Share News

Nidhi Agarwal: ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా...

ABN , Publish Date - Mar 23 , 2025 | 06:44 AM

ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా... అని అంటున్నారు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్‌. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే...

Nidhi Agarwal: ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా...

‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి చిత్రాలతో తెలుగుతెరకు దగ్గరైన నిధి అగర్వాల్‌... మూడేళ్ల విరామం తర్వాత ‘హరిహర వీరమల్లు’తో జత కట్టింది. తన అందం, అభినయంతో వీరమల్లు మనసునే కాదు... కుర్రకారు మనసుని కొల్లగొట్టిందీ గ్లామర్‌ డాల్‌. ఈ సందర్భంగా ‘గ్యాప్‌ ఇవ్వలేదు... వచ్చింది’ అంటున్న అందాల నిధి పంచుకున్న ముచ్చట్లివి....

చాలా కష్టపడ్డా...

నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ అత్యుత్తమమైనది. ఇందులో నేను పోషించిన పంచమి పాత్ర శారీరకంగా నాకు ఎన్నో సవాళ్లు విసిరింది. ఇందులో బరువైన కాస్ట్యూమ్స్‌, ఆభరణాలు ధరించా. ప్రతీరోజూ ఒంటి మీద కనీసం 35 కిలోల బరువు మోసేదాన్ని. భారీ దుస్తులు, నగలతో షూట్‌లో పాల్గొనడం కష్టంగా అనిపించేది. షాట్‌ అయిపోగానే జాగ్రత్తగా ఒక దగ్గర కూర్చోవడమే తప్ప... విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదు. అంతేకాదు గుర్రపు స్వారీ, క్లాసికల్‌ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నా.


నా అదృష్టం

పవన్‌ సార్‌ సరసన నటించడం నిజంగా నా అదృష్టం. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. చాలా దయగలిగిన వారు, లెజెండ్‌, పవర్‌ఫుల్‌ కళ్లు.. ఇలా పవన్‌ సార్‌ గురించి చాలా చెప్పొచ్చు. ఆయన నటన చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఎంత కష్టమైన సన్నివేశమైనా ఇట్టే నటించేవారు. సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్‌ చెప్పగానే పూర్తిగా లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. కేవలం తన సన్నివేశంపైనే దృష్టిపెడతారు. షూటింగ్‌లో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా.

book1.2.jpg


కామెంట్స్‌ తప్పవు

చిన్నప్పటి నుంచి కాస్త సన్నగానే ఉండేదాన్ని. దాంతో చుట్టూ ఉన్నవాళ్లు లావవ్వాలని సలహా ఇచ్చేవారు. కరోనా సమయంలో కాస్త బొద్దుగా అయ్యా. అది చూసి ‘ఎందుకిలా అయ్యావు?’ అని వాళ్లే తిరిగి కామెంట్‌ చేశారు. మనం ఎలా ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు ఏదో ఒక కామెంట్‌ చేస్తూనే ఉంటారని అప్పుడు అర్థమైంది. అందుకే నా శరీరాకృతి గురించి ఎవరేమన్నా పట్టించుకోవడం మానేశా.

ఆమెను చూసే...

దీపికా పదుకొణేను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చా. వెండితెరపై ఆమెను చూసే హీరోయిన్‌ అవ్వాలని ఫిక్స్‌ అయ్యా. సినిమాలు చేస్తూనే అన్నీ నేర్చుకున్నా. హిందీ, తెలుగు, తమిళం... ఒక్కో భాషలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ అడుగులేశా. ఈ ప్రయాణంలో తెలుగు చిత్రసీమ సౌకర్యంగా అనిపించింది. నేను ఇక్కడే పుట్టినందుకేమో... తెలుగు చిత్రసీమతో ఎక్కువ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది.


అవకాశాలు వదులుకున్నా...

‘ఏంటి ఇంత గ్యాప్‌ తీసుకున్నారు’ అని చాలామంది నన్ను అడుగుతున్నారు. నిజానికి నేను గ్యాప్‌ తీసుకోలేదు... వచ్చింది. మొదటి లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్‌కు సైన్‌ చేశా. ఆ సినిమాలో చేస్తూ మరే చిత్రంలోనూ నటించకూడదనే నిబంధన పెట్టింది చిత్రబృందం. అందుకే చాలా అవకాశాలు వదులుకున్నా. మరోవైపు పలు కారణాల వల్ల వీరమల్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో బ్రాండ్స్‌ ప్రమోషన్స్‌ చేశాను. ఈలోపు ప్రభాస్‌ సరసన ఛాన్స్‌ వచ్చింది. వీరమల్లు టీమ్‌ను సంప్రదించి ‘రాజాసాబ్‌’లో భాగమయ్యా.

book1.3.jpg


ఫటా ఫట్‌..

- సెలబ్రిటీ క్రష్‌: రణబీర్‌ కపూర్‌

- ఇష్టమైన హీరోయిన్స్‌: దీపికా, అనుష్క, సమంత, కాజల్‌

- ఇష్టమైన ఆహారం: ఇడ్లీ. రోజూ మూడు పూటల తినమన్నా తినేస్తా.

- హ్యాండ్‌బ్యాగ్‌లో ఉండేవి: డైరీ, పర్‌ఫ్యూమ్స్‌, మేకప్‌ రిమూవర్‌ వైప్స్‌, ఇయర్‌పాడ్స్‌. ఫ ఇష్టమైన ఆట: ఫుట్‌బాల్‌

- ఎవరికీ తెలియని విషయం: పుట్టుకతో నాది ఎడమచేతి వాటం. కానీ ఇంట్లోవాళ్లు బలవంతంగా కుడిచేతి వాటానికి మార్పించారు.

- రోజూ కచ్చితంగా చేసే పని: డైరీ రాయడం

Updated Date - Mar 23 , 2025 | 06:44 AM