Share News

జనవరిలో కొత్త రేషన్‌కార్డులు

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:19 AM

దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలో అర్హత కలిగిన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనుంది.

జనవరిలో కొత్త రేషన్‌కార్డులు
New Ration Cards

కొత్తగా పెళ్లైన జంటలకు, అర్హత ఉన్న పేదలకు తొలి ప్రాధాన్యం

సర్కారుపై ఆర్థిక భారం పడకుండా పౌరసరఫరాలశాఖ కసరత్తు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలో అర్హత కలిగిన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనుంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కార్డులను రీ డిజైన్‌ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్‌తో అందజేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. రేషన్‌కార్డుల రూపకల్పన, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా అర్హులైన పేదలకు కొత్త కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు చేస్తోంది.


cm-chandrababu-naidu.jpg


కొత్తకార్డుకు డిజైన్

కొత్తకార్డులకు అధికారులు డిజైన్లు పరిశీలిస్తున్నారు. వాటిలో లేత పసుపు రంగు కార్డుపై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. గత వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు రోజుల్లోనే మంజూరు చేస్తామంటూ ఆర్భాటం చేసింది. దీంతో పెళ్లిళ్లు చేసుకుని కొత్త కాపురాలు పెట్టిన జంటలు, పేదరికంలో మగ్గిపోతున్నా రకరకాల కారణాలతో రేషన్‌కార్డు లేనివారు వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ రేషన్‌కార్డులను మంజూరు చేస్తే అదనపు ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో జగన్‌ సర్కారు నెమ్మదిగా కొత్త కార్డుల జారీ అంశాన్ని అటకెక్కించింది. దాంతో గత ప్రభుత్వంలో కొత్తకార్డుల కోసం వచ్చిన 30,611 దరఖాస్తులతోపాటు స్ల్పిట్‌ కార్డుల కోసం వచ్చినవి 46,918, ఉన్న కార్డుల్లో సభ్యుల చేర్పుల కోసం వచ్చినవి 2,13,007, తొలగింపు కోసం వచ్చినవి 36,588, అడ్రస్‌ మార్పు కోసం వచ్చిన 8,263, కార్డుల సరెండర్‌ కోసం వచ్చినవి 685 కలిపి మొత్తం 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండిపోయాయి. కొత్త దంపతులకు కొత్త కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబాలకు ఉన్న రేషన్‌కార్డుల నుంచి వీరి పేర్లు తొలగించాల్సి ఉంది. దీనికి గత వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా వారికి ఐదేళ్లుగా రేషన్‌కార్డులు అందలేదు.


ఆర్థిక భారం పడకుండానే 1.5 లక్షల కార్డుల జారీ..

రాష్ట్రంలో ప్రస్తుతం 1.48కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 90 లక్షల కార్డ్డులను జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ) కింద కేంద్రం గుర్తించింది. వాటికి మాత్రమే ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకులపై రాయితీ అందిస్తోంది. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులపై ఇస్తున్న సబ్సిడీకి అయ్యే ఆర్థిక భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. పీహెచ్‌హెచ్‌(ప్రయారిటీ హౌస్‌హోల్డ్‌) రేషన్‌కార్డులను కూడా ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండానే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం రేషన్‌కార్డుల వినియోగంపై కాలానుగుణ సమీక్షలు చేస్తున్నారు. ఆ సార్టింగ్‌ డేటా ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని 17,941 అంత్యోదయ అన్న యోజన(ఏఏవై), మరో 1,36,420 పీహెచ్‌హెచ్‌ కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్‌ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. ఆ కార్డులను తొలగిస్తే ఏడాదికి రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. వాటి స్థానంలో అర్హులైనవారికి కొత్త కార్డులు మంజూరు చేయవచ్చని పౌరసరఫరాలశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారమూ పడకుండానే 1.5 లక్షలకుపైగా పేద కుటుంబాలకు జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే దీనికి ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి

RK Kothaapluku : మరీ ఇంత నీచమా?

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Nov 03 , 2024 | 12:57 PM