Share News

Gummidi Sandhyarani : పౌష్టికాహార లోపంతో ఎవరూ చనిపోకూడదు

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:17 AM

రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 544 గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించేందుకు ప్రతిపాదిస్తూ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు.

Gummidi Sandhyarani  : పౌష్టికాహార లోపంతో ఎవరూ చనిపోకూడదు

రంగంలోకి ఫీడర్‌ అంబులెన్సులు

మళ్లీ గిరిజన గర్భిణి వసతి గృహాలు

గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ

మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి బాధ్యతలు

మంత్రిని పట్టించుకోని మహిళా

సంక్షేమ శాఖ అధికారులు

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 544 గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించేందుకు ప్రతిపాదిస్తూ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారులు సరిగాలేని ప్రాంతాలకు ఫీడర్‌ అంబులెన్స్‌లను తిరిగి ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. గిరిజన గర్భిణిల వసతి గృహాలను వివిధ గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. త్వరలో ఐటీడీఏ, ఐసీడీఎ్‌సలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం’ అని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌దండే, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరక్టర్‌ మురళి పాల్గొన్నారు.

పత్తాలేని అధికారులు

మంత్రిగా ఎవరు పదవీబాధ్యతలు చేపడుతున్నా ఆయా శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, కమిషనర్‌లు కచ్చితంగా హాజరు కావాలి. అయితే సోమవారం మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి బాధ్యతలు చేపడతున్న సందర్భంలో సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పత్తా లేరు. మంత్రికి ఆయా శాఖల్లోని వివిధ విభాగాలకు సంబంధించి పూర్తి వివరాలతో నోట్‌ తయారుచేసి ఇవ్వాల్సిన మహిళా శిశు సంక్షేమ అధికారులు అసలు పట్టించుకోలేదు. జిల్లాల నుంచి ఒకరిద్దరు మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన పీడీలు మాత్రమే హాజరయ్యారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, కమిషనర్‌, ఇతర విభాగాలకు చెందిన ఏ అధికారీ రాలేదు. దీంతో మంత్రి నివ్వెరపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు చేపడుతుంటే సమాచార శాఖ అధికారులు ఉదయం 10.30 గంటలకు సమాచారమిచ్చారు. దీంతో పలువురు మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పూర్తిగా గిరిజన మహిళా మంత్రిని విస్మరించడంతో సన్నిహితవర్గాల వద్ద మంత్రి వాపోయినట్లు తెలిసింది. జగన్‌ ప్రభుత్వంలో చెప్పకముందే చకచకా పనిచేసుకుంటూ వెళ్లిన ఉన్నతాధికారులు ఇప్పుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు అధికారులే నివ్వెరపోతున్నారు. గిరిజన మంత్రి పట్ల ఇంత అలసత్వం ప్రదర్శించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 05:19 AM