Share News

Inspection Delay : ‘లెవెలింగ్‌’ తనిఖీల్లో తాత్సారం!

ABN , Publish Date - Mar 23 , 2025 | 06:11 AM

అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి కాంట్రాక్టర్లు, అధికారులను రక్షించేందుకు తనిఖీ సిబ్బంది నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

Inspection Delay : ‘లెవెలింగ్‌’ తనిఖీల్లో తాత్సారం!

  • 3 నెలల్లో 40 శాతం మాత్రమే పూర్తి

  • కేవలం 2.43% పనులకే నివేదికలు

  • మార్గదర్శకాలకు ఉపాధి క్వాలిటీ సిబ్బంది తిలోదకాలు

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఇంటి స్థలాల చదును పనుల తనిఖీలను నిర్వీర్యం చేసేందుకు కొందరు ఉపాధి క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బంది, అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి కాంట్రాక్టర్లు, అధికారులను రక్షించేందుకు తనిఖీ సిబ్బంది నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అవసరమైతే కొంత సమయం తీసుకుని సమగ్రంగా విచారణ చేపట్టాలన్న కమిషనర్‌ ఆదేశాలను అవకాశంగా తీసుకుంటున్నారు. డిసెంబరు 15న లెవలింగ్‌ తనిఖీలు ప్రారంభం కాగా.. మూడు నెలలవుతున్నా సగం కూడా పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 9,688 పనులను తనిఖీ చేయాల్సి ఉంటే.. 3,900 (40%) మాత్రమే నిర్వహించారు. సంబంధిత నివేదికలు కూడా 6 జిల్లాల్లోని 236 పనులకు(2.43%) మాత్రమే సమర్పించారు.

మార్గదర్శకాలు బేఖాతరు

గత ప్రభుత్వంలో రాష్ట్రంలో రూ.1,125 కోట్ల మేర లెవెలింగ్‌ పనులను వైసీపీ కార్యకర్తల ద్వారా చేపట్టారు. అయితే రూ.1,500 కోట్ల వరకు పనులు చేసినట్లు దొంగ బిల్లులు పెట్టారు. సుమారు రూ.1,260 కోట్లను గత ప్రభుత్వం ఎన్నికల ముందే చెల్లించింది. రూ.240 కోట్ల మేర బకాయిలున్నాయని కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో వారికి బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. విత్‌హెల్డ్‌లో ఉన్న బకాయిలు చెల్లించడానికి క్వాలిటీ కంట్రోల్‌, సోషల్‌ ఆడిట్‌ తనిఖీలు చేపట్టాల్సి ఉందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అప్పట్లోనే మార్గదర్శకాల్లో పేర్కొంది. లెవలింగ్‌ పనుల్లో అక్రమాలు జరిగాయని పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టాలని కమిషనర్‌ కృష్ణతేజ ఆదేశాలిచ్చారు. పంచాయతీరాజ్‌, ఇతర శాఖల ఇంజనీర్లతో బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.


పనుల వాస్తవ పరిస్థితి, లెవలింగ్‌ పనులు చేశారా.. లేదా? నమోదిత పరిమాణంలో ఉన్నాయా.. లేదా? పరిశీలించాలని పేర్కొన్నారు. మట్టి కొనుగోలు చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారా? తహసీల్దార్‌ అనుమతి లేకుండానే క్యూబిక్‌ మీటర్‌ మట్టికి రూ.50 అదనంగా నమోదు చేసి సొమ్ము స్వాహా చేశారా? అనే అంశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. అలాంటి పనుల్లో రూ.50 కోత విధించాలని, ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయాలని సూచించారు. పనుల కొలతల్లో తేడాలున్నా, అసలు పనులు లేకున్నా.. పరిశీలించి అవసరమైతే తాజా కొలతను అప్‌లోడ్‌ చేయాలన్నారు. అయితే ఆ మార్గదర్శకాలను పట్టించుకోకపోవడంతో తనిఖీలు తప్పుదారి పట్టాయి.

ప్రభుత్వ సొమ్ము వైసీపీ కార్యకర్తల జేబుల్లోకి..

జగనన్న కాలనీల్లో స్థలాల చదును పనులకు గ్రావెల్‌ కొనుగోలు కోసం క్యూబిక్‌ మీటర్‌కు రూ.134 చెల్లించారు. మట్టి ప్రైవేట్‌గా రైతుల నుంచి కొనుగోలు చేసి ఉంటే ఆ ధర చెల్లించాలి. రైతు పొలం నుంచి మట్టి తీసుకునేందుకు తహసీల్దార్‌ అనుమతి ఉండాలి. ప్రభుత్వ స్థలంలో మట్టిని సేకరిస్తే డబ్బులు చెల్లించే అవసరం ఉండదు. రవాణా ఖర్చు మాత్రమే లెక్కించాలి. అయితే చదును పనులకు మట్టిని క్యూబిక్‌ మీటర్‌ రూ.50కు కొనుగోలు చేసినట్లు, తరలించినందుకు రూ.84 చొప్పున మొత్తంగా క్యూబిక్‌ మీటర్‌కు రూ.134 చొప్పున రికార్డు చేశారు. ప్రభుత్వ భూముల్లో మట్టి సేకరించి రూ.50 అదనంగా వసూలు చేశారు. దీంతో భారీగా ప్రభుత్వ సొమ్ము వైసీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలున్నాయి.


నిర్వీర్యం చేసేందుకు యత్నాలు

కమిషనర్‌ ఒక విధంగా ఆదేశిస్తే సిబ్బంది మాత్రం మరో రకంగా తనిఖీలు చేపడుతున్నారు. నివేదికల్లోనూ ఆయా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన చెల్లింపులను జీరో చేశారే తప్ప.. అధిక చెల్లింపులు పొందిన వారి నుంచి రికవరీ చేసే యోచన ఉన్నట్లు లేదు. కాంట్రాక్టర్లు ఎవ్వరూ తహసీల్దార్ల నుంచి మట్టి క్వారీ పర్మిషన్లు తీసుకున్న దాఖలాల్లేవు. కొన్ని జిల్లాల్లో అధికారులు అత్యుత్సాహంతో తహసీల్దార్లు క్వారీ పర్మిషన్‌ ఇచ్చినట్లు పాత తేదీలతో పత్రాలు తేవాలని కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నారు. తాత్సారంతో తనిఖీలు నిర్వీర్యం చేయవచ్చన్న యోచనలో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ జోక్యం చేసుకుని విచారణ వేగవంతం అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 23 , 2025 | 06:13 AM