వైసీపీ ఐపీఎ్‌సలు!
ABN , Publish Date - Apr 04 , 2024 | 05:05 AM
అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారులపై బీజేపీ గురిపెట్టింది. కీలక స్థానాల్లో ఉన్న ఈ ఐపీఎ్‌సలు ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం పని చేస్తున్నారని మండిపడింది.

22 మందిని పక్కకు తప్పించండి
ఆ అధికారులతో ‘ఓటుకు చేటు’.. ఈసీకి బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఫిర్యాదు
నిర్దిష్టంగా పేర్లు, ఆరోపణలతో లేఖ
డీజీపీ ‘సీక్రెట్ ఫండ్స్’ మింగేశారు
ఎన్నికల మేనేజ్‌మెంట్ కోసం
ఇంటెలిజెన్స్ చీఫ్‌కు కోట్లు
రిషాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్
విపక్ష అభ్యర్థులు, నేతలను
అడ్డుకోవడమే లక్ష్యం
వైసీపీ జేబులో మనుషులుగా మారారు
నిష్పాక్షిక ఎన్నికలు జరగాలంటే
ఈ ఐపీఎస్‌లను పక్కకు తప్పించాలి
వినతిపత్రంలో పురందేశ్వరి స్పష్టీకరణ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారులపై బీజేపీ గురిపెట్టింది. కీలక స్థానాల్లో ఉన్న ఈ ఐపీఎ్‌సలు ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం పని చేస్తున్నారని మండిపడింది. వీరిని పక్కకు తప్పిస్తేనే ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, సజావుగా సాగుతుందని స్పష్టం చేసింది. ఇన్‌చార్జి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి నాన్ కేడర్ ఎస్పీ ఆనంద్ రెడ్డి వరకు ఏకంగా 22 మంది పేర్లు, వారిపై ఉన్న అభియోగాలు, అవినీతి చర్యలు, వైసీపీతో ఉన్న బంధం, విపక్షాలను వేధిస్తున్న వైనం... వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ‘నిష్పాక్షిక ఎన్నికల కోసం వీరిని విధుల నుంచి తప్పించాలని గట్టిగా భావిస్తున్నాం’ అని తెలిపారు. ఆయా అధికారులు అనేక సందర్భాల్లో మాటలు, చేతల ద్వారా వైసీపీ పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారని చెప్పారు. గత నెల 26వ తేదీన పురందేశ్వరి ఎన్నికల కమిషన్‌కు ఈ ఫిర్యాదు చేశారు. కాగా... ఈ జాబితాలోని ఆరుగురు ఐపీఎ్‌సలను ఈసీ ఇప్పటికే పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే. మున్ముందు మరెందరిపై చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిందే! పురందేశ్వరి తన ఫిర్యాదులో పేర్కొన్న అధికారులు, వారిపై చేసిన అభియోగాల వివరాలు ఇవి...
విశాల్ గున్నీ విశాఖ రేంజ్ డీఐజీ
భయంకరమైన అవినీతిపరుడు. విజయసాయి రెడ్డి జేబులో మనిషిలా మారిపోయారు. పొరుగు రాష్ట్రంలోని తన సమీప బంధువులకు ముడుపులు వెళ్లిపోతాయి.
రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ
ఈయన 2022 ఫిబ్రవరి నుంచి రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీగా పని చేస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం అర్హులైన పోలీసు అధికారుల జాబితాను యూపీఎ్‌ససీకి పంపనేలేదు. ముఖ్యమైన స్థానాల్లో ‘అనుకూల’ పోలీసు అధికారులనే నియమించి... వారు ఈ ఎన్నికల్లో పూర్తి ఏకపక్షంగా పని చేసేలా రాజేంద్రనాథ్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అంతేకాదు... పోలీసు శాఖకు సంబంధించిన ‘సీక్రెట్ రిజర్వ్ ఫండ్’ నుంచి భారీ మొత్తాన్ని సొంతానికి వాడేసుకుని... సంబంధిత ఫైళ్లను ధ్వంసం చేశారు. అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను మాయం చేశారు. అంతేకాదు... తనకు ఏ సమయంలోనైనా బదిలీ అవుతుందని ఆయన కూడా భావిస్తున్నారు.
