Share News

AP Politics: ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:21 AM

జలగన్న జగన్‌కు(YS Jagan) ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్‌ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్‌ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని..

AP Politics: ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు..
Chandrababu

  • ఆయన నైజం దోపిడీ, విధ్వంసమే

  • ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు

  • విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు

  • వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు

  • నాడు కోడికత్తి.. నేడు గులకరాయి డ్రామా

  • ఆరోగ్యశ్రీ బిల్లులివ్వకుండా పేదలతో ఆటలు

  • రాయలసీమను విస్మరించిన ద్రోహి

  • ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా?

  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం

  • వలంటీర్లకు పది వేల వేతనం ఇస్తాం

  • ప్రజాగళంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ

  • ఆలూరులో ప్రజాగళం సభకు హాజరైన జనం

నిన్న మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగిన జగన్‌.. నేడు ఓట్ల కోసం మళ్లీ మీ ముందుకొస్తున్నాడు.. నెత్తిన చేయి పెట్టబోతున్నాడు.. తస్మాత్‌ జాగ్రత్త!

తండ్రి కూడా జగన్‌ను భరించలేక.. ఈయన ఉంటే తన పదవి పోతుందని బెంగళూరుకు తరిమేశాడు. తండ్రికి, తల్లికి భారమైన వ్యక్తి.. భూమికీ, సమాజానికీ భారమే.

-చంద్రబాబు

కర్నూలు/అనంతపురం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జలగన్న జగన్‌కు(YS Jagan) ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్‌ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్‌ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని.. దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌రెడ్డి శవ రాజకీయాలు చేస్తూ లాభపడాలని చూస్తున్నాడన్నారు. ‘గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నాడు.


గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా..? జన్మనిచ్చిన తల్లికే భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా? తండ్రిలేని బిడ్డ అన్నాడు. ఒక్క చాన్స్‌ అన్నాడు. ముద్దులు పెట్టాడు. తల నిమిరాడు. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఐదేళ్ల పాలనలో మీలో ఎవరైనా బాగుపడ్డారా’ అని ప్రశ్నించారు. అధికార మదంతో విర్రవీగుతున్నాడని.. అందుకే ఆయనకు ‘జే గన్‌రెడ్డి’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాకపోతే మరెలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆయన్ను గెలిపిస్తే.. ఢిల్లీకి వెళ్లి ఫైరవీలు చేసుకున్నాడని.. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశాడని.. అన్ని రంగాలను సర్వనాశనం చేశాడని విమర్శించారు. రూ.13 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దైన్య పరిస్థితి తీసుకొచ్చాడని దుయ్యబట్టారు.


చివరకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేక పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని అన్నారు. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ ఐదుగురు బాగుపడితే.. రాష్ట్రం బాగుపడినట్లా అని నిలదీశారు. మోసం చేయడంలో జగన్‌ దిట్టని.. అబద్ధాలు చెప్పడం ఆయనకు పుట్టుకతో వచ్చిన విద్యని విమర్శించారు. ఇక్కడ పులిని అని చెప్పుకొనే జగన్‌.. ఢిల్లీలో పిల్లిగా మారాడని ఎద్దేవాచేశారు. ఆయన తమపై నోరు పారేసుకుంటున్నాడని, తామూ బూతులు తిట్టాలంటే ఒక్క నిమిషం పట్టదని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..


రక్తం తాగే జలగ..

లీటర్ల కొద్దీ ప్రజల రక్తం తాగే జలగ జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2004లో జగన్‌ ఆస్తి ఎంత..? ఈ ఐదేళ్లలో దోచుకున్నదెంత? రూ.5 లక్షల కోట్లు దోచేసిన జలగ జగన్‌రెడ్డి. బటన్‌ నొక్కి ఇచ్చిందెంత..? బొక్కింది ఎంత...? సమాధానం చెప్పాలి. పెట్రోలు, డీజిల్‌, కరెంటు చార్జీలు, మద్యం, నిత్యావసర సరుకుల ధరలు, సిమెంట్‌, ఇసుక, స్టీల్‌.. ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి జలగలా ప్రజల రక్తాన్ని తాగేశాడు.


నా ప్రశ్నలకు జవాబివ్వాలి..

