Sri Rama Navami: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 10:51 AM
Sri Rama Navami: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణంలో భాగంగా ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు భారీగా ఆలయాలకు తరలి వచ్చి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా భక్తులు భారీగా ఆలయాలకు తరలి వచ్చారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వేడుకల కోసం ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. స్వాగత తోరణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సీతారాముల కల్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో భాజాభజంత్రీలు, వేదమంత్రోచ్ఛరణాల మధ్య ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కల్యాణం జరిగింది.
సీతారాంబాగ్ ఆలయంలో ఘనంగా వేడుకలు...
హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణం చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీరాములవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో సీతారామ లక్ష్మణుల దర్శనానికి సమయం పడుతోంది.
నెల్లూరులో వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు
నెల్లూరు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వగ్రామమైన చౌటపాళెంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడికి వేద బ్రాహ్మణులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బ్రాహ్మణుల ఆశీస్సులను వెంకయ్యనాయుడు తీసుకున్నారు. కల్యాణం చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
10:30 గంటలకు శ్రీరాములవారి కల్యాణం జరుగనుంది. 11:30 గంటలకు రాములవారిని గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సీతారాం భాగ్ నుంచి కోటి వ్యాయామశాల దాకా వైభవంగా శ్రీరామ శోభాయాత్ర సాగనుంది. శ్రీరామ శోభాయాత్రకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శోభాయాత్ర నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.
రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు..
విజయనగరం: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విస్తృత ఏర్పాట్లు చేశారు. అభిజిత్ లగ్నమున స్వామి వారి కల్యాణం జరుగనుంది. కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేపట్టారు. సీతారామలక్ష్మణులను దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రామతీర్థం సీతారామస్వామిని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి దర్శించుకున్నారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిసి అప్పలనాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఒంటిమిట్ట ఆలయంలో టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ
కడప: ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో స్థానిక వైసీసీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అతని వర్గీయులు ఓవరాక్షన్ చేశారు. ధ్వజారోహణ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులపై గొడవకు వైసీపీ శ్రేణులు దిగారు. ఆలయానికి స్ధానిక టీడీపీ, వైసీపీ ఇరువర్గాల నేతలు ఒకేసారి రావడంతో ధ్వజరోహణ కార్యక్రమం వద్ద ఇరువర్గాల తోపులాటకు దారి తీసింది. టీడీపీ శ్రేణులపై వైసీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఘర్షణకు దిగారు.
వేడుకలకు వేములవాడ దేవాలయం ముస్తాబు
రాజన్న సిరిసిల్ల: వేములవాడలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. శ్రీ రామనవమి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కల్యాణానికి 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాజన్న ఆలయాన్ని రాములోరి పెళ్లి వేడుకకు అధికారులు ముస్తాబు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సీతారామచంద్ర స్వామి వారికి ద్వారాభిషేకం అర్చకులు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం జరుగుతోంది.
వరంగల్‌లో భక్తుల సందడి..
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి రామాలయాలు ముస్తాబయ్యాయి. ఊరు-వాడ, పట్నం-పల్లె అనే తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంది. చారిత్రక వల్మిడి రామాలయాన్ని వేడుకల కోసం ముస్తాబు చేశారు. అలాగే అగ్రంపహాడ్ రామాలయంలో కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని రామాలయాలు, వరంగల్ రామాలయం, హనుమకొండ అభయాంజనేయస్వామి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
అన్నవరంలో శ్రీరామనవమి..
కాకినాడ జిల్లా (అన్నవరం): అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఘనంగా సీతారాములు వారి కల్యాణ మహోత్సవం జరిగింది. శ్రీరాముని కల్యాణంలో పెళ్లి పెద్దలుగా సత్యనారాయణ స్వామి సత్యవతి అనంతలక్ష్మి అమ్మవారు కొలువు దీరారు. విశేష పూజలతో కల్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు, వేద పండితులు నిర్వహిస్తున్నారు.
విశాఖపట్నంలో..
విశాఖపట్నం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నరసింహ నగర్‌లోని కోదండరామ స్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం మహోత్సవం చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
ఏలూరులో ..
ఏలూరు జిల్లా: ఏలూరులో సాహిత్య మండలి ఆధ్వర్యంలో శ్రీరామనవమి కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. శ్రీరామనవమి వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీతారాముల దర్శనం కోసం క్యూలైన్లలో భారీగా భక్తులు వేచి ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News