ఆయన ‘టీమిండియా’కు ఫీల్డింగ్ నేర్పుతాడు..
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:13 PM
2021 నుంచి తాజా ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ’ విజయం దాకా టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న ‘భారత జట్టు ఫీల్డింగ్ కోచ్’ దిలీప్ విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.....

ఆరేళ్లప్పుడే అతడికి అమ్మ ప్రేమ దూరమైంది. నాన్నే అన్నీ తానై పెంచి పెద్ద చేశాడు. ఎలాగైనా పెద్ద క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. ఒక పక్క చదువుకుంటూనే మరోవైపు తనకు ఇష్టమైన క్రికెట్‌తో కలిసి దశాబ్దం పాటు ప్రయాణం చేశాడు. క్రికెటర్‌గా అనుకున్న లక్ష్యమైతే చేరుకోలేకపోయాడు కానీ... కోచ్‌గా సత్తాచాటాడు దిలీప్. తెలుగు రాష్ట్రాల్లో ఆర్.శ్రీధర్ తర్వాత టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్న రెండో వ్యక్తి దిలీప్.
2021 నుంచి తాజా ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ’ విజయం దాకా టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న ‘భారత జట్టు ఫీల్డింగ్ కోచ్’ దిలీప్ విజయ ప్రస్థానం అతడి మాటల్లోనే...
ఈ వార్తను కూడా చదవండి: భలే ‘టైమ్’ వచ్చిందిప్పుడు..
‘‘నేను పుట్టింది వరంగల్‌లోని రాయపర్తి. నా ఆరేళ్లప్పుడే అమ్మ చనిపోయింది. దాంతో నాన్న శ్రీనివాసచారినే అన్నీ తానై నన్ను పెంచి, పెద్ద చేశారు. నా బాల్యంలోనే హైదరాబాద్‌కు వచ్చేశాం. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటేప్రాణం. బాగా చదివేవాణ్ణి కూడా. నేను ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలని నాన్న అనుకునే వారు. కాలేజీ చదువు పూర్తయ్యాక చిన్న ఉద్యోగం చేస్తూ... ఒక పక్క సంపాదిస్తూనే మరో పక్క ‘హెచ్‌సీఏ’ తరఫున క్రికెట్ టోర్నీలు ఆడేవాణ్ణి. దశాబ్దం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే క్రికెటర్‌గా ఒక స్థాయికి వచ్చా కానీ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయా. అయితే నేను ప్లేయర్‌గా సాధించలేనివి కోచ్‌గా సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.
కోచ్‌గా ప్రయాణం...
క్రికెట్ ఆడుతున్నప్పుడు జూనియర్లకు నేనిచ్చే సలహాల్ని వాళ్లు పాటిస్తూ మంచి ఫలితాలు సాధిస్తుంటే సంతోషమేసేది. అదే నన్ను కోచ్ వైపు అడుగులు వేయించిందేమో. 2004లో బీసీసీఐ లెవల్-1 కోచ్‌గా శిక్షణ పూర్తి చేశా. 2007లో బీసీసీఐ లెవల్-2 కోచ్ శిక్షణ తీసుకొని సికింద్రాబాద్ జింఖానాలోని హెచ్‌సీఏ అకాడమీలో విజయ్ మోహన్‌రాజ్ సార్ దగ్గర సహాయ కోచ్‌గా ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించా. ఆతర్వాత కవల్‌జీత్ సింగ్, వెంకటపతి రాజు, నరసింహరావు, శివ్‌లాల్, అర్షద్, లాల్‌చంద్ మొదలు ద్రవిడ్, గంభీర్ వరకు పలువురు సీనియర్ల వద్ద వారి అనుభవాలను తెలుసుకుంటూ కోచ్‌గా నైపుణ్యాల్ని మెరుగుపర్చుకున్నా. 2013లో బీసీసీఐ లెవల్-3 శిక్షణ కూడా పూర్తి చేశా. 2007-2019 వరకు హెచ్‌సీఏ అండర్-13 నుంచి రంజీ జట్టు వరకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశా. ఐపీఎల్‌లోని డెక్కన్ చార్జర్స్ (ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్)కు సహాయ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో కోచ్ డారెన్ లిమెన్, ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌కీపర్ గిల్‌కిస్‌్ట్ర, సైమండ్స్, రాబిన్‌సింగ్‌తో పాటు చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఎన్‌సీఏలో ద్రవిడ్ దగ్గర పని చేసినప్పుడు చాలా నేర్చుకున్నా.
