వైసీపీ భవనాల విషయంలో నేటి వరకు యథాతథ స్థితి
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:10 AM
ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాల భవనాల విషయంలో గురువారం వరకు యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

పూర్తి వివరాలు మా ముందుంచండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాల భవనాల విషయంలో గురువారం వరకు యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ భవనాలను ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అధికారులిచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వివిధ జిల్లాల వైసీపీ అధ్యక్షులు అత్యవసరంగా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని, గురువారం వరకు భవనాల విషయంలో అధికారులు యథాతథ స్థితి పాటించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదావేశారు. 9 జిల్లాల వైసీపీ అధ్యక్షులు బుధవారం వేసిన ఈ పిటిషన్లను హైకోర్టు లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. ‘జాతీయ పార్టీలు, గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపునకు 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 340 జారీ చేసింది. అసెంబ్లీలో 50 శాతానికిపైగా సంఖ్యాబలం ఉన్న పార్టీకి కార్యాలయం నిర్మాణం కోసం జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో రెండు ఎకరాలు కేటాయించవచ్చు. భూకేటాయింపు జరిగిన ఏడాది లోపే కార్యాలయాల నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేయాలి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నిర్మాణాలు కొనసాగించుకోవచ్చని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని కూల్చివేస్తారేమోనన్న పిటిషనర్ల ఆందోళన సహేతుకమైనదే. చట్టనిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాన్ని కూల్చివేయడమే పరిష్కారం కాదు. దానిని క్రమబద్ధీకరించే అధికారం కమిషనర్‌కు ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భవనాల విషయంలో యఽథాతథస్థితి పాటించేలా అధికారులను ఆదేశించండి’ అని కోరారు. అడ్వకేట్ జనరల్ తరఫున న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదన్నారు. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల విషయంలో అధికారులు ముందుకెళ్లకుండా ఉత్తర్వులు (బ్లాంకెట్ ఆర్డర్స్) పొందేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.