Share News

YS Jagan: పథకాలు పీకేసి.. దళితులకు దగా చేసి..

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:42 AM

జగన్‌ సర్కారు వచ్చాక దళిత బిడ్డలకు ఉచిత కార్పొరేట్‌ విద్యను దూరం చేశారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కట్‌ చేశారు. రకరకాల నిబంధనలతో విదేశీ విద్యను దూరం చేసి పేద పిల్లలను విమానం ఎక్కకుండా చేశారు. ఎస్సీలకు సంబంధించి 10 రకాల విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు.

YS Jagan: పథకాలు పీకేసి..  దళితులకు దగా చేసి..

  • జగన్‌ పాలనలో 23 పథకాలు దూరం

  • విద్యకు సంబంధించే 10 నిర్వీర్యం

  • నిధుల్లేక గురుకులాలు అధ్వానం

  • బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దు

  • కఠిన నిబంధనలతో విదేశీ విద్య దూరం

  • పోటీ పరీక్షలకు కోచింగ్‌ కరువు

  • ఎస్సీ కార్పొరేషన్‌ పూర్తిగా నిర్వీర్యం

  • ముక్కలుగా చేసి నిధులివ్వని వైనం

  • స్వయం ఉపాధి సాయం నిలిపివేత

  • ఎస్సీ, ఎస్టీలపై ఉత్తుత్తి ప్రేమే

  • అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు

ఇదేనా ఎస్సీల ఉన్నతి?

జగన్‌ సర్కారు వచ్చాక దళిత బిడ్డలకు ఉచిత కార్పొరేట్‌ విద్యను దూరం చేశారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కట్‌ చేశారు. రకరకాల నిబంధనలతో విదేశీ విద్యను దూరం చేసి పేద పిల్లలను విమానం ఎక్కకుండా చేశారు. ఎస్సీలకు సంబంధించి 10 రకాల విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు. ‘నా ఎస్సీలు’ అని చెప్పుకొనే జగన్‌.. నిజంగా వారి ఉన్నతిని కోరుకుంటే నాణ్యమైన విద్యను దూరం చేస్తారా? ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలను కాలరాస్తారా? విద్యకు ఆర్థిక సాయాన్ని బంద్‌ చేస్తారా?

దళితుల అభివృద్ధి ఇలాగేనా?

ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. రుణాలు, సబ్సిడీలకు మంగళం పాడారు. ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. జగన్‌ సర్కారు దళితులకు సంబంధించి విద్యతో సహా మొత్తం 23 పథకాలను అటకెక్కించింది. ‘నా పేదలు’ అని చెప్పే జగన్‌కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎస్సీల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పథకాలను రద్దు చేస్తారా? సొంత కాళ్లపై నిలబడే అవకాశాలను దూరం చేస్తారా?

నాడు.. కళ కళ

పేదల సంక్షేమానికి వేలు, లక్షల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే చెబుతుంటారు. తమ హయాంలో చేసినంత సాయం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని గొప్పలకు పోతుంటారు. అయితే దళిత విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నత విద్యకు ఉపయోగపడే పథకాలను, మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడే పథకాలను నిర్వీర్యం చేశారు. స్వయం ఉపాధి పొందే పథకాలను రద్దు చేశారు.

ఒకటా.. రెండా... దళితులకు సంబంధించి 23 పథకాలను జగన్‌ సర్కారు నిర్వీర్యం చేసింది. గత ఐదేళ్లుగా ఎస్సీలకు ప్రత్యేకించి ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. ఒకప్పుడు దళిత విద్యార్థులకు దేవాలయాలుగా ఉన్న గురుకులాలను అధ్వాన్నంగా మార్చేసింది. పేద పిల్లల భోజనానికి సంబంధించి బిల్లులు కూడా సకాలంలో చెల్లించని దుస్థితి. కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా అందిస్తున్న పథకాలను సైతం కాలరాసింది.

దళితులకు సంబంధించి ప్రధానమైన భూమి, ఉపాధి, సంక్షేమం, విద్య లాంటి వాటికి ఈ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. ఎస్సీలను అన్ని రకాలుగా అణగదొక్కింది. రాష్ట్రంలో దళితుల జనాభా 16.41 శాతం ఉంది.

దళితుల సంక్షేమానికి జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి వారికే ఖర్చు చేయాలని చట్టం చెబుతోంది. అయితే అంబేడ్కర్‌ ఆశయాలకు అడుగడుగునా తూట్లు పొడుస్తోంది. ఎస్సీలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోవడమే కాకుండా సబ్‌ప్లాన్‌ నిధులను ఈ సర్కార్‌ నవరత్నాల కోసం వాడేసుకుంది. నవరత్నాలను అందరితో పాటే ఎస్సీలకు పంచుతున్నా.. ఎస్సీలకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నట్లు కాకి లెక్కలు చెబుతోంది.


కూలీలుగానే దళితులు..

ఎస్సీలకు గతంలో ఉన్న పథకాలన్నింటినీ వైసీపీ సర్కారు అటకెక్కించింది. ఆయా పథకాలకు నిధులు నిలిపేయడంతో నిర్వీర్యమయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం 1,606 మంది భూమి లేని ఎస్సీ మహిళలకు 2,386 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చింది. ఒక్కో ఎకరానికి రూ.15 లక్షల ధరతో భూమి కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఈ సర్కార్‌ వచ్చినప్పటి నుంచి ఈ పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీంతో భూమి లేని దళితులు వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు.

ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వీర్యం..

