‘ప్రజాగళం’లో పోలీస్ నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 19 , 2024 | 03:17 AM
ప్రధాని మోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా కనిపించిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం జనసేన పార్టీ

ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం.. విచారణ జరగాలి
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: నాదెండ్ల మనోహర్
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా కనిపించిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రధాని పాల్గొన్న సభకు జారీ చేసిన కీలక పాసుల విషయంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎటువంటి వివరాలూ నింపకుండా ఖాళీ పాసులను జిల్లా అధికారులు సంతకాలు చేసి జారీ చేయడం భద్రతా డొల్లతనాన్ని సూచిస్తోంది. ఇది కలెక్టర్ కార్యాలయ అధికారులు, పోలీస్ శాఖ తప్పిదమే. సభ జరుగుతున్న సమయంలోనూ భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. జనాన్ని నియంత్రించే దిశగా పోలీసు శాఖ ఎక్కడా చర్యలు చేపట్టలేదు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సమగ్ర విచారణ జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సభా ప్రాంగణం అంతా పోలీసుల చేతుల్లోనే ఉన్నప్పటికి వారు పట్టనట్లు వ్యవహరించారు. దీంతో సభకు అంతరాయం కలిగింది’ అని ఆరోపించారు.