శ్రీలంక పర్యటనతో...
2019లో రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందంలో ఇండియా జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీలంకకు వెళ్లా. ఆ ఏడాది జూన్ 18వ తేదీని నా జీవితంలో ఎప్పటికీ మర్చి పోలేను. తొలిసారి టీమిండియా జెర్సీ వేసుకునే అవకాశం లభించింది. ఆ పర్యటనతో నాలో ఆత్మస్థయిర్యం బాగా పెరిగింది. రెండేళ్లతర్వాత అంటే 2021 నవంబర్‌లోన్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియ మితుడయ్యా. అప్పటి నుంచి టీమిండియాతో నా ప్రయాణం కొనసాగుతోంది. నా కెరీర్‌లో కివీస్‌తో సిరీస్ అతి పెద్ద మలుపు.
రోహిత్, విరాట్‌తో అనుబంధం...
క్రికెటర్ల బలాబలాలను దృష్టిలో పెట్టుకుని వారి నైపుణ్యాలను జట్టుకు ఉపయోగపడేలా చేయడమే ఫీల్డింగ్ కోచ్‌గా నా బాధ్యత. ప్రతీ క్రికెటర్ బరిలోకి దిగిన ప్రతిసారీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు వారిని సన్నద్ధం చేసే క్రమంలో ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో విధమైన ప్రణాళికతో పని చేయాలి. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా జట్టు మొత్తంతో నాకు మంచి అనుబంధం ఉంది.
సాధారణంగా బ్యాట్స్‌మాన్, బౌలర్లకు మాత్రమే గుర్తింపు, గౌరవాలు దక్కుతాయి. చాలా తక్కువ సందర్భాల్లో ఫీల్డింగ్‌కు గుర్తింపు వస్తుంది. మ్యాచ్‌నే మలుపు తిప్పేలా క్యాచ్‌లు, రనౌట్లు చేయడం, అద్భుత ఫీల్డింగ్‌తో కీలకమైన పరుగులను కాపాడి మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు అనేకం ఉంటాయి. దీని గురించి టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐతో చర్చించా. అలా మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూంలో ఉత్తమ ఫీల్డర్లకు మెడల్స్ ప్రదానం చేసే కార్యక్రమం ప్రారంభించా. ఈ ప్రయత్నానికి మంచి గుర్తింపు వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో సమానంగా ఫీల్డింగ్‌కు ప్రాముఖ్యత, గుర్తింపు ఇప్పుడు బాగా పెరిగింది. ‘ఛాంపియన్స్ ట్రోఫీ’నే తీసుకుంటే మన ఫీల్డింగ్ ప్రమాణాల్లో రనౌట్లు చేయడంలో గతం కంటే ఇరవై శాతం మెరుగయ్యాయి.
రెండు ఐసీసీ ట్రోఫీల్లో భాగస్వామిని...
ఒక సాధారణ కుటుంబ నుంచి వచ్చి ‘టీమిండియా’కు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసే స్థాయికి చేరుకోగలిగానంటే అదంతా అమ్మ, ఆశీర్వాదం, సీనియర్ కోచ్‌లు, జట్టు సహకారం వల్లే సాధ్యమైంది. భారత జట్టు టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలవడంలో నా పాత్ర కూడా ఉండడం సంతోషంగా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో హెచ్‌సీఏ, బీసీసీఐ ప్రోత్సాహం మరవలేనిది. భారత జట్టు ఆడుతున్న ప్రతీ మ్యాచ్‌కు ముందు జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు... టీమిండియా జెర్సీలో నన్ను నేను చూసుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది. ప్రపంచ క్రికెట్‌లో బలమైన ఫీల్డింగ్ జట్టుగా భారత్‌ను నిలపాలనేది నా ఆకాంక్ష.’’
- ఎస్.ఎస్.బి సంజయ్,
(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి:
పోస్టల్ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!
కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి
మెట్రో రైల్‌పై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆపండి
Read Latest Telangana News and National News