జగన్‌ ఎప్పుడు మాట్లాడినా రాయలసీమ బిడ్డనంటాడు. నేనూ ఈ సీమ బిడ్డనే. గత ఎన్నికల్లో సీమలో 49 స్థానాల్లో వైసీపీని గెలిపించారు. అందుకు ఈ ప్రాంతానికి ఏమైనా చేశాడా? సీమ ద్రోహి. 2014 నుంచి 19 వరకు నేనేం చేశానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేం చేశావో చర్చించేందుకు సిద్ధమా? సీమలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాను. నువ్వు కేవలం రూ.2,500 కోట్లు ఖర్చుపెట్టావ్‌. తాగేందుకు నీరు లేక జనం.. పొలాలకు నీళ్లు రాక రైతులు విలవిలలాడుతున్నారు. అబద్ధాలు చెప్పడం... బొక్కడం.. దోచుకోవడమే ఆయన విధానం. భూరక్ష చట్టంతో మన భూములన్నీ ఆయన చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఆస్తులన్నీ కొట్టేస్తాడు జాగ్రత్త!


ఏం చేశారని నిలదీయండి..

వైసీపీ దొంగలు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఏం చేశారని నిలదీయండి. చొక్కా పట్టుకొని ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించండి. రాష్ట్రం సర్వనాశనమైంది. జగన్‌ పరిపాలన విధ్వంసకరం. ప్రజా వేదికను కూల్చివేసి.. అమరావతిని నాశనం చేశాడు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా తరిమేశాడు. ఎంపీ రఘురామరాజును లాకప్‌లో పెట్టించి, ఆయన్ను కొట్టిన దృశ్యాలను వీడియోలో చూసి ఆనంద పడిన దుర్మార్గుడు. వివేకా హత్యపై కోర్టుకు వెళ్లి ఒక ఆర్డర్‌ తీసుకొచ్చారు. వాస్తవాలు బయటకు రాకుండా ఎవరూ మాట్లాకుండా చేస్తున్నారు.


భవనాలకు రంగులేస్తే చదువొస్తుందా?..

స్కూల్‌ భవనాలకు వైసీపీ రంగులు వేసుకుంటే పిల్లలకు చదువు వస్తుందా? టీచర్లను నియమించాలి, చదువు చెప్పే వాతారణాన్ని కల్పించాలి. స్కూళ్లు మూడు కిలో మీటర్లకుపైగా దూరంలో ఉంటే చిన్న పిల్లలు, ఆడ పిల్లలను బడికి పంపిస్తారా? జగన్‌ డీఎస్సీ పరీక్ష నిర్వహించలేదు. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఊసే లేదు. మేం అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 25 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వర్క్‌ఫ్రం హోం ద్వారా అమెరికాలోని కంపెనీల్లో పనిచేసే విధంగా టెక్నాలజీని విస్తరిస్తాం. సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాం. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.


ఐదేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల అప్పు తెచ్చాడు. జనం పేరుతో రూ.13 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. ఇది జగన్‌ కడతాడా..? ఆయన రోతపత్రిక కడుతుందా? ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టుపెట్టి అప్పు తెచ్చిన దుర్మార్గుడు. ఈ ఎన్నికల్లో ఎన్డీయేదే అధికారం. నేను ఏ ప్రాంతానికి పోయినా.. నా జీవితంలో ఎన్నడూ చూడని స్పందన ప్రజాగళం సభలకు వస్తోంది. ఇది రాష్ట్రానికి శుభ సూచకం. మేం అధికారంలోకి రాగానే సంపద సృష్టిస్తాం... ఆదాయాన్ని పెంచుతాం.. ప్రజలకు పంచుతాం. టీడీపీతోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరుగుతుంది. రంజాన్‌ తోఫా, దుల్హన్‌ పథకం, విదేశీ విద్య తదితర పథకాలు అమలు చేసి, ఆ వర్గాలను ఆదుకున్నాం. గతంలోనూ ఎన్డీయేలో ఉన్నాం. ఒక్క ముస్లింకైనా అన్యాయం జరిగిందా? అని అన్నారు చంద్రబాబు.


వలంటీర్లకు న్యాయం చేస్తా..

వలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దు. రాజీనామా చేయాలని ఎవరైనా చెబితే.. చంద్రన్న వద్దని చెప్పాడని తిరగబడండి. వచ్చేది ఎన్టీయే ప్రభుత్వమే. వలంటీర్లందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 09:55 AM