పి.సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీ
ప్రధానమంత్రి పాల్గొన్న బహిరంగ సభకు ‘అనుకూల’ పోలీసు అధికారులను మాత్రమే నియమించి... వేర్వేరు చోట్ల చెక్‌పోస్టులు పెట్టి విపక్షాల కార్యకర్తలు సభా మైదానానికి రాకుండా, అడ్డుకునేందుకు ఈ అధికారి ప్రయత్నించారు. అంతేకాదు... ఈ ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు భారీగా డబ్బు పుచ్చుకున్నారు. చాలామంది విపక్ష నేతల అక్రమ అరెస్టుకు బాధ్యుడు. మూడేళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు అపరిమిత అధికార బలం అనుభవిస్తున్నారు. దీని ద్వారా... ఎస్పీలను, ఇతర పోలీసు అధికారులను బెదిరించి... వారి ద్వారా విపక్ష నేతలపై అక్రమ పద్ధతుల్లో వేధిస్తున్నారు.
ఎస్పీ కడప జిల్లా
ఈయన అవినీతికి పాల్పడినట్టు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నప్పటికీ.. సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో నియమించారు. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఇప్పటికే ఈయనకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బును దుబాయ్‌లోని బినామీ ఖాతాలో డిపాజిట్ చేశారు. వివేకా హత్యవల్ల వచ్చిన ప్రతికూలతను నివారించడానికి ఓటర్లను శాంతియుతంగా ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడమే ఈయన లక్ష్యం. పోలింగ్ రోజు అర్హులైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునే పని ఈయనకు అప్పగించారు. వైసీపీ అభ్యర్థులు ప్రత్యర్థులను బెదిరించడంలోనూ, వారి ప్రచారాన్ని అడ్డుకోవడంలోనూ సహకరించనున్నారు.
జాషువా ఎస్పీ, చిత్తూరు
ఈయన అత్యంత అవినీతిపరుడు. ఇటీవలే కృష్ణా జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈయనకు అప్పగించిన ప్రధాన బాధ్యత... చంద్రబాబును, ఆ పార్టీ నేతలను ఓడించడం! ముఖ్యంగా కుప్పంలో వైసీపీ నేతల అరాచకాలను చూసీ చూడనట్టు వ్యవహరించారు. దీంతో టీడీపీ నాయకత్వం ఒక్క కుప్పం నియోజకవర్గంపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు అండగా నిలిచారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలు కిడ్నాపునకు గురయ్యారు. కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా వారికి లేకుండా పోయింది.
రవిశంకర్‌రెడ్డి ఎస్పీ, పల్నాడు జిల్లా
ప్రధాని పాల్గొన్న సభకు జనం హాజరు కాకుండా రవిశంకర్‌రెడ్డి భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో కార్యకర్తలు, అభిమానులు అక్కడ ఉన్న కరెంటు స్తంభాలపైకి ఎక్కడం ప్రధాని గమనించారు. ఇది ప్రమాదకరమని, స్తంభాలు ఎక్కిన వారు వెంటనే కిందకు దిగాలని స్వయంగా ప్రధాని కోరాల్సి వచ్చింది. ఆ సమయంలో ఐజీ పాల్ రాజుతో పాటు రవిశంకర్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసు బలగాలను పంపలేదు. దీనికోసం పది నిమిషాల పాటు సభను నిలిపివేయాల్సి వచ్చింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు అనేకమందిని రవిశంకర్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా తప్పుడు కేసుల్లో ఇరికించారు.
పీవీ సునీల్ కుమార్‌డీజీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్
‘అంబేద్కర్ ఇండియా మిషన్’ సంస్థను స్థాపించి... దాని ద్వారా దళిత వాడల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ‘దళిత వాడలకు పంచాయతీ హోదా కల్పించాలి’ అనే మిషతో ఈ తతంగం నడుపుతున్నారు. హిందుత్వను వదిలిపెట్టాలని, బ్రిటిష్ కాలంలోనే దళితుల పరిస్థితి బాగుండేదని చెబుతూ ఆయన చేసిన ప్రసంగాలపై విచారణ జరుగుతోంది.
