Share News

ఎవర్నీ వదలం

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:33 AM

వైసీపీ నేతలు కొందరు ఎర్రచందనం దోచుకొని చైనా తరలించారు. నేను కేవలం ఒకరిద్దరి పేర్లు చెప్పను. అందరి జాతకాలు బయటకు తీస్తాం.

ఎవర్నీ వదలం

ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడీ

భూముల్లో 35,576 కోట్లు.. గనుల్లో 19,137 కోట్లు దోచారు: సీఎం

వైసీపీ నాయకులు ఆకాశమే హద్దుగా సహజ వనరులైన భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచుకుతిన్నారు. సహజ వనరులను దోచుకున్నవారిని, ప్రజల భూములను లాక్కున్న ఏ ఒక్కరినీ ప్రభుత్వం వదిలిపెట్టదు. ప్రతి అన్యాయంపైనా విచారణ జరిపిస్తాం. దోషులు ఎంతటివారైనా చట్టం పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటాం. - చంద్రబాబు

యథేచ్ఛగా సహజ వనరుల లూటీ

ఎర్రచందనం కోసం అడవులు ఖాళీ

ప్రజల ఇళ్ల స్థలాల పేరుతో నొక్కుడు

పేదల అసైన్డ్‌ భూములూ లాక్కున్నారు

టైటిల్‌ చట్టంతో దోచాలనుకున్నారు

ప్రతిదానిపైనా విచారణ ఉంటుంది

గుజరాత్‌ తరహాలో భూకబ్జా నిరోధకచట్టం

మీ భూమి మీ పేరిట ఉందో? లేదో చూసుకోండి

వైసీపీ నేతల దౌర్జన్యాలతో భూములు, మైన్‌ లీజులు

కోల్పోయినవారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి

ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తాం

మీ భూములు, గనుల లీజులు తిరిగి ఇప్పిస్తాం

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా

భూములు, గనులు, అటవీ సంపదపై శ్వేతపత్రం

గత పాలనలో వైసీపీ నేతలు లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా మైనింగ్‌ వ్యాపారాన్ని లాక్కున్నారు. ఇలాంటి బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇకపై ఎవరి వ్యాపారాలు వారే చేయాలి. ఎవరి క్వారీలు వారే నిర్వహించుకోవాలి. ఇందుకు మేం అండగా ఉంటాం.

అడవులు ఖాళీ

వైసీపీ నేతలు కొందరు ఎర్రచందనం దోచుకొని చైనా తరలించారు. నేను కేవలం ఒకరిద్దరి పేర్లు చెప్పను. అందరి జాతకాలు బయటకు తీస్తాం. అక్రమాల కోసం స్మగ్లర్లు అడవిని ఖాళీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. వారు తిరగడానికి వాహనాలు, డీజిల్‌ ఖర్చు కూడా ఇవ్వలేదు. అడవిలో పనిచేసే ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిని ఇతర జిల్లాలకు పంపించి స్మగ్లర్లు దోచుకుపోయేలా సహకరించారు. ఒకాయన స్మగ్లింగ్‌తో వచ్చిన ఆదాయంతో చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. పుంగనూరు, చిత్తూరు, పల్నాడు ప్రాంతాల్లో అడవులను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను తవ్వేశారు.

రుషికొండ ప్యాలెస్‌ ఎందుకో?

విశాఖలో రుషికొండను తవ్వేసి ప్యాలెస్‌ కట్టారు. ఇది ఎందుకు కట్టారంటే.. ప్రధాని, రాష్ట్రపతి వస్తే ఉండటానికి అని కబుర్లు చెబుతున్నారు. 500 కోట్లు పెట్టి ప్యాలెస్‌ కట్టారు. దాన్ని ఏం చేయాల్నో నాకు అర్థం కావడం లేదు. పాలకులు ప్రజలకు సేవకులుగా ఉండాలే తప్ప రాజులుగా ఉండకూడదు. దోపిడీ జరిగిందని ప్రజలు చెబితే వారిపై దాడులు చేశారు. మీడియా వార్తలు రాస్తే వారిపై దాడులు చేసి జైల్లో పెట్టారు. దొంగలకు తాళాలు ఇచ్చి దోచుకునేలా చేశారు.

