AP News: నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి
ABN , Publish Date - Sep 06 , 2024 | 08:59 AM
నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం వెయ్యి ఎండీయూ రేషన్ వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ప్రభుత్వం అందజేస్తోంది.
అమరావతి: నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం వెయ్యి ఎండీయూ రేషన్ వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ప్రభుత్వం అందజేస్తోంది. నిన్న మంత్రి మనోహర్ ట్రయల్ రన్ నిర్వహించారు. నేడు పంపిణీ వ్యవస్థను పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీరపాండ్యన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ.. వరదల్లో చిక్కుకున్న వారికి నిన్నటి వరకూ ఆహారం, నీళ్లు, పాలు ప్రభుత్వం అంద చేసిందన్నారు. నేటి నుంచి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. 179 సచివాలయాల పరిధిలోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు.
79 సచివాలయాల పరిధిలో మాత్రమే నీరు వెనక్కి వెళ్లిందని వీరపాండ్యన్ తెలిపారు. ఈ రోజు ఆ ప్రాంతాల్లో సరుకులు అందచేస్తామన్నారు. రేషన్ షాపుల్లో పంపిణీ తరహాలో ఇక్కడ కూడా అందిస్తామన్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు జిల్లాల ఎండీయూ వాహనాలను వినియోగిస్తున్నామన్నారు. రేషన్ కార్డులో పేరును బట్టి వేలిముద్ర తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ఆధారంగా అందిస్తామన్నారు. మూడు నాలుగు రోజుల పాటు ఈ పంపిణీ జరుగుతోందన్నారు. సిగ్నల్ లేని ప్రాంతాల ప్రజలను ఒక చోటకు చేర్చి సరుకులు ఇస్తామని వీరపాండ్యన్ వెల్లడించారు.
దాదాపు ఐదు రోజుల తర్వాత నేడు సూర్య భగవానుడు కనిపించడంతో విజయవాడ పరిసర ప్రాంత వాసులంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మూడు రోజుల పాటు వర్షాలు వారిని తీవ్ర భయాందోళనలోకి నెట్టివేశాయి. నిన్న కాస్త వర్షం పడితేనే ఆ ప్రాంతమంతా భయంతో చిగురుటాకులా వణికిపోయింది. కరెంటు లేక.. నీళ్లు లేక.. తినడానికి తిండి లేక భయం గుప్పిట్లో ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త విజయవాడ ప్రాంతవాసులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. బుడమేరు గండ్ల పూడ్చివేతను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు.