AP Pensions: ‘ఏడుపు’ పెంచెన్!
ABN , Publish Date - Aug 03 , 2024 | 03:22 AM
అనకాపల్లి జిల్లా కొరుప్రోలుకు చెందిన అప్పారావును పింఛను కోసం 3 కిలోమీటర్లు డోలీలో తీసుకుపోయారు...
పింఛన్ల పంపిణీ తట్టుకోలేని రోత పత్రిక
ఊరూరా ఇంటింటికీ తెచ్చి ఇవ్వలేదంటూ రాతలు
వాస్తవాలు పక్కన పెట్టి వక్రీకరణలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ఒకే రోజు 64 లక్షల మంది పేదలకు సామాజిక పింఛన్లు ఇచ్చినా... 97.5 శాతం మందికి ఒకటో తేదీనే పంపిణీ చేసినా జగన్ రోత పత్రికకు ‘ఏడుపే’! వలంటీర్లు లేకున్నా పింఛన్ల పంపిణీ సక్రమంగా సాగడాన్ని జీర్ణించుకోలేనంతగా ‘ఏడుపు’! పింఛన్ల పంపిణీపై అబద్ధాలు, అర్ధసత్యాలు పోగేసిన జగన్ పత్రిక... శుక్రవారం ఊరూరా ఏడి‘పింఛన్’ అంటూ ఒక రోత కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రమంతా పింఛను కష్టాలే ఉన్నాయన్నట్లుగా ఏడ్చేసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జోగిరాజుపేటలో చెట్టుకింద పింఛను పంపిణీ చేస్తున్నారంటూ ఒక ఫొటో ప్రచురించింది. అసలు విషయం ఏమిటంటే... ఆ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పి.శ్రీదేవి పింఛన్ల పంపిణీకి వెళ్లారు. ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గురువారం ఉదయం 5.30కే గ్రామానికి చేరుకోవాలనే తొందరలో మందులు వేసుకోవడం మరచిపోయారు. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేశారు. 10 గంటల సమయంలో శ్రీదేవి నీరసించి కిందపడిపోయారు. స్థానికులు, తోటి ఉద్యోగులు ఆమెను చెట్టు నీడలోకి తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఈలోపు కొంతమంది లబ్ధిదారులు అక్కడకే వచ్చారు. ‘ఎలాగూ వచ్చాంకదా! పింఛను డబ్బు ఇక్కడే ఇచ్చేయండి’ అని కోరడంతో శ్రీదేవి అక్కడున్న వారికి డబ్బులు ఇచ్చేశారు. కొద్దిసేపటికి కోలుకున్న ఆమె... ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించారు. ఇదీ అక్కడ జరిగింది.
వలంటీర్లున్నప్పుడూ అంతే!
సమస్య తెలిపేందుకే డోలీపై వెళ్లాం
కొరుప్రోలు గ్రామ గిరిజనులు
అనకాపల్లి జిల్లా కొరుప్రోలుకు చెందిన అప్పారావును పింఛను కోసం 3 కిలోమీటర్లు డోలీలో తీసుకుపోయారు... అంటూ జగన్ పత్రిక మరో ఫొటో ప్రచురించింది. వలంటీర్లున్నపుడు లేని సమస్య ఇప్పుడొచ్చినట్లుగా కలరింగ్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే... జగన్ హయాంలోనూ ఎప్పుడూ కొరుప్రోలులో వలంటీర్లు పింఛను పంపిణీ చేయలేదు. ప్రతినెలా లబ్ధిదారులే పంచాయతీ కేంద్రమైన ఎంకే పట్నం వెళ్లి డబ్బులు తెచ్చుకునే వాళ్లమని గ్రామ గిరిజనులు తెలిపారు. తమ సమస్య అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే డోలీల్లో వెళ్లినట్టు చెప్పారు. శుక్రవారం డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, తహసీల్దార్ సోమశేఖర్, ఎంపీడీవో వెంకటేశ్వరరావు తదితరులు కొరుప్రోలు వెళ్లి పింఛన్‌దారులతో సమావేశమయ్యారు. విషయం ఏమిటంటూ ఆరా తీశారు. దీంతో ఆ గ్రామస్థులు తమ సమస్యను ఏకరువు పెట్టారు. కొరుప్రోలు గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేదు. దీనిపై వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆ గ్రామానికి ద్విచక్ర వాహనాలు తప్ప ఇతర వాహనాలు రాకపోకలు సాగించే వీలు లేదు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే డోలీలో వెళ్లామని స్థానికులు తెలిపారు. పింఛను కోసం మునుపటిలా ఎంకే పట్నం రానక్కర్లేదని లబ్ధిదారులకు ముందే చెప్పామని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆస్పత్రి పని మీద వచ్చామని చెప్పడంతో... అక్కడే పింఛను ఇచ్చామన్నారు.
