెక్టులు ప్రవేశపెట్టింది. వారికి ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా, మూడు సంబంధిత గ్రూపు కోర్ సబ్జెక్టులుగా ఉండగా, మరొకటి ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. అదనపు సబ్జెక్టు కాకుండా మిగిలిన ఐదు సబ్జెక్టులు కచ్చితంగా పాస్ కావాలి. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకుంటే ఎంబైపీసీ అవుతుంది. అదనపు సబ్జెక్టు మార్కులను సర్టిఫికెట్ లాంగ్ మెమోలో చూపించరు. దానికి అదనపు మెమో ఇస్తారు. దాని ఆధారంగా ఇంజనీరింగ్ లేదా వైద్యవిద్య వైపు వెళ్ళొచ్చు. సీబీఎ్‌సఈ తరహాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశ పెడుతున్నారు. మొత్తం మార్కుల్లో 10 శాతానికి ఒక మార్కు రూపంలో ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు ముగిస్తారు. కాలేజీల పనిదినాలను 222 నుంచి 235కు పెంచింది. 2025-26 నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సీబీఎ్‌సఈ సిలబస్ అమలు చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News