శ్రీలక్ష్మి.. నీ మహిమలూ!
ABN , Publish Date - Mar 30 , 2024 | 05:49 AM
‘మీరు నవ్వుకున్నా సరే! నేను చేసేది చేస్తా! తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే అమలు చేస్తా!’... ఇదీ ఆ మహిళా ఐఏఎస్ వ్యవహార శైలి! అర్హులను మూలకు తోసేసి.. అస్మదీయులకు బిల్లులు చెల్లించడమే అంతిమ లక్ష్యం.
అడ్డగోలు జీవోలు.. అంతే వేగంగా వెనక్కి
నిబంధనలు తెలిసీ తప్పుడు ఆదేశాలు
పూర్తికాని పనులకూ బిల్లుల చెల్లింపు
రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా జీవోలు
కీలక నిబంధన ఉల్లంఘనతో ఆందోళన
తప్పుడు ఆదేశాలను బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’
మూడు జీవోలు ఉపసంహరించుకున్న శ్రీలక్ష్మి
పాత అనుభవాలు మరిచిపోయి అవే తప్పులు
ఆమె పేరు.. శ్రీలక్ష్మి! (IAS Srilakshmi) సీనియర్ ఐఏఎస్ అధికారి! రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలను అప్పుడే మరిచిపోయినట్లున్నారు! ఇప్పుడూ అదే పని చేస్తున్నారు! ‘తాడేపల్లి క్యాంపు’ చెప్పినట్టల్లా నిధులు విడుదలకు అడ్డగోలు జీవోలు జారీ చేశారు. చివరికి... పరువు పోగొట్టుకున్నారు!
TDP: టీడీపీకి కీలక నేత రాజీనామా.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న మరో ముగ్గురు..!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘మీరు నవ్వుకున్నా సరే! నేను చేసేది చేస్తా! తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే అమలు చేస్తా!’... ఇదీ ఆ మహిళా ఐఏఎస్ వ్యవహార శైలి! అర్హులను మూలకు తోసేసి.. అస్మదీయులకు బిల్లులు చెల్లించడమే అంతిమ లక్ష్యం. ఆమె ఎవరో కాదు! ప్రస్తుతం రాష్ట్రంలోనే (Andhra Pradesh) అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి, మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి! రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కంటే కూడా ఆమెనే సీనియర్. అయినా, జీవోల్లో ఘోర తప్పిదాలు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా... ‘పూర్తి కాబోయే పనులకూ’ బిల్లులు మంజూరు చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో శ్రీలక్ష్మి దాదాపు 9 జీవోలిచ్చారు. ఇందులో మూడు ఇప్పుడు వెనక్కి వచ్చేశాయి. దీంతో శ్రీలక్ష్మి పరువు పోయినట్లయింది.
ఎన్నికల్లో ప్రయోజనాలకే...
మునిసిపాలిటీల్లో ఐదేళ్లుగా వందలకోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ... ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోసమే ‘ఎంపిక’ చేసిన కొన్ని మునిసిపాలిటీలకు హఠాత్తుగా నిధులు విడుదల చేశారు. అందులో... టీడీపీ యువనేత నారా లోకేశ్ బరిలో ఉన్న మంగళగిరి కూడా ఒకటి. అందులోనూ... ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ‘పూర్తి కాబోయే పనులకూ’ నిధులు విడుదల చేస్తూ శ్రీలక్ష్మి జీవో ఇచ్చేశారు. అలాగే.. డోన్, నర్సీపట్నం మునిసిపాలిటీలకు సంబంధించిన మరో రెండు జీవోలు కూడా ఆరోజే ఇచ్చారు. వీటిలో ‘పూర్తి కాబోయే పనులు’ అనే ప్రస్తావన లేనప్పటికీ... ఇవీ ఆ బాపతువే. పనులు పూర్తయ్యాక బిల్లులు చెల్లించేందుకే చాలా తతంగం ఉంటుంది. సంబంధిత చీఫ్ ఇంజనీర్ లేదా ఆ పనులు పర్యవేక్షించిన ఇంజనీర్లు ఏ పనులు ఎంత శాతం పూర్తయ్యాయి, ఎంత ఖర్చయింది తదితర వివరాలు పేర్కొంటూ సంతకం చేసి సర్టిఫై చేయాలి. ఈ సర్టిఫైడ్ పత్రం లేకుండా తమ సెక్రటరీలకు/ఆర్థిక శాఖకు చెల్లింపులకోసం ఫైలు కూడా పంపరు. కానీ, ఈ 3 జీవోల విషయంలో ఏ ఒక్కదానికీ ఇలాంటి సర్టిఫైడ్ పత్రం లేదని తెలిసింది. పనులే పూర్తికానప్పుడు సర్టిఫైడ్ పత్రాలు ఎలా వస్తాయి? దీంతో... అతి కీలకమైన నిబంధనను ఉల్లంఘించామనే భయం మొదలైంది. దీనికి తోడు అడ్డగోలు జీవోల సంగతి ‘ఆంధ్రజ్యోతి’ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఆ 3 జీవోలను వెనక్కి తీసేసుకున్నారు.
