Share News

West Godavari: దారుణం.. అప్పు తిరిగివ్వమని అడిగిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:41 AM

జయకృష్ణ అనే వ్యక్తి భీమవరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి విజయవాడకు చెందిన రేష్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరియచం కాస్త స్నేహంగా మారింది.

West Godavari: దారుణం.. అప్పు తిరిగివ్వమని అడిగిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే..

పశ్చిమ గోదావరి: ప్రేమ పేరుతో యువతులపై ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులకు పాల్పడుతుంటారు. ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదని యాసిడ్ దాడులు చేస్తూ మహిళల జీవితాలను నాశనం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలను మనం కోకొల్లలుగా చూసుంటాం. అయితే ప.గో.జిల్లా పాలకోడేరులో ఈసారి విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిపై యువతి యాసిడ్‌తో దాడికి పాల్పడింది. తృటిలో తప్పించుకున్న బాధితుడు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ఈ వార్త సంచలనంగా మారింది.


జయకృష్ణ అనే వ్యక్తి భీమవరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి విజయవాడకు చెందిన రేష్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరియచం కాస్త స్నేహంగా మారింది. దీంతో తన అవసరాల నిమిత్తం జయకృష్ణ నుంచి రేష్మ పలు దఫాలుగా డబ్బులు తీసుకుంది. అయితే నెలలు గడుస్తున్నా ఆమె తిరిగి ఆ నగదు చెల్లించలేదు. దీంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ జయకృష్ణ ఆమెను అడిగాడు. అప్పుగా తీసుకున్న మెుత్తం నగదు ఇవ్వాల్సిందే అంటూ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే అతన్ని అడ్డు తొలగించుకుంటే డబ్బులు చెల్లించాల్సిన పని ఉండదని భావించిన రేష్మ పథకం రచించింది. నగదు ఇస్తానని చెప్పి అతన్ని పాలకోడేరు హైస్కూల్ వద్ద కలవాలని కోరింది.


రేష్మ చెప్పిన సమయానికి పాలకోడేరు పాఠశాల వద్దకు బాధితుడు జయకృష్ణ చేరుకున్నాడు. అయితే అతనికి అనుమానం రాకుండా రేష్మ బుర్ఖా ధరించి వచ్చింది. అనంతరం అదును చూసి తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ని జయకృష్ణపై పోసింది. దీంతో అప్రమత్తమైన యువకుడు యాసిడ్ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఈనెల 6వ తేదీన జరగగా.. బాధితుడు పాలకోడేరు పోలీసులను తాజాగా ఆశ్రయించాడు. అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వాలని అడిగితే దాడి చేసిందని ఫిర్యాదు చేశాడు. ఆమె నుంచి రక్షించాలని, తన నగదు తిరిగి ఇప్పించాలని కోరాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Vijayawada: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ప్రియుడి కోసం యువతి ఎంత పని చేసిందంటే..

AP News: ఆ పనుల కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీలు నియమించిన ఏపీ ప్రభుత్వం..

Updated Date - Nov 30 , 2024 | 11:43 AM