Share News

నేర పరిశోధనపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:42 PM

నేరాలకు సంబంధించి ‘క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌’పై పోలీసులతోపాటు న్యాయ విద్యార్థులు కూడా అవగాహన కలిగి ఉండాలని విశాఖ పోలీసు కమిషనరేట్‌ లీగల్‌ అడ్వైజర్‌ రామకృష్ణారావు పేర్కొన్నారు.

నేర పరిశోధనపై అవగాహన ఉండాలి
క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ 6వ జాతీయ పోటీలను ప్రారంభిస్తున్న విశాఖ పోలీసు కమిషనరేట్‌ న్యాయసలహాదారు రామకృష్ణారావు, పక్కన వైస్‌చాన్సలర్‌ సూర్యప్రకాశరావు

విశాఖ పోలీసు కమిషనరేట్‌ లీగల్‌ అడ్వైజర్‌ రామకృష్ణారావు

న్యాయ విశ్వవిద్యాలయంలో సీఎస్‌ఐ జాతీయ పోటీలు ప్రారంభం

సబ్బవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): నేరాలకు సంబంధించి ‘క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌’పై పోలీసులతోపాటు న్యాయ విద్యార్థులు కూడా అవగాహన కలిగి ఉండాలని విశాఖ పోలీసు కమిషనరేట్‌ లీగల్‌ అడ్వైజర్‌ రామకృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని ఇంక్యూబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ‘క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీఎస్‌ఐ) 6వ జాతీయ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ, నేరం జరిగిన ప్రదేశం, అక్కడ ఆధారాలు సేకరించడం కేసు విచారణకు ఎంతో కీలకమని చెప్పారు. చిన్నపాటి ఆధారాన్ని కూడా వదలకూడదని స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక అభివృద్ధి కారణంగా కొత్త తరహాలో నేరాలు జరుగుతున్నాయని, ఇందుకు అనుగుణంగా సాంకేతిక అంశాలపై న్యాయ విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్‌ మాట్లాడుతూ, ఒక కేసులో న్యాయం జరగాలంటే ఆ కేసులో వాస్తవాలు, సాక్ష్యాలను సేకరించడం ఎంతో కీలకం అన్నారు. సరైన సాక్ష్యం సేకరించకపోతే బాధితులకు అన్యాయం జరుగుతుం దన్నారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చే ముందు క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ పోటీలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, సీఎస్‌ఐ ద్వారా న్యాయ విద్యార్థులు నేర పరిశోధనలో నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు ఆచరణాత్మక అనుభవాన్ని పెంచుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నందిని సీపీ, ఫ్యాకల్టీ కన్వీనర్‌ డాక్టర్‌ సీహెచ్‌ లక్ష్మి, డాక్టర్‌ రిపత్‌ఖాన్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విశ్వచంద్రనాథ్‌ మాదాసు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:42 PM