పాత పంథాలు.. పాత బంధాలు!
వైసీపీ నేతలతో శ్రీలక్ష్మి బంధం ఈనాటిది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓబుళాపురం గనుల ఫైలులో కీలకమైన ‘క్యాప్టివ్ మైనింగ్’ పదాన్ని ఎత్తేసి జీవోలు ఇచ్చింది ఈమే. ఈ కేసులో శ్రీలక్ష్మి అరెస్టు కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమెను తెలంగాణ కేడర్‌కు కేటాయించినప్పటికీ... జగన్ అధికారంలోకి వచ్చాక పరుగు పరుగున ఏపీకి వచ్చేశారు. ఆమెకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. రోజుల వ్యవధిలోనే రెండు పదోన్నతులు ఇచ్చేశారు. శ్రీలక్ష్మి ఐఏఎ్‌సగా రూల్స్‌ను పక్కనపెట్టేసి ‘తాడేపల్లి’ ఆర్డర్స్‌ను మాత్రమే అమలు చేస్తున్నారని అధికార వర్గాలే చెబుతాయి. ఇదే శ్రీలక్ష్మి... అమరావతి రైతులను మాత్రం పట్టించుకోవడంలేదు. 22,948 రైతు కుటుంబాలు నేటికీ కౌలు అందక విలవిల్లాడిపోతున్నారు. అసైన్డ్ రైతులకు మూడేళ్ల నుంచి కౌలు ఇవ్వడం లేదు.
2023 మేలో అమరావతి రైతులకు అందాల్సిన కౌలు 10 నెలల తర్వాత కూడా పడలేదు.గుల్జార్‌దీ అదే దారి మార్చి 16 శనివారం! సచివాలయానికి సెలవు. అయినప్పటికీ ఆర్థిక శాఖ మంగళగిరి పరిధిలోకి వచ్చే తాడేపల్లి-మునిసిపల్ కార్పొరేషన్‌కు రూ.74 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ బీఆర్‌వో జీ వో ఇచ్చింది. దీని ఆధారంగానే మార్చి 23న శ్రీలక్ష్మి నిధులు విడుదలకు జీవో ఇచ్చారు. ఏ పని ఎంత వరకైందన్న ఆరా తీయకుండా ఆర్థిక శాఖ సెక్రట రీ గుల్జార్ బీఆర్‌వో జారీ చేశారు. అయితే... మునిసిపల్ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిపాదనలో ‘పూర్తికాబోయే పనుల కోసం అదనపు నిధులు’ అన్న వాక్యం లేదని తెలిసింది. ఈ వాక్యాన్ని సచివాలయంలోనే కలిపారని తెలిసింది. ముందుగా బీఆర్‌వో ఇచ్చింది ఆర్థిక శాఖే. అక్కడే ఏదైనా మతలబు జరిగిందా? లేక... తాడేపల్లి ఆదేశాల మేరకు మునిసిపల్ శాఖ చేసిన ఒత్తిళ్ల మేరకు ఆ వాక్యం కలిపారా అన్నది తేలాలి.