Pawan Kalyan : ఈ మైత్రి పదేళ్లు కొనసాగాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 03:38 AM
భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు తమ మైత్రి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్,....
కేడర్ మధ్య భేదాభిప్రాయాలొస్తే వెంటనే సరిదిద్దుకోవాలి
ఆత్మీయ సమావేశంలో పవన్ కల్యాణ్, పల్లా శ్రీనివాసరావు
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు తమ మైత్రి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. శనివారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఆయన నివాసంలో పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. గంటన్నరసేపు సాగిన ఆత్మీయ సమావేశంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తితే వెంటనే సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని భావించారు. కూటమి శ్రేణుల్లో ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యం వల్లనే మోదీ ఆశీస్సులతో ఏర్పాటైన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జనసైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన ఉత్సాహం, టీడీపీ శ్రేణుల కృషి, బీజేపీ అభిమానుల ఆదరణ సమష్టిగా రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు: జనసేన
గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైన స్థితిలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరినట్లు పార్టీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని జనసేనాని పవన్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ర్టాభివృద్థి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారులపై నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పార్టీ అధ్యక్షుడు ఆదేశించారని అన్నారు. పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలుగానీ ప్రొటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.