Jawahar Reddy: సెలవుపై సీఎస్..
ABN , Publish Date - Jun 06 , 2024 | 02:01 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది. బుధవారం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, జూన్ 06: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది. బుధవారం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జూన్ 12న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మరోవైపు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు కీలక ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్... అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. కొత్త సీఎస్‌ను సాయంత్రంలోపు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక గత ప్రభుత్వంలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో ఆయన కుమారుడు ప్రమేయం ఉన్నట్లు జనసేన పార్టీ నాయకుడు మూర్తి యాదవ్ ఘాటైన విమర్శలు చేశారు. ఆ విమర్శలకు సీఎస్ జవహరెడ్డి సైతం స్పందించారు. అనంతరం విశాఖ వేదికగా జరిగిన భూ కుంభకోణంపై సీఎస్ జవహర్ రెడ్డికి మూర్తి యాదవ్ పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలంటూ సీఎస్ జవహరెడ్డికి సవాల్ విసిరారు.
ఇంకోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ అనంతరం సీఎస్ జవహర్ రెడ్డికి సెలవుపై వెళ్లాలంటూ టీడీపీ నేతలు కోరినట్లు తెలుస్తుంది. అయితే తనకు సమయం కావాలని వారితో జవహర్ రెడ్డి పేర్కొన్నారని సమాచారం. ఆ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఇక ఎన్నికల సమయంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్లపై సీఎస్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై టీడీపీ అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేంది. అలాగే దీనిపై ఈసీ సైతం స్పందించి.. వద్దని స్పష్టం చేసింది. దాంతో ఈ అంశంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను సీఎస్ జవహర్ రెడ్డి వేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక అధికార వైసీపీకి రాజకీయ లబ్ది కలిగించేందుకు సీఎస్ ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజులు ముందు లబ్దిదారుల ఖాతాలో నగదు వేయాలని జవహర్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం కూడా ఆయన సెలవుపై వెళ్లేందుకు కారణాల్లో ఒకటనే ఓ చర్చ సైతం రాష్ట్రంలో నడుస్తుంది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News