Peddapalli: కులోన్మాద హత్య
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:07 AM
తన కూతురును మరిచిపోవాలంటూ ఆ యువకుడిని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అతడిపై యువతి తండ్రి కక్ష కట్టాడు. వేరే కులం యువకుడితో ప్రేమాగీమా వద్దంటూ మందలించినా కూతురు పట్టించుకోకపోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు.

తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. పెద్దపల్లిలో దారుణం
యువకుడికి కూతురు బర్త్ డే విషెస్ చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం
మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికలపై దృష్టి
రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి
చంపేస్తారేమోనని గతంలోనే హెచ్చరించిన యువతి
గతంలోనూ రెండుసార్లు యువకుడిపై దాడికి యత్నం!
పెద్దపల్లి/ఎలిగేడు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తన కూతురును మరిచిపోవాలంటూ ఆ యువకుడిని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అతడిపై యువతి తండ్రి కక్ష కట్టాడు. వేరే కులం యువకుడితో ప్రేమాగీమా వద్దంటూ మందలించినా కూతురు పట్టించుకోకపోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు. ఆ యువకుడిని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడదని భావించి.. పథకం ప్రకారం అతడి ప్రాణాలను బలిగొన్నాడు. గొడ్డలితో దాడి చేస్తే తీవ్రగాయాలతో రక్తమోడుతున్న స్థితిలో ఆ యువకుడు హాహాకారాలు పరుగులు పెట్టినా.. కనికరించకుండా వెంబడించి మరీ పదే పదే నరికి చంపాడు. ఈ కులోన్మాద హత్య పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో జరిగింది. హతుడు ఆ గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు గౌడ్, జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయి కుమార్ గౌడ్ (18). కూతురు నాలుగేళ్ల క్రితం డెంగీతో మృతిచెందడం, మిగిలిన ఒక్కగానొక్క సంతానం తాజాగా హత్యకు గురవడంతో ఆ తల్లిదండ్రులు కంటికీమంటికి ధారగా రోదిస్తున్నారు. సాయి కుమార్ ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేశాడు. అదే గ్రామంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తన సహద్యాయి, సుల్తానాబాద్‌లో ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇది తెలిసి యువతి తండ్రి ముత్యం సదయ్య అలియాస్ సది, సాయికుమార్‌ను పలుమార్లు మందలించినట్లు తెలుస్తోంది. 27న సాయి పుట్టినరోజు కావడంతో అతడికి యువతి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
ఇది తెలిసిన సదయ్య, సాయిని ఎలాగైనా చంపాలనుకొని అతడి కదలికలపై దృష్టిపెట్టాడు. సాయి, అతడి స్నేహితులు కలిసి ఆ రోజు రాత్రి 9.30కు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో మద్యం తాగుతున్నారు. అక్కడికి ద్విచక్రవాహనంపై వచ్చిన సదయ్య వెంట తెచ్చుకున్న గొడ్డలితో సాయి మెడపై నరికాడు. ఇది చూసి.. సాయి మిత్రులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. తీవ్రగాయాలతో.. రక్తం కారుతుండగా సాయి, శక్తినంతా కూడదీసుకొని అక్కడి నుంచి తన మేనత్త ఇంటివైపు పారిపోయేందుకు విఫలయత్నం చేసి కుప్పకూలాడు. అప్పటికీ కోపం చల్లారని సదయ్య, గొడ్డలితో మరో రెండుసార్లు సాయి మెడపై దాడిచేసి అక్కడి నుంచి పారిపోయాడు. సాయిని కుటుంబసభ్యులు సుల్తానాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు, అతడి కుటుంబసభ్యులు గ్రామం నుంచి పారిపోయారు. అయితే సదయ్యను జూలపల్లి మండలం కోనరావుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుడిని నరికి చంపిన వాళ్లను కూడా నరికి చంపాలంటూ హతుడి తల్లి బిగ్గరగా రోదిస్తూ డిమాండ్ చేసింది.
అమ్మాయి ముందే హెచ్చరించింది
కులోన్మాదమే ఈ హత్యకు కారణం. తమ అమ్మాయి వేరే కులం అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసే ఆమె తండ్రి సదయ్య పథకం ప్రకారం నా బిడ్డను నరికి చంపాడు. గురువారం సాయి పుట్టినరోజు. ఆ అమ్మాయి ప్రత్యేకంగా కేక్ తీసుకొచ్చి సాయితో కట్ చేయించినట్లు తెలిసింది. మధ్యాహ్నం తర్వాత గ్రామంలో కొందరు వ్యక్తులు బైక్‌లపై చక్కర్లు కొట్టడం గమనించి.. సాయిని బయట తిరగొద్దని అప్రమత్తం చేశాను. సాయంత్రం స్నేహితులు రావడంతో కేక్ కట్ చేసివస్తానంటూ సాయి బయటకు వెళ్లాడు. అయితే తమ బంధువులు సాయిని చంపాలని చూస్తున్నారని ఆ అమ్మాయి మమ్మల్ని గతంలోనే హెచ్చరించింది. ఇది వరకు ఓ పెళ్లిలో, వినాయక చవితి రోజు సాయిపై యువతి బంధువులు దాడికి యత్నించారు.. అప్పుడు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
-హతుడి తండ్రి పరశురాములు
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News