Bhupathiraju: భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమతో దేశంలో గుర్తింపు
ABN , Publish Date - Aug 10 , 2024 | 09:23 PM
భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమ కారణంగా దేశంలో గుర్తింపు వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వాడటం వల్ల క్వాలిటీ దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. శనివారం నాడు మంత్రి భూపతిరాజు భీమవరంలో పర్యటించారు.
పశ్చిమగోదావరి: భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమ కారణంగా దేశంలో గుర్తింపు వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathiraju Srinivasa Varma) తెలిపారు. చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వాడటం వల్ల క్వాలిటీ దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. శనివారం నాడు మంత్రి భూపతిరాజు భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ... వ్యర్థాలతో చేపలు పెంచే రైతులకు అవగాహన కల్పించే బాధ్యత ట్రేడర్స్‌కు ఉందని తెలిపారు.
పెద్ద ఎత్తున చేపలు ఉత్పత్తికి ఇక్కడ ఉన్న నీటి వనరులు కారణమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించాక ఫిషరీస్, డైరీ , యానిమల్ హజ్బెండరీకి ఒక పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరితగతిన మార్కెట్‌కు చేర్చేందుకు కిసాన్ ట్రైన్స్ ఏర్పాటు చేశారని వివరించారు. కేంద్రంతో మాట్లాడి ఈ ప్రాంతం నుంచి ఒక ట్రైన్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని భూపతిరాజు శ్రీనివాసవర్మ హామీ ఇచ్చారు.
మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా: సుజనా చౌదరి
మరోవైపు.. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగం పొందిన యువతకు జాయినింగ్ లెటర్‌లను ఎమ్మెల్యే సుజనా చౌదరి (Sujana Choudhary) అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... పశ్చిమ నియోజకవర్గంలో జాబ్‌మేళా పెడితే ఏడు వేల మంది వచ్చారని వివరించారు. 41 కంపెనీలు ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసుకున్నారని అన్నారు. ఈసారి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఇలాంటి ఇంటర్వ్యూలకు పంపుతామని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతామని సుజనా చౌదరి ప్రకటించారు.
కేంద్రం ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఇంతమంది నిరుద్యోగ యువత వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం అవుతుందని చెప్పారు. గత ఐదేళ్లల్లో దశ దిశ లేని పాలన వల్ల యువత జీవితాలు నాశనం అయ్యాయని ధ్వజమెత్తారు. విజయవాడతో పాటు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టేలా చూస్తామని స్పష్టంచేశారు. ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే నాలుగు జిల్లాల నుంచి యువత వచ్చారని సుజనా చౌదరి వెల్లడించారు.
గత పాలకులు చేసిన పాపాల కారణంగా ఏపీలో ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పారు. రెండు నెలల్లో అన్నీ సెట్ కావు.. సమయం పడుతుందని అన్నారు. చంద్రబాబు విజనరీపై ప్రజల్లో పెట్టుబడి దారుల్లో నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అందరికీ ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుతాయని సుజనా చౌదరి పేర్కొన్నారు.