Share News

YSRCP:ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు.. బుద్ధి మారదా..

ABN , Publish Date - Oct 09 , 2024 | 06:52 PM

హర్యానా ఫలితాలపై స్పందించిన జగన్.. అక్కడి ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పును అవమానించేలా జగన్ మాట్లాడారనే విమర్శలు..

YSRCP:ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు.. బుద్ధి మారదా..
YS Jagan

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజా తీర్పును అపహస్యం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే ఒకలా.. ప్రతికూలంగా వస్తే మరోలా మాట్లాడటం ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులకు అలవాటుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో హర్యానా ఫలితాలపై స్పందించిన జగన్.. అక్కడి ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పును అవమానించేలా జగన్ మాట్లాడారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. దీంతో 175 శాసనసభ స్థానాలున్న ఏపీలో వైసీపీ 11 సీట్లను గెలుచుకోగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైసీపీ ప్రజలు చేప్పిన స్పష్టమైన తీర్పుపై అనుమానాలను వ్యక్తం చేస్తూనేఉంది. 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజల విజయంగా చెప్పిన వైసీపీ అధ్యక్షులు జగన్.. 2024 ఎన్నికల ఫలితాన్ని ఎందుకు అలా చూడటం లేదని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. 2019 ఫలితాలను స్వాగతించిన వైసీపీ.. 2024 ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేయడంలో ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


హర్యానా ఫలితాలపై..

ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా హర్యానా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని జగన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఏపీలోలాగే హర్యానాలో ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని, ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రసీ ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలంటూ చెప్పుకొచ్చారు. హర్యానా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని భావించిన కాంగ్రెస్ అంచనాలు తప్పడంతో ఆ పార్టీ నేతలు ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం తీరుపైనా ప్రశ్నలు సంధించారు. వార్యానాలో మొత్తం 90 సీట్లకు 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. ఒక్కో నియోజకవర్గంలో ఫలితం ఒక్కో విధంగా ఉంటూ వచ్చింది. మొదటి రౌండ్‌లో ఫలితం ఒకలా ఉండగా.. రౌండ్ రౌండ్‌కు మారుతూ వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సి ఉంటుంది. అలాకాకుండా తమకు ప్రతికూలంగా ఫలితం వస్తే ఈవీఎంలను తప్పుపట్టడం, అనుకూలంగా ఫలితం వస్తే ప్రజాస్వామ్యం గెలిచిందంటూ ప్రకటనలు చేయడం ఓటర్లను అవమానించడమే అవుతుందన్న చర్చ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్‌లో ఫలితాన్ని స్వాగతించిన కాంగ్రెస్.. హర్యానాలో మాత్రం ఏదో జరిగిందంటూ ప్రచారం చేయడం, దానిపై జగన్ స్పందించడం చూస్తుంటే ప్రజల తీర్పును వైసీపీ జీర్ణించుకోలేకపోతుందనే విషయం స్పష్టమవుతోందని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 09 , 2024 | 07:02 PM