భూకబ్జాలపై టోల్‌ ఫ్రీ

వైసీపీ నేతల భూ కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తాం. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. రెవెన్యూ వచ్చే శాఖల్లో బయటి నుంచి తీసుకొచ్చిన వారిని కూర్చోబెట్టి అక్రమాలు చేశారు. రేషన్‌ బియ్యంలో కూడా లెక్కలేనన్ని అక్రమాలు చేశారు.

ఇక షాక్‌ ట్రీట్‌మెంటే

రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఊరుకునేది లేదు. మచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చర్యల్లేక ఉన్మాదులుగా తయారవుతున్నారు. గత ప్రభుత్వ అలసత్వమే ఈ దుర్మార్గాలకు కారణం. ఆ రెండు సంఘటనలపై స్పెషల్‌ కోర్టు ఏర్పాటు చేస్తాం. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారికి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తాం.

అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి):త ప్రభుత్వంలో వైసీపీ నాయకులు పేదలపై ప్రతాపం చూపారని, భూములు, ఆస్తులను బలవంతంగా లాక్కున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు తమ భూములు, ఆస్తులు తమ పేరిటే ఉన్నాయా? లేదా? అని పరిశీలన చేసుకోవాలని కోరారు. భూములు తమ పేరిట లేకున్నా.. ఎవరైనా బలవంతంగా, దౌర్జన్యంగా లాక్కున్నా వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే గనుల లీజులను భయపెట్టి లాక్కున్నా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని, జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘మీ భూములు, ఆస్తులు, గనుల లీజులను తిరిగి మీకే ఇప్పిస్తాం. ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు. సోమవారం సచివాలయంలో భూమి, గనులు, అటవీ సంపదపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఆయా అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే..

ఇది కేవలం కేస్‌ స్టడీనే

గత ప్రభుత్వం పంచభూతాలను సైతం మింగేసింది. పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగింది. ఖనిజ సంపద, అడవులను ఇష్టానుసారం ధ్వంసం చేశారు. మాకు అందిన రికార్డుల ప్రకారం కంటే ఎక్కువగానే దోపిడీ జరిగింది. విశాఖ, ఒంగోలు, చిత్తూరు, తిరుపతిలో జరిగిన సహజ వనరుల దోపిడీ ఒక కేస్‌స్టడీ మాత్రమే. ఇళ్ల స్థలాల పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

భూముల్లో 35 వేల కోట్ల దోపిడీ

వైసీపీ నేతలు ముందుగానే భూములు గుర్తించి, వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ తర్వాత రెండింతలు ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్యానికి గంతలు కట్టారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో 35,576 కోట్ల నష్టం జరిగింది. మా దగ్గర ఉన్న సమాచారం ఆధారంగానే ఈ లెక్క చెబుతున్నాం. ఇదింకా చాలా ఎక్కువే ఉంటుంది. మా అంచనా ప్రకారం 1.75 లక్షల ఎకరాల భూమిని దోచుకుతిన్నారు. తిరుపతి పరిధిలో నిషేధ భూముల జాబితా నుంచి అడ్డగోలుగా భూములను తొలగించి వైసీపీ నేతలకు కట్టబెట్టారు. ఆ భూముల విలువ 270 కోట్లపైనే. తిరుచానూరులో 4.5 ఎకరాల కాలువ పోరంబోకు, మంగళంలో 27.14 ఎకరాల ప్రభుత్వ భూమి, దామినీడులో 3.32 ఎకరాల కుంటపోరంబోకు, సూరప్పకాశంలో 12.69 ఎకరాల సీలింగ్‌ భూమి, కోట్రమంగళంలో 15.28 ఎకరాల భూమి, దుర్గసముద్రంలో 7.98 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా 22(ఏ) నుంచి తొలగించి కట్టబెట్టారు.

10 వేల ఎకరాల పేదల అసైన్డ్‌ భూమి...

