పదేళ్ల తర్వాత బెంగళూరు ప్యాలె్‌సకు జగన్!
ABN , Publish Date - Jun 25 , 2024 | 03:34 AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన దరిమిలా.. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరులోని తన యలహంక ప్యాలె్‌సకు వచ్చారు.
ఆరు రోజులు ఇక్కడే మకాం!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన దరిమిలా.. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరులోని తన యలహంక ప్యాలె్‌సకు వచ్చారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన ఇక్కడకు రావడం గమనార్హం. భార్య భారతితో కలిసి పులివెందుల నుంచి సోమవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా ప్యాలెస్ ప్రాంగణంలో దిగారు. ఇక్కడ ఆరు రోజులపాటు బస చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో పరాజయం, కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన జగన్.. గత శుక్రవారం అసెంబ్లీకి హాజరై శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. కానీ సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. తర్వాతి రోజు స్పీకర్ ఎన్నికలో ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదు. జగన్ శనివారం పులివెందుల వెళ్లారు. సోమవారం యలహంక ప్యాలె్‌సకు చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర సీఎంగా వైఎస్ ఉన్నప్పుడు జగన్ యలహంకలో ప్రత్యేక ఆసక్తితో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. వైసీపీ ఏర్పాటుకు ముందు జగన్ ఎక్కువగా ఇక్కడే గడిపేవారు. పార్టీ ప్రారంభించాక ఏపీలోనే ఉన్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చారు.