సంజయ్‌సీఐడీ అదనపు డీజీ
రకరకాల కేసులు బనాయిస్తూ మీడియా సంస్థలను బెదిరిస్తున్నారు. ఆయన ప్రస్తుతానికి కొంత తగ్గినట్లుగా కనిపిస్తున్నటికీ... వైసీపీ కోసం ఏం చేసేందుకైనా సదా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే... ఆయన తన కుటుంబ సభ్యుల ద్వారా లంచాలు తీసుకున్నట్లుగా ఏసీబీ ఆధారాలు సంపాదించింది.
విజయారావు, డీఐజీ, కర్నూలు
ఈయన అధికార పక్షానికి పూర్తిగా లొంగిపోయారు. కర్నూలు, ఆత్మకూరు, శ్రీశైలం, మంత్రాలయం, ఆదోని స్థానాల్లో వైసీపీని గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. దానికి అనుగుణంగా ఆయన ఆయా నియోజకవర్గాల్లో సీఐలు, ఎస్‌ఐలను నియమించారు. భయంకరమైన అవినీతిపరుడు. నిఘా విభాగం డీజీ, విజిలెన్స్ ఐజీ ఏ ఆదేశాలిచ్చినా తలొగ్గి అమలు చేస్తారు.
అన్బురాజన్, ఎస్పీ, అనంతపురం
వైసీపీ నేతల నుంచి ‘వేతనాలు’ పుచ్చుకునే వారి జాబితాలో ఈయనా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లోనూ ప్రమేయం ఉంది. హత్యలు జరిగినా పట్టించుకోని పోలీసు అధికారి. ప్రతిపక్ష అభ్యర్థులు ప్రచారానికి రాకుండా చూసే బాధ్యత ఈయనకు అప్పగించారు. ఇందుకోసం ఎంతటి అధికార దుర్వినియోగానికైనా పాల్పడతారు. రాయలసీమ మొత్తంలో అనంతపురం జిల్లాలోనే వైసీపీ అభ్యర్థులందరికీ ఘోర పరాజయం తప్పదని తేలింది. ఈ నేపథ్యంలోనే వారిని వేధింపులకు గురిచేసి.. ప్రచారం చేయకుండా నిరోధించే బాధ్యతను అధికార పక్షం ఈయనకు కట్టబెట్టింది.
ఆనంద్ రెడ్డి, ఎస్పీ, నాన్ కేడర్
ఈయన వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో రెండుసార్లు చకచకా పదోన్నతి లభించింది. విశాఖపట్నంలోనే మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. కానీ, ఈయనకు విశాఖపట్నం బాధ్యతలనే అప్పగించారు. విపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టడం, విపక్ష నేతలను నియంత్రించడమే పనిగా పెట్టుకున్నారు.
రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, కౌంటర్ ఇంటెలిజెన్స్
ఈయన ఇంతకుముందు చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇటీవలే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి వచ్చారు. ఈయనకు ప్రభుత్వం భారీగా ఎత్తున నిధులు అందుబాటులో ఉంచింది. విపక్షాలకు చెందిన నేతల ఫోన్లను ఈయన ట్యాప్ చేస్తున్నారు. విపక్ష అభ్యర్థి ఫోన్‌ను నేరుగా ట్యాప్ చేయకుండా... ద్వితీయ శ్రేణి నేతల నంబర్లను ట్యాప్ చేసి, వారికి అందుతున్న అధికారిక సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. చిలకలూరిపేటలో ప్రధాని మోదీ సభకు బయల్దేరిన విపక్ష ముఖ్య శ్రేణుల సెల్ ఫోన్లను పర్యవేక్షించి.. చెక్‌పోస్టుల వద్ద వారిని ఆపేయాలని పోలీసులను ఆదేశాలిచ్చారు.
