Share News

AP Elections 2024: గొడవల తర్వాత తాడిపత్రికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం..!

ABN , Publish Date - May 23 , 2024 | 12:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ మరుసటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో భద్రతకు వచ్చిన పోలీసులకు చుక్కలు కనపడుతున్నాయ్..

AP Elections 2024: గొడవల తర్వాత తాడిపత్రికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం..!

  • తాడిపత్రిలో భారీగా బలగాలు

  • సరైన భోజనం అందక ఇబ్బందులు

  • తడిసి మోపెడవుతున్న భోజనం ఖర్చు

  • భరించేది ఎవరని అధికారుల ఆవేదన

  • లాడ్జిలు.. కల్యాణ మండపాల్లో వసతి

తాడిపత్రి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) గొడవల నేపథ్యంలో భద్రత విధులకు వచ్చిన పోలీసులకు భోజనం కష్టాలు వెంటాడుతున్నాయి. సరైన భోజనం అందక సిబ్బంది.. భోజనం ఏర్పాట్లకు నిధులు లేక పోలీసు అధికారులు తిప్పలు పడుతున్నారు. పోలింగ్‌, ఆ మరుసటి రోజున గొడవలతో తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ కావడంతో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తుకు చర్యలు తీసుకుంది. సాధారణ పోలీసులతోపాటు ర్యాపిడ్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు. ఇక్కడ సుమారు వెయ్యి మంది బందోబస్తు విధుల్లో ఉన్నట్లు సమాచారం. కర్నూలు, అనంతపురం బెటాలియన్ల నుంచి వచ్చిన బలగాలతోపాటు కేరళ, తమిళనాడు, నాగాలాండ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఎన్నికల భద్రతకు సిబ్బంది వచ్చారు. వీరందరూ భోజనం సమస్యను ఎదుర్కొంటున్నారు. - తాడిపత్రి టౌన్‌


Tadipatri-Incident-2.jpg

డీఎస్పీ సస్పెండ్‌ అయ్యాక..

బందోబస్తుకు వచ్చిన బలగాలకు భోజనం ఖర్చు రోజుకు రూ.2 లక్షల దాకా అవుతోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సమకూర్చేందుకు భారీగా ఖర్చు అవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఆ మేరకు నిధులు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. డీఎస్పీ గంగయ్య తాడిపత్రిలో ఏడాదికి పైగా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన దాతల సహకారంతో పోలీసు బలగాలకు భోజనం ఏర్పాటు చేశారు. కానీ హింసాత్మక ఘటనల కారణంగా ఆయన సస్పెండ్‌ అయ్యారు. దీంతో భద్రతా సిబ్బంది మంచిచెడ్డలు చూసేవారే కరువయ్యారు. డీఎస్పీ గంగయ్య వెళ్లిన మరుసటిరోజు నుంచి పోలీసు బలగాలకు టిఫిన్‌, భోజనం పెట్టేనాథుడే లేడన్న విమర్శలు వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో బందోబస్తుగా ఉన్న పోలీసులు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు రాలేక ఉన్నచోటే సొంత డబ్బులతో భోజనం చేస్తున్నారు.

Tadipatri-Police.jpg

వసతికీ ఇబ్బందులే..

బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి సరైన వసతి కూడా కల్పించలేదు. పట్టణంలోని పలు కల్యాణమండపాలు, లాడ్జిలను వసతికి వినియోగిస్తున్నారు. పోలింగ్‌ జరిగే రెండు రోజులే కదా అని లాడ్జిల యజమానులు గదులను ఇచ్చారు. కానీ ఆ తరువాత గొడవలు జరగడంతో వచ్చినవారు కదలడం లేదు. కౌంటింగ్‌ పూర్తయ్యాక కూడా.. వచ్చే నెల 19వ వరకూ భద్రత కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సమస్య ఎప్పుడు పరిష్కారమౌతుందో.. తమ గదులను ఎప్పుడు ఖాళీ చేస్తారో అని లాడ్జిల యజమానులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కాబట్టి ఏమీ అనలేక మిన్న కుండిపోతున్నారు.


Tadipatri-Food.jpg

నెలకు రూ.80 లక్షలు..

తాడిపత్రిలో బందోబస్తులో ఉన్న పోలీసులకు భోజనం పెట్టేందుకు నెలకు రూ.80 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 14 నుంచి ర్యాపిడ్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, రాయలసీమలోని పలు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది తాడిపత్రిలోనే ఉంటున్నారు. జూన్‌ 4న కౌంటింగ్‌ అనంతరం జూన్‌ 19 వరకు బలగాలు కొనసాగించనున్నట్లు తెలిసింది. అంటే.. నెలరోజులకు పైగానే బలగాలు ఇక్కడ ఉంటాయి. ఆ తరువాత ఏవైనా గొడవలు జరిగితే బలగాలను కొనసాగించాల్సి వస్తుంది. అప్పటి దాకా ఖర్చులు ఎవరు భరిస్తారన్నదే ప్రశ్న.


Tadipatri-Food-Police.jpg

సీనియర్లకు ఇబ్బందులు..

ఓ ఉన్నతాధికారి ఆదేశాలతో తాడిపత్రి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు సిబ్బందికి వంట తయారు చేసి వడ్డిస్తున్నారు. మెనూ ప్రకారం ఉదయం పొంగళి, ఉప్మా, మధ్యాహ్నం, రాత్రి అన్నం, పప్పు, రసం, మజ్జిగ పెడుతున్నారు. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్లు రాత్రి పూజ భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. బీపీ, షుగర్‌ ఉన్నవారు రాత్రిళ్లు అన్నం తినడం లేదు. సొంత డబ్బులు వెచ్చించి.. వేరే చోట భోజనం చేస్తున్నారు. మరికొందరు దొరికిన భోజనంతో సర్దుకుంటున్నారు.


తాడిపత్రి పరిసరాల్లోని 10 కి.మీ. పరిధిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతపురం రోడ్డులో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, కడప రోడ్డు, యల్లనూరు రోడ్డు శివారు, పుట్లూరురోడ్డు శివారు, చుక్కలూరు రోడ్డు, పప్పూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక్కడ విధుల్లో ఉన్నవారికి పట్టణ పోలీస్‌స్టేషన్‌లోనే వంటావార్పు ఏర్పాటు చేశారు. బందోబస్తులో ఉన్నవారు ఇక్కడికే వచ్చి భోజనం చేసి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతదూరం వచ్చేందుకు వాహనాలు లేక.. చెక్‌పోస్టుల సమీపంలో దొరికే ఆహారంతోనే సిబ్బంది సర్దుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 12:20 PM