Share News

Jagga Reddy: నా రాజకీయ జీవిత కథను నేనే రాశా

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:05 AM

టీపీసీసీ నేత తూర్పు జగ్గారెడ్డి తన రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘జగ్గారెడ్డి.. ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌’ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రంలో తాను నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలన్నీ కూడా స్వయంగా చేపట్టారు.

Jagga Reddy: నా రాజకీయ జీవిత కథను నేనే రాశా

సినిమాల్లో హీరోలు చేసేవి నేను నిజజీవితంలోనే చేశా.. విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే నాపై కుట్రలు

డైరెక్టర్‌ రామానుజం చెప్పిన కథ.. నా నిజజీవితానికి దగ్గరగా ఉంది

అందుకే సినిమా చేయాలని నిర్ణయం

జగ్గారెడ్డి.. ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌ కార్యాలయం ప్రారంభోత్సవంలో తూర్పు జగ్గారెడ్డి

టీజర్‌ను విడుదల చేసిన యూనిట్‌

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ‘‘సినీ హీరోలు ఎవరో రాసిన కథల్లో నటిస్తుంటారు. ఆయా సినిమాల్లో పోలీసులను కొట్టినట్లు.. వారితో ఫైటింగ్‌ చేసినట్లు నటన చేస్తుంటారు. కానీ ఇవ న్నీ నేను నా నిజజీవితంలో చేశా! నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నా!’’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యా ఖ్యానించారు. తాను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పటి నుంచే తనపైన ఎన్నో కుట్రలు జరిగాయని వెల్లడించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ‘జగ్గారెడ్డి.. ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌’ సినిమా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు ఆయన భార్య, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలాజగ్గారెడ్డి, ఈ సినిమా నిర్మాత, జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మిరెడ్డి, కుమారుడు తూర్పు దత్తసాయి, దర్శకుడు రామానుజం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తానూ ఒక పాత్రలో నటిస్తున్నానని, అయితే తన నిజజీవితంలోని కొన్ని సంఘటనలను కూడా ఇందులో చూపిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మూల కారకుడు దర్శకుడు రామానుజమన్నారు. ఓ వేడుకలో తనను కలిసిన రామానుజం.. కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి రాసుకున్న కథను వినిపించారని, అందులో తనను నటించాలని కోరారని వెల్లడించారు. సినిమాలో తాను పోషించాల్సిన పాత్ర గురించీ వివరించారని, ఆ పాత్ర తన నిజజీవితానికి దగ్గరగా ఉండటంతో ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించానన్నారు. ఈ సందర్భంగా తనపై రూపొందించిన పోస్టర్‌ను రామానుజం చూపించారన్నారు. అది తనను బాగా ఆకర్శించిందన్నారు. రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించనున్నట్లు చెప్పారు. ‘‘నా రాజకీయ జీవితానికి సంబంధించి కథ, స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్‌ అంతా నాదే.


అలాగని నా గురించి నేను ఎక్కువగా ఊహించుకోను. విద్యార్థి నాయకునిగా మొదలైన నా రాజకీయ ప్రయాణం.. రాష్ట్ర నేత అయ్యేదాకా వచ్చిందంటే.. అందులో చాలా మలుపులు ఉన్నాయి. ఈ ప్రయాణమంతా సినిమా కథలో కనపడుతుంది’’ అని చెప్పారు. తన కూతురు జయలక్ష్మిరెడ్డి ఆలోచనలు.. తన ఆలోచనలకు దగ్గరగానూ ఉంటాయని ఆయన చెప్పారు. జయలక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి జగ్గారెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెరపైన చూడబోతున్నామనే ఆలోచనే తనను ఉద్వేగానికి గురిచేస్తోందన్నారు. సినిమా అందరికీ నచ్చే విధంగానూ ఉంటుందన్నారు. దర్శకుడు రామానుజం మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి రుణాన్ని.. మంచి సినిమా ఇచ్చి తీర్చుకుంటానన్నారు. సంగారెడ్డికి వెళ్లి.. పలువురితో మాట్లాడి.. జగ్గారెడ్డి గురించి తెలుసుకున్నానని చెప్పారు. సినిమాలో జగ్గారెడ్డి పాత్రతో పాటుగా మంచి ప్రేమ కథ కూడా ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు నడుస్తున్నాయని, త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని తెలిపారు. కాగా.. ‘జగ్గారెడ్డి.. ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌’ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్‌ ఆదివారం విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 05:06 AM