వలంటీర్లు ఉన్నప్పుడు కూడా రాలేదు
గతంలో ఎన్నడూ గ్రామానికి వచ్చి పింఛన్లు ఇవ్వలేదు. ఐదేళ్ల నుంచి ఎంకే పట్నం వెళ్లే తీసుకుంటున్నాం. వలంటీర్లు ఉన్నా మా గ్రామానికి వచ్చి పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు.
- గెమ్మిలి ఆనంద్, కొరుప్రోలు
సర్వర్ కోసం ఆగలేక...
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్జేపల్లెలో దళితులకు పింఛన్లు ఆపివేశారని జగన్ పత్రిక వాపోయింది. ఇది కూడా అవాస్తవమే. పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి ఆస్గర్ గురువారం మీర్జేపల్లెలో ఉదయం 5.30 నుంచి 8.40లోపు 63మందికి పింఛను పంపిణీ చేశారు. ఈ మధ్యలో సర్వర్ పనిచేయక పోవడంతో కొంత సేపు పంపిణీకి అంతరాయం కలిగింది. ఈలోపే... వైసీపీ మద్దతుదారులు రచ్చ చేశారు. కావాలనే పింఛను పంపిణీలో ఆలస్యం చేస్తున్నారంటూ గొడవ పెట్టుకున్నారు. అంతే తప్ప... ‘టీడీపీకి ఓటు వేయలేదని పింఛను ఆపేశారు’ అంటూ జగన్ పత్రిక రాసిన రాతలో నిజం లేదని స్థానికులు తెలిపారు.
గెడ్డలను దాటి పింఛన్ల పంపిణీ
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో పలువురు సచివాలయ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటి వెళ్లి మరీ పింఛన్లను పంపిణీ చేశారు. గిన్నెలకోట, ఇంజరి పంచాయతీల్లో 11 గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛను అందించేందుకు తాడు సహాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటి అవతలికి వెళ్లారు. సచివాలయ సిబ్బంది పీకల్లోతు గెడ్డలో ఈదుకుంటూ వెళ్లి పింఛన్లను సకాలంలో అందించారు. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర సెర్ప్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అభినందించారు.
ఇంటికే తెచ్చి ఇచ్చారు
రెండు నెలల నుంచి స్థానిక సచివాలయ సిబ్బంది ఇంటికే వచ్చి పింఛన్ అందిస్తున్నారు. గురువారం కూడా ఇంటివద్దకే వచ్చి డబ్బులు ఇచ్చారు. అందరినీ ఒక చోటికి రప్పించ్చి పింఛన్ అందిస్తున్నారనేది అవాస్తవం.
- కె.వెంకటరమణ, పింఛన్ లబ్ధిదారుడు, జోగిరాజుపేట
పొలాల్లో ఉన్నా ఇచ్చారు
సచివాలయ సిబ్బంది మా ఇంటివద్దకు వచ్చి పింఛన్ డబ్బులు అందించారు. మమ్మల్ని ఎవరూ బయటకు రమ్మని చెప్పలేదు. కొంతమంది లబ్ధిదారులు పొలాల్లో ఉన్నా అక్కడికి వెళ్లి ఇచ్చారు.
- నారాయణమ్మ, జోగిరాజుపేట