గనుల వెంకటరెడ్డికి జైల్లో మర్యాదలు..?
ABN , Publish Date - Nov 29 , 2024 | 05:02 AM
గనుల ఘనుడు వెంకటరెడ్డికి విజయవాడ జైల్లో సకల మర్యాదలు అందాయా..?
టీవీ ఏర్పాటుపై వివాదం.. విచారణకు విశ్వజీత్ ఆదేశం
అది హెచ్‌పీసీఎల్ నుంచి వచ్చిందన్న జైలు అధికారులు
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గనుల ఘనుడు వెంకటరెడ్డికి విజయవాడ జైల్లో సకల మర్యాదలు అందాయా..? సహజ సంపద దోపిడీ వ్యవహారంలో ఏసీబీ అరెస్టు చేసిన మైనింగ్ మాజీ డైరెక్టర్‌కు జైలు అధికారులు టీవీ, రిఫ్రిజరేటర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారా..? ఇటీవలే బెయిలుపై విడుదలైన వెంకటరెడ్డిపై విజయవాడ జైలు అధికారులకు అంత ప్రేమ ఎందుకు..? రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ (ఇన్‌చార్జి డీజీ ప్రిజన్స్) విచారణకు ఆదేశించడంతో జైలు అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని ఇసుక, మైనింగ్ లాంటి సహజ సంపద వైసీపీ ప్రభుత్వంలో దోపిడీకి గురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు వేల కోట్ల కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన వెంకటరెడ్డిని గత నెలలో హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.
న్యాయస్థానం ఆదేశాల మేరకు విజయవాడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. అయితే వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో గత నెల 11న టీవీ, రిఫ్రిజిరేటర్ విజయవాడ జైలుకు వచ్చాయి. తాజాగా ఆ విషయం వెలుగులోకి రావడంతో వెంకటరెడ్డి తనకోసమే వాటిని తెప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే జైళ్లలో ఖైదీల కోసం దాతలు విరాళంగా ఇలాంటివి ఇస్తుంటారని, అధికారికంగా వాటిని తీసుకుని పై అధికారులకు ర్యాటిఫికేషన్‌కు పంపుతామని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
విజయవాడ జైలుకు వచ్చిన టీవీని కూడా గుంటూరు జిల్లాలో రెండు పెట్రోలు బంకులు ఏర్పాటుచేసిన హెచ్‌పీసీఎల్ కాంట్రాక్టరు ఇచ్చారని చెబుతున్నారు. ఆ టీవీని బ్యారక్‌లో పెట్టాం తప్ప వెంకటరెడ్డి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయమై హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ మాట్లాడుతూ.. ‘డొనేషన్స్ వస్తుంటాయి. ఇక్కడ టీవీ కూడా అలానే వచ్చింది. ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. తీసుకున్నాక ర్యాటిఫికేషన్ చేస్తారు.. కాకపోతే నా అనుమతి లేకుండా తీసుకోవద్దని చెప్పా.. అయినా తీసుకోవడంపై విచారణకు ఆదేశించా. జైళ్ల శాఖ ఐజీ నివేదిక ఇచ్చిన తర్వాత తప్పు ఉంటే చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.