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పేదలనే బలి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో 10 వేల ఎకరాలను బలవంతంగా లాక్కున్నారు. ఇళ్ల స్థలాలకు భూములు సేకరిస్తున్నారని తెలిసి వైసీపీ నేతలు కారుచౌకగా భూములు దక్కించుకున్నారు. వాటిని రెండు, మూడు రెట్ల అధిక ధరలకు తిరిగి ప్రభుత్వానికి విక్రయించారు. అసైన్డ్‌, అవ, పోరంబోకు భూములను కూడా లాక్కున్నారు. అనర్హులకు ఇంటి స్థలాలు ఇచ్చారు.

వైసీపీ ఆఫీసులకు 300 కోట్ల భూములు

జీవో 340 ప్రకారం వైసీపీ ఆఫీసుల నిర్మాణం కోసం 300 కోట్ల విలువైన 40.78 ఎకరాల భూమిని కేటాయించారు. నిబంధనలను, ఇతర మార్గదర్శకాలను ఉల్లంఘించి 26 జిల్లాల్లో కేటాయింపులు చేశారు. అనుమతులు తీసుకోకుండా ఆఫీసుల నిర్మాణం చేపట్టారు.

అనర్హులకు 1300 కోట్ల ‘అసైన్డ్‌’

అసైన్డ్‌ భూముల కేటాయింపులో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. ఏమాత్రం అర్హత లేని తమ కేడర్‌ 8,086 మందికి 13,081 ఎకరాల భూమి ఇప్పించారు. ఆ భూమి విలువ 1300 కోట్లపైమాటే. కడప జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103.15 ఎకరాలు, నంద్యాలలో 318 మందికి 483 ఎకరాల చొప్పున వైసీపీ కేడర్‌కు భూములు కట్టబెట్టారు.

40 వేల ఎకరాల ‘అసైన్డ్‌’ దోపిడీ

వైసీపీ నేతలు చట్టాన్ని మార్చి, పేదల నుంచి 40 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు తీసుకున్నారు. చట్టం వస్తే ఏ భూములకు హక్కులు వస్తాయో ముందుగా గుర్తించి ఆ భూముల రైతులతో జీపీఏ ద్వారా కొన్నారు. ఆ తర్వాత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూములను 22(ఏ) నుంచి తొలగించి హస్తగతం చేసుకున్నారు. పీఓటీ చట్టం లక్ష్యాలను నీరుగార్చారు.

టైటిల్‌ చట్టంతో కుట్ర

నీతి ఆయోగ్‌ సిఫారసులకు విరుద్ధంగా జగన్‌ సర్కారు టైటిల్‌ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రజల భూములను వైసీపీ నేతలు దోచుకోవాలన్నదే అసలైన ప్లాన్‌. ఈ చట్టంతో ప్రజల ఆస్తులను ప్రమాదంలో పడేసే ప్రయత్నం చేశారు. జగన్‌ ప్రభుత్వంలో ఆయన పత్రిక సాక్షిలో పనిచేసిన వారిని సలహాదారులుగా పెట్టుకున్నారు. టైటి ల్‌ చట్టం వస్తే సాక్షిలో పనిచేసిన వారినే కీలక స్థానాల్లో నియమించేవారు. సివిల్‌ కోర్టుల ప్రమేయం కూడా తీసేశారు. కాబట్టి ఈ ప్రజాకంఠక చట్టాన్ని మేం రద్దుచేశాం.

భూకబ్జా నిరోధక చట్టం తెస్తాం

వైసీపీ నేతలు పంచభూతాలను దోచేశారు. ప్రజల సాగు భూములు, ఇంటి స్థలాలు కబ్జా చేశారు. అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చేస్తాం. గుజరాత్‌ తరహాలో ఆంధ్రప్రదేశ్‌ భూ కబ్జా నిరోధక చట్టం తీసుకొస్తాం. ప్రజల ఆస్తులు, భూములను కాపాడుతాం. భూములు కోల్పోయిన ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయండి. భూముల రీ సర్వే పేరుతో జగన్‌ ఫొటోలతో పాస్‌పుస్తకాలు, ఆయన పేరుతో సర్వే రాళ్ల ఏర్పాటు పేరిట 653 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వ రాజముద్ర లేకుండా జగన్‌ బొమ్మలు వేశారు. రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేద్దామని అనుకున్నారు. ఎవరన్నా చనిపోయిన తర్వాత రాళ్లపైన బొమ్మలు వేసుకుంటారు. జగన్‌ బొమ్మల పిచ్చికి వందల కోట్లు ఖర్చుపెట్టారు. ఇది పిచ్చా? మదమా? అహంకారమా?