పాల్ రాజ్, గుంటూరు రేంజ్ ఐజీ
ఇటీవల ప్రధానమంత్రి సభ జరిగిన ప్రాంతం ఈ అధికారి పరిధిలోకే వస్తుంది. ఇంటెలిజెన్స్ డీజీ (సీతారామాంజనేయులు), ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ఐపీఎస్ అధికారులు పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డిలతో విపక్ష కార్యకర్తలు ప్రధాని సభకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చాలా తెలివైన అధికారి. పైకి రూల్స్ ప్రకారం పని చేస్తున్నట్లుగా కనిపిసిస్తారు. కానీ... విపక్షాలను అడ్డుకునేందుకు చాపకింద నీరులా తతంగం నడిపిస్తారు. వైసీపీ నేతలు పెట్టే తప్పుడు ఫిర్యాదుల ద్వారా విపక్షాలకు చెందిన కీలక నేతలను అరెస్టు చేయిస్తారు.
అమ్మిరెడ్డి, డీఐజీ, అనంతపురం
ఈయన కుప్పం, తిరుపతి, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున అలజడులకు ప్రణాళిక రచించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితర వైసీపీ సీనియర్ నేతల నుంచి నేరుగా ఆదేశాలు స్వీకరిస్తారు. ఈయన కూడా భయంకరమైన అవినీతిపరుడు. ఆదాయానికి మించి ఆస్తులను భారీగా పోగేశారు.
ఫక్కీరప్ప జాయింట్ సీపీ, విశాఖపట్నం
అత్యంత అవినీతిపరుడు, అధికార పార్టీకి అమ్ముడు పోయారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి తొత్తులా మారారు. ఆయనకు అందాల్సిన ముడుపులన్నీ పొరుగు రాష్ట్రంలోని ఆయన బంధువులకు చేరుతున్నాయి.
కె.రఘురామిరెడ్డి, విజిలెన్స్ ఐజీ
సోదాలు, దాడులు నిర్వహించేందుకు అవసరమైన అపరిమితమైన అధికారాలను ఆయనకు కట్టబెట్టారు. రూ.30 కోట్ల దాకా నిధులను ఆయనకు అందుబాటులో ఉంచారు. మరో ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డితో కలిసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారు. దీని ఆధారంగా విపక్షాల అభ్యర్థులపై దాడులకు దిగి, వారి ప్రచారాన్ని దెబ్బతియాలని ప్రణాళిక రచించారు.
తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు
చట్టాన్ని, చట్ట నిబంధనలను తుంగలో తొక్కి విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష నాయకులను అడుగడుగునా అణిచివేశారు. అఽధికార పార్టీ వైసీపీ అసమ్మతి నాయకులను అరెస్టు చేసేందుకు సైతం పోలీసులను పురమాయించారు. వైసీపీ అసమ్మతి నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డిలను అక్రమంగా గృహ నిర్బంధం చేయించారు. అంతేకాదు, ప్రజల్లోకి వెళ్లకుండా నిర్బంధించారు. వైసీపీపై పల్లెత్తు మాటన్నా కేసుల కొరడా ఝళిపించారు.
జి.కృష్ణకాంత్, ఎస్పీ, కర్నూలు జిల్లా
ఈయన వైసీపీ నేతలకు పూర్తిగా లొంగిపోయారు. అత్తింటివారితో సన్నిహిత సంబంధాలున్న వైసీపీ ఎమ్మెల్సీ చొరవతో ఈయనకు కర్నూలులో పోస్టింగ్ దక్కింది.
రాధిక, ఎస్పీ, శ్రీకాకుళం
ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడును ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు.
క్రాంతిరాణా, కమిషనర్ విజయవాడ
చిన్నాచితకా కారణాలతోనైనా సరే.. విపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, వారి ప్రచారాన్ని అడ్డుకోవడం, ప్రచారాన్ని దెబ్బతీయడం అనే బాధ్యతలను ఈ అధికారికి అప్పగించారు. వైసీపీతో బాగా అంటకాగుతున్నారు. ప్రతి విషయాన్నీ సీఎం పేషీకి చేరవేస్తారు. అక్కడి నుంచి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటారు.
రఘువీరా రెడ్డి, ఎస్పీ, నంద్యాల
ఈయన ఈ ఏడాది జూన్