Share News

AP News: ఏపీలో ఎన్డీయే కూటమి విజయంపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 06:20 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించిందని, ఇది చిన్న విజయం కాదు.. అద్భుతమైన విజయమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

AP News: ఏపీలో ఎన్డీయే కూటమి విజయంపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించిందని, ఇది చిన్న విజయం కాదు.. అద్భుతమైన విజయమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ‘‘ ఈ విజయంలో మనకు ఒక హెచ్చరిక, గమనిక ఉంది. గడచిన ఐదేళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు’’ అని ఆమె అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.


అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకపోతే ప్రజలు గుణపాఠం చెప్పగలమని ఈ ఫలితాల ద్వారా నిరూపించారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందని, 164 సీట్లతో ఇంత పెద్ద మెజారిటీ కూటమికి వస్తుందని ఎవరూ ఊహించలేదని, ఇదొక నిశ్మబ్ధ విప్లవమని పురందేశ్వరి అన్నారు. తెలుగు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, కూటమికి అధికారం ఇచ్చిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అని ఆమె అన్నారు. టిక్కెట్లు రాకపోయినా హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయడం శుభపరిమాణమని అన్నారు. ఢిల్లీలో అగ్రనేతలు కూటమి విజయాన్ని అద్భుతంగా‌ పొగుడుతున్నారని, బీజేపీ తరపున సమన్వయ కమిటీలు వేశామని ఆమె అన్నారు. సమన్వయంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాద్యత‌ ఉందని, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆమె పేర్కొన్నారు.


‘‘రాష్ట్రంలో అమరావతి, పోలవరం నిర్మాణం మన ప్రాధాన్యత. అమరావతిలో ఐదేళ్ల తర్వాత విద్యుత్ లైట్లు వెలుగుతున్నాయి. అమరావతి, పోలవరం నిర్మాణంపై సమన్వయంతో ముందుకు వెళతాం. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్షం లేదు... ప్రజా‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత‌ మనపైనే ఉంది. రాష్ట్రంలో కొత్త శకం ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెడుతూ నిజమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి. మనం అధికారంలో ఉంటూ పార్టీని మరింత అభివృద్ధి చేసుకోవాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.


పురందేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ సహ-సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వరరావు, విష్ణు కుమార్ రాజు, పార్ధసారధి ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తరపున గెలిచిన ఎంపీలను, ఎమ్మెల్యేలను బీజేపీ ఏపీ పదాధికారులు, జిల్లాల ఇన్‌చార్జిలు సత్కరించారు.

Updated Date - Jun 12 , 2024 | 06:20 PM