పకడ్బందీగా పథకాల అమలు
ABN , Publish Date - Sep 29 , 2024 | 05:55 AM
ప్రజాప్రయోజనం, అభివృద్ధే లక్ష్యంగా తాను చేపట్టిన శాఖల్లో పథకాలను పకడ్బందీగా అమలు పర్చాలని నిర్ణయించానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు గ్రామస్థాయి నుంచి
సీఎం చంద్రబాబు లక్ష్యాలను సాధించేలా అడుగులు వేస్తాం
పారదర్శకంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో బదిలీలు
ప్రజలకు మేలు చేసేలా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది
రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం
బదిలీల ప్రక్రియపై ప్రకటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రయోజనం, అభివృద్ధే లక్ష్యంగా తాను చేపట్టిన శాఖల్లో పథకాలను పకడ్బందీగా అమలు పర్చాలని నిర్ణయించానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు గ్రామస్థాయి నుంచి అభివృద్ధి మొదలు కావాలని స్పష్టమైన లక్ష్యాలు ఇచ్చారని, స్వర్ణ పంచాయతీలు కావాలని స్పష్టం చేశారని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు తాను నిర్వహిస్తున్న ఇతర శాఖల్లో బదిలీలు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతిభ, సమర్థత, నిబంధనలే కొలమానాలుగా తీసుకోవాలని ఉన్నతాధికారులకు పలుమార్లు దిశానిర్దేశం చేశానన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రుల సిఫారసులు బదిలీలకు నిర్దేశించిన కొలమానాలకు అనుగుణంగా ఉంటే పరిగణనలోకి తీసుకోవాలని సూచించానన్నారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు, ఏపీడీలు, డీపీఓలు, జిల్లా పరిషత్ సీఈఓ బదిలీల ప్రక్రియ మొదలయ్యే ముందు తన కార్యాలయం పూర్తి సమాచారం తీసుకుందన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు కీలక పోస్టుల్లో కొంచెం అటూఇటుగా మారుతూ, ఆ ప్రాంతాలను తమ జాగీర్లుగా మార్చుకునే స్థితికి చేరానని పేర్కొన్నారు. పీఆర్, ఆర్డీ అధికారులకు మాత్రమే డ్వామా పీడీ, ఏపీడీ, జడ్పీ సీఈఓ పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, అందువల్ల ఇతర శాఖల నుంచి ఈ శాఖల్లోకి రావాలనుకున్న వారిని తీసుకోలేదన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇంత పారదర్శకంగా, లంచాలకు ఆస్కారం లేకుండా ఇటీవల సంవత్సరాల్లో బదిలీలు జరగలేదని, బదిలీ తీరుపై ఉద్యోగుల నుంచి, మీడియా నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
గత ప్రభుత్వంలో దారిమళ్లిన నిధులు
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం లేకుండా, ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత పాలకులు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. జల్‌జీవన్ మిషన్ నిధులను గత పాలకులు సద్వినియోగపరచలేదన్నారు. కేంద్రం మన రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోపే కేంద్రం నుంచి రూ.4,500 కోట్లు ఉపాధి నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,987 కోట్లు వచ్చాయన్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా 2027 నాటికి 95.44 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా రక్షిత నీరు నిరంతరాయంగా సరఫరా చేయాలనేది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల లక్ష్యమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ వార్షిక ప్రణాళిక కోసం మన రాష్ట్రానికి రూ.215 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం ద్వారా ఆమోదింపచేసుకున్నామన్నారు. పంచాయతీల్లో అభివృద్ధి పనులు చురుగ్గా, లక్ష్యాన్ని అందుకునేలా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విరుద్ధంగా వెళ్లే అధికారులకు స్థానం చలనం ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. సీఎం చంద్రబాబు తన అనుభవంతో, రాష్ట్ర అభివృద్ధి కోసం తమ శాఖల సమీక్షలో, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చేసిన సూచనలు విలువైనవని, వాటి ఆధారంగానే పంచాయతీలకు పునరుజ్జీవం చేస్తున్నామన్నారు.