గతంలో ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్‌ కల్పతరువుగా ఉండేది. పలు పథకాలను ఈ కార్పొరేషన్‌ ద్వారా అందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి పథకాలతో పాటు చిన్నతరహా వ్యవసాయానికి సంబంధించి ఎస్సీ రైతులకు సహాయ సహకారాలందించారు. ముర్రా గేదెలు, మేలు రకపు ఆవులు, గొర్రెలు, మినీ డైరీ తదితర ప్రయోజనాలు కల్పించారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వెట్టి, జోగినులకు పునరావాస కార్యక్రమాలు, పేద రైతుల పొలాల్లో బోర్లు, పంపుసెట్లు, విద్యుత్‌ సౌకర్యం, భూమి అభివృద్ధి, భూమి లేని పేదలకు భూముల కొనుగోలు, ఇంటి స్థలాలను కొనుగోలు చేసి ఇవ్వడం వంటి పథకాలు అమలు చేశారు.

అలాగే ఎస్సీలకు వడ్డీ లేని రుణాలు, ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్‌, ఎన్‌ఎ్‌సకేఎ్‌ఫడీఎస్‌ లాంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలివ్వడం తదితర ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఏ కార్పొరేషన్‌కు కూడా నిధులు కేటాయించలేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్‌కు 2018-19లో రూ.900 కోట్లు కేటాయిస్తే.. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు.


నేడు.. నొక్కుడుతో సరి..

స్వయం ఉపాధి ఏదీ?

గత ప్రభుత్వంలో ప్రతి ఏటా వందలాది మంది ఎస్సీ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా పలు రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారు. దీని కోసం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏటా సుమారు రూ.400 కోట్ల దాకా ఖర్చు చేసేవారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 60 శాతం దాకా సబ్సిడీ అందించేవారు. ఒక్క ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2.66 లక్షల మంది రూ.3,800 కోట్ల వరకు స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధిపొందారు. డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న యువతకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి 485 ఇన్నోవా కార్లు, 294 ఇతర కార్లు అందజేశారు. వాటితో పాటు మురుగుకాల్వల పూడిక తీసే యంత్రాలు 660, 7500 బ్యాటరీతో నడిచే పవర్‌ ఆటోలు, ఇతర ప్యాసింజర్‌ వాహనాలను అందించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధి పథకానికి స్వస్తి పలికారు.

విదేశీ విద్య, విద్యోన్నతికి గండి..

చంద్రబాబు సర్కార్‌ 4,923 మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించింది. వారిలో 493 మంది దళిత విద్యార్థులు ఉన్నారు. అంబేడ్కర్‌ విదేశీ విద్య పేరిట ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున అప్పటి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అందుకోసం రూ.380 కోట్లు ఖర్చు చేసింది. జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత విదేశీ విద్య సాయాన్ని నిలిపేసింది. మూడున్నరేళ్లకు తిరిగి విదేశీ విద్యను ప్రారంభిస్తూ పథకంలో అంబేడ్కర్‌ పేరును తొలగించారు. రకరకాల నిబంధనలు పెట్టి దళితులకు విదేశీ విద్యను దూరం చేశారు.

అలాగే ఏపీ స్టడీ సర్కిల్స్‌తో పాటు విద్యోన్నతి పథకాన్ని రద్దు చేశారు. గతంలో వేలాదిమంది దళిత విద్యార్థులు ఏపీ స్టడీ సర్కిల్స్‌/అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్స్‌ ద్వారా లబ్ధి పొందారు. ఉన్నత విద్య తర్వాత పోటీ పరీక్షలు రాసేందుకు ఈ స్టడీ సర్కిల్స్‌ ద్వారా కోచింగ్‌ తీసుకునేవారు. టీడీపీ సర్కార్‌ ఢిల్లీ, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందే అవకాశం కల్పించింది. అప్పట్లో ఎస్సీలు 2313 మంది, ఎస్టీలు సుమారు వెయ్యిమంది దాకా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఒక్కో దళిత విద్యార్థికి రూ.1.20 లక్షల ఫీజుతో పాటు వసతి ఫీజు కూడా చెల్లించారు. ఇప్పుడు ఈ ఫలాలు అందకుండా చేశారు.

కార్పొరేట్‌ విద్యకు స్వస్తి..

గతంలో మెరికల్లాంటి పేద ఎస్సీ విద్యార్థులను ఎంపిక చేసి పేరున్న కార్పొరేట్‌ స్కూళ్లలో చేర్పించి నాణ్యమైన విద్య అందించేవారు. ఏటా లక్ష మందికిపైగా ఈ అవకాశాన్ని పొందేవారు. ఏడాదికి ఒక్కో విద్యార్థికి హాస్టల్‌, బుక్స్‌, ఫీజు మొత్తం కలిపి రూ.30 వేలు చెల్లించేవారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో సీట్లకు అగ్రవర్ణాల విద్యార్థులతో దళిత బిడ్డలు పోటీ పడేవారు. ఈ పథకం కింద చదువుకున్న వారు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయినవారూ ఉన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెస్ట్‌ అవైలబుల్‌, కార్పొరేట్‌ కళాశాలల అడ్మిషన్లకు స్వస్తి పలికారు.


పథకాలు కట్‌

చంద్రబాబు ప్రభుత్వం 2018 జూలై నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత పిల్లల నోటికాడ ముద్ద తీసేశారు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన గురుకులాలు చంద్రబాబు సర్కార్‌ దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడ్డాయి. మెరుగైన విద్యతో పాటు సౌకర్యాలు ఉండేవి. ఇక్కడ చదువుకున్న పలువురు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నేడు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులుగా పనిచేస్తున్నారు. అలాంటి గురుకులాలను జగన్‌ నిర్వీర్యం చేశారు. బడ్జెట్‌ తగ్గించడంతో మెనూ తగ్గిపోయింది. వసతులు కూడా కరువయ్యాయి.

For More Andhra Pradesh and Telugu News..

Updated Date - Apr 26 , 2024 | 09:26 AM