Share News

IPS Officer: పీటల మీద ఆగిన ఐపీఎస్ వివాహం... కార్యకర్తలు ఆందోళన

ABN , Publish Date - Dec 18 , 2024 | 09:11 AM

గుజరాత్ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన యువ ఐపీఎస్ అధికారి వివాహం పెళ్లి పీటల మీద నిలిచిపోయింది. దీంతో వధువు తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది.

IPS Officer: పీటల మీద ఆగిన ఐపీఎస్ వివాహం... కార్యకర్తలు ఆందోళన
Gujarath Cader IPS Officer

గుంటూరు, డిసెంబర్ 18: వివాహం అంటేనే వధువరుల బంధువుల హడావుడి. అదే రాజకీయ నాయకుల ఇంట వివాహ వేడుక అంటే.. ఆ హడావుడి ఇంకా కాస్తా ఎక్కువగా ఉంటుంది. ఆ హడావుడే కొన్ని సార్లు పలు ఇబ్బందులకు కారణమవుతోంది. ఒక్కొక్కసారి ఆది విపరీతంగా పరిణమిస్తే.. పీటల మీద పెళ్లి సైతం ఆగిపోతుంది. అదే జరిగింది. పీటల మీద ఐపీఎస్ అధికారి వివాహం ఆగిపోయింది. దీంతో పెద్దలు రంగంలోకి దిగారు. దాంతో పెళ్లి ఒక రోజు ఆలస్యంగా జరగనుంది.

Also Read: ఏపీ మళ్లీ భారీ వర్షాలు..


ఇంతకీ ఏం జరిగిందంటే..

గుంటూరు నగరానికి చెందిన ఐపీఎస్ అధికారితో తెలంగాణలోని మహబూబ్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుమార్తెతో పెద్దలు వివాహం నిశ్చయించారు. మంగళవారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో వివాహ వేడుక జరగనుంది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ నుంచి భారీగా పార్టీ కేడర్ గుంటూరుకు తరలి వచ్చింది. ఆ క్రమంలో పెళ్లి కుమారుడు ఇంటి నుంచి కాంగ్రెస్ జెండాలతో భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు పార్టీ కేడర్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నం మంచిది కాదని పార్టీ కేడర్‌ను ఐపీఎస్ బంధువులు వారించారు. అందుకు వధువు తరఫు బంధువులు ససేమిరా అన్నారు.


ఐపీఎస్ అధికారి కావడంతో..

ఈ నేపథ్యంలో వరుడు ఐపీఎస్ అధికారి కావడంతో.. పార్టీ జెండాలు మంచిది కాదంటూ.. పెళ్లి కుమార్తె బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా వధువు బంధువులు వ్యవహరించారు. దీంతో యువ ఐపీఎస్ అధికారి ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఈ పెళ్లి చేసుకొనేందుకు ఐపీఎస్ అధికారి నిరాకరించాడు. ఈ విషయం తెలిసి.. పెళ్లి కుమార్తె తల్లికి తీవ్ర గుండెపోటు వచ్చింది.


ఆందోళనకు దిగిన పార్టీ కేడర్..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేడర్.. ఐపీఎస్ అధికారి నివాసం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.


ఏడడుగుల కోసం ఏడుగంటల పాటు చర్చలు

ఐపీఎస్ అధికారిని వివాహానికి ఒప్పించేందుకు.. చర్చి పెద్దలు, పాస్టర్లు చర్యలు చేపట్టారు. గత అర్థరాత్రి 12.00 గంటల నుంచి బుధవారం ఉదయం 7.00 గంటల వరకు చర్చలు జరిగాయి. చివరకు ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. బుధవారం.. అంటే ఈ రోజు సాయంత్రం.. అదే వివాహ వేదికగా పెళ్లి ముహూర్తం ఇరు వర్గాల పెద్దలు కలిసి నిశ్చయించారు. ఈ ఐపీఎస్ అధికారి గుజరాత్ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అదీకాక.. జిల్లాలో సదరు కాంగ్రెస్ నాయకుడికి భారీగా కేడర్ ఉంది. దీంతో తమ నాయకుడు కుమార్తె వేడుకకు వారంతా గుంటూరు తరలి వచ్చారు.

For For Andhrapradesh News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 09:21 AM