Share News

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:48 AM

నాటి నరసాపురం వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఉండి టీడీపీ ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణంరాజుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారన్న ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

  • సీఐడీ, ఐబీ మాజీ చీఫ్‌లు సునీల్‌కుమార్‌, పీఎస్‌ఆర్‌పైనా

  • రఘురామరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌

  • ఏ-1గా సునీల్‌, ఏ-2గా పీఎస్‌ఆర్‌, ఏ-3గా మాజీ ముఖ్యమంత్రి

  • నాటి అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతిపైనా కేసు

  • 2021 మే 14న గుంటూరు సీఐడీ ఆఫీసులో రఘురామపై థర్డ్‌ డిగ్రీ

  • బైపాస్‌ సర్జరీ జరిగిందన్నా వినకుండా గుండెలపై కూర్చున్నారు

  • బెల్టు, లాఠీలతో కొట్టి చంపే యత్నం

  • నగరంపాలెం పోలీసులకు మెయిల్‌లో ఫిర్యాదు పంపిన టీడీపీ ఎమ్మెల్యే

గుంటూరు, జూలై 12: నాటి నరసాపురం వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఉండి టీడీపీ ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణంరాజుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారన్న ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు అప్పటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌, నాటి నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్‌ ఆంజనేయులు పైనా హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం రాత్రి రఘురామరాజు మెయిల్‌ ద్వారా గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు పంపగా.. దాని ప్రకారం 120బీ, 166, 167, 197, 307, 326, 465, 506(34) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ-1గా సునీల్‌కుమార్‌, ఏ-2గా పి.సీతారామాంజనేయులు, ఏ-3గా జగన్‌, ఏ-4గా అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ కె విజయపాల్‌, ఏ-5గా నాటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ ప్రభావతిలను పేర్కొన్నారు.

మూడేళ్ల కిందట అప్పటి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో రఘురామరాజుపై సీఐడీ అధికారులు కేసు (క్రైౖమ్‌ నంబర్‌ 12/2021) నమోదు చేశారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా 2021 మే 14న సీఐడీ అధికారులు బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆయన్ను హైదరాబాద్‌లోని స్థానిక మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచలేదు. కనీసం ట్రాన్సిట్‌ వారెంటు కూడా తీసుకోలేదు. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో నేరుగా గుంటూరు మెడికల్‌ కళాశాల వెనుక ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు అక్కడకు వచ్చి తనపై హత్యాయత్నం చేయించారని రఘురామరాజు తాజాగా ఫిర్యాదు చేశారు.


ఆ రోజు రాత్రి సీఐడీ కార్యాలయంలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని.. తనకు బైపాస్‌ సర్జరీ జరిగిందని చెప్పినా వినిపించుకోకుండా తన గుండెలపై కూర్చుని ఒత్తిడి పెంచారని.. లాఠీలతో కొట్టి చంపాలని ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలతో రబ్బరు బెల్టుతో, లాఠీలతో తనపై విచక్షణరహితంగా దాడి చేసి కొట్టారని.. కనీసం తనకు మందులు వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. అనంతరం తన వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను బలవంతంగా గుంజుకుని.. పాస్‌వర్డ్‌ చెప్పేవరకు కొట్టారని వెల్లడించారు. అంతేగాక సీఎం జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్‌ కుమార్‌ తనను హెచ్చరించారని తెలిపారు.

మర్నాడు తనను వైద్య పరీక్షలకు జీజీహెచ్‌కు తరలించగా అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి పోలీసు అధికారుల సూచన మేరకు తప్పుడు సర్టిఫికెట్‌ జారీ చేశారని.. తన శరీరంపై ఎటువంటి దెబ్బలు లేవని.. ఎటువంటి సంఘటనా జరుగలేదన్నట్లుగా ఆమె తప్పుడు నివేదిక అందించారని పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం రఘురామను గుంటూరులోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల దెబ్బలకు నడవలేని స్థితిలో ఉన్న ఆయన కుంటుకుంటూ కోర్టులోకి వెళ్లారు. పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, లాఠీలతో కుళ్లబొడిచారని మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. వారు కొట్టిన దెబ్బలకు అరికాళ్లు కమిలిపోయాయంటూ ఆ దెబ్బలను చూపించారు.

మేజిస్ట్రేట్‌ ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుని.. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు. అయితే ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించే పరీక్షలపై నమ్మకం లేదని.. తనకు ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలని కోరుతూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జీజీహెచ్‌లో వైద్య పరీక్షల నివేదికను స్థానిక కోర్టుతోపాటు తమకూ సీల్డ్‌ కవర్‌లో అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని, వైద్య పరీక్షల నివేదికను సీల్డ్‌ కవర్లో తమ ముందుంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అక్కడ చికిత్స పొందిన అనంతరం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన వైద్య నివేదికను సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందజేశారు. ఒక ఎంపీపైనే హత్యాయత్నం జరిగితే కేసు నమోదు చేసే పరిస్థితి కూడా ఆనాడు రాష్ట్రంలో లేదు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్‌తో పాటు ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై హత్యాయత్నం కేసు నమోదుకావడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.

ఆ రోజు తనను చంపేసేవారేనని..

సీఐడీ కస్టడీలో ఆ రోజు తనను చంపేసే వారేనని ఆనాటి ఘటనను తలచుకుని రఘురామరాజు పలు సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రంలో అడుగుపెడితే చంపేస్తారని కనీసం సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి కూడా భయపడ్డారు. పైగా నరసాపురం నియోజకవర్గంలో ఆయనపై వైసీపీ నేతలు పలు కేసులు నమోదు చేయించారు. అడుగుపెడితే అరెస్టు తప్పదని హెచ్చరికలు చేశారు. దీంతో ఆయన ఢిల్లీ, హైదరాబాద్‌లలోనే నివసిస్తూ వచ్చారు. అయినా ఓసారి తాను హైదరాబాద్‌ నుంచి నరసాపురానికి రైల్లో బయల్దేరానని.. తనను చంపడానికి కుట్ర చేశారని తెలుసుకుని మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయానని ఆయన ఒక సందర్భంలో ప్రకటించారు.

Updated Date - Jul 13 , 2024 | 07:16 AM