Share News

ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ ట్రైన్‌

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:31 AM

ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ను కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు....రాష్ట్ర ఎంపీలకు ఈ విషయం వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ ట్రైన్‌
Bullet Train To Andhra Pradesh

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌,

అమరావతిని కలుపుతూ ఏర్పాటు

దీనికోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాక్‌

పూర్తి ప్రతిపాదనల తర్వాత ప్రకటన

ఢిల్లీలో ఎంపీలకు వెల్లడించిన చంద్రబాబు


అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ను కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు....రాష్ట్ర ఎంపీలకు ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వివిధ విషయాలపై మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీలో అందుబాటులో ఉన్న కొందరు కూటమి ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రతిపాదన గురించి చెప్పారు. దేశంలో మొదటి బుల్లెట్‌ ట్రైన్‌ను కేంద్ర ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు మార్గాల్లో ఈ హై స్పీడ్‌ రైళ్లను నడపాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో దక్షిణాదిలో రెండు మార్గాలు ఉన్నాయి. చెన్నై నుంచి బెంగళూరు మీదుగా మైసూరు వరకూ ఒక ట్రైన్‌, ముంబాయి నుంచి హైదరాబాద్‌కు మరో ట్రైన్‌ను ఇందులో ప్రతిపాదించారు. మొదటి దశ ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్‌ లేదు. కాని తాజాగా ఏపీని కూడా ఇందులో చే ర్చినట్లు ముఖ్యమంత్రి.... ఎంపీలకు తెలిపారు. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, అమరావతి నగరాలు కలిసేలా బుల్లెట్‌ రైళ్లు నడపడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాక్‌ వేయాల్సి ఉంటుందని, పూర్తి ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందని ఆయన పేర్కొన్నారు.


రామాయపట్నంపై బీపీసీఎల్‌ మొగ్గు

రూ.అరవై వేల కోట్ల పెట్టుబడితో భారీ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న భారత్‌ పెట్రోలియం కంపెనీ... రామాయపట్నంపై మొగ్గు చూపుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎంపీలకు తెలిపారు. ఈ కంపెనీ తన రిఫైనరీ ఏర్పాటుకు మూడు రాష్ట్రాలను పరిశీలించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకొంది. ఏపీలో మూడు ప్రాంతాలను ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపాడు (శ్రీకాకుళం) పోర్టు ప్రాంతాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఆ కంపెనీ....రామాయపట్నం వైపు మొగ్గు చూపుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రామాయపట్నం నెల్లూరు జిల్లాలో కందుకూరు ప్రాంతంలో ఉంది. వెయ్యి ఎకరాల్లో రూ. అరవై వేల కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ రిఫైనరీ ఆ ప్రాంత స్వరూపాన్ని మార్చివేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రిఫైనరీ ఏర్పాటుకు మచిలీపట్నం పోర్టు ప్రాంతాన్ని ఎంపిక చేసే అవకాశాలు పరిశీలించాలని బందరు ఎంపీ బాలశౌరి ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని కోరారు. బీపీసీఎల్‌ తనకు నచ్చిన ప్రాంతాన్ని తాను ఎంపిక చేసుకొంటుందని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పారు.


గ్రీన్‌ హైడ్రోజన్‌లో లక్ష కోట్ల పెట్టుబడి

విశాఖపట్నం ప్రాంతంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు రాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు వస్తోందని, దేశంలోనే ఇది అతి పెద్ద ప్రాజెక్టని ఆయన వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనాల్లో ఇది కొత్త తరం టెక్నాలజీకి సంబంధించిందని, ఇక్కడ ఉత్పత్తి అయిన గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఎగుమతి చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని ఆయన ఎంపీలకు చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 09 , 2024 | 08:37 AM