విశాఖ భూదందాలో మచ్చుతునకలు

టీడీపీ ప్రభుత్వంలో విశాఖలో సినిమా స్టూడియో కోసం రామానాయుడుతో మాట్లాడి భూములు కేటాయించాం. జగన్‌ సర్కారు ఆ భూములను నివాస సముదాయాల కోసం క్లాసిఫికేషన్‌ మార్చింది.

ఓల్డేజ్‌ హోమ్‌ కోసం హయగ్రీవాకు 12.51 ఎకరాలు కేటాయిస్తే, జగన్‌ ప్రభుత్వంలో దాన్ని నివాసాల కోసం మార్చేశారు.

శారదాపీఠానికి 22 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని కేవలం 15 లక్షలకే కబ్టబెట్టారు.

సాహీ హియరింగ్‌ కేర్‌ అనే సంస్థకు ఎండాడలో ఉచితంగా ఎకరం భూమిని కేటాయించారు. అక్కడ ఎకరా 15.33 కోట్లు ధర ఉంది. అదేదో ఈయన (జగన్‌) సొంత ఆస్తి అన్నట్లుగా ఉచితంగా ఇచ్చారు.

దసపల్లా, ఎంవీవీ, ఎంకే హౌజింగ్‌ వంటి వాటిల్లో అడ్డగోలుగా వ్యవహరించారు. ఇలా ఒక్క విశాఖలో చేసిన భూ దందా విలువే 4,469 కోట్లు. ఇది కేవలం అంచనా. వాస్తవాలను పరిశీలిస్తే నష్టం మరింతగా ఉంటుంది.

గనుల్లో 19 వేలకోట్ల దోపిడీ

గత ఐదేళ్లలో గనుల రంగంలోనే రూ.19,137 కోట్ల దోపిడీ జరిగింది. ఐదేళ్ల పాటు ఇసుక తవ్వకాల్లో డాక్యుమెంట్లు లేకుండా చేశారు. మినరల్‌ రెవెన్యూలో 9,750 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక ధరలు పెరగడంతో 130 మంది పేదలు పనుల్లేక మరణించారు. దండా నాగేంద్ర అనే వ్యక్తి ఇసుక తవ్వకాలపై కోర్టులో కేసు వేసినందుకు అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారు. టీడీపీ పాలనలో గనుల ఆదాయంలో 150 శాతం అభివృద్ధి ఉంటే, జగన్‌ పాలనలో 7 శాతమే ఉంది. జగన్‌ పాలనలో అటవీ, మైనింగ్‌ శాఖలు ఒకే వ్యక్తికి ఇచ్చారు. ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. క్వార్ట్జ్‌, సిలికా శాండ్‌ లీజుదారులను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారు. సొంత సిమెంట్‌ ఫ్యాక్టరీకే లేటరైట్‌ పంపిణీ చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 155 క్వారీలపై దాడులు చేశారు. 23 మందిపై 614 కోట్లు ఫైన్‌ వేశారు. చిత్తూరు జిల్లాలో 248 కోట్లు జరిమానా వేశారు. పెద్దిరెడ్డి మనుషులకు, కావాల్సిన వారికి ఇష్టానుసారంగా లీజులు ఇచ్చారు. కుప్పంలో కూడా గ్రానైట్‌ దోచారు. ద్రవిడ యూనివర్సిటీలో కూడా అక్రమ తవ్వకాలు చేశారు.

New Project (20).jpg

Updated Date - Jul 16 , 2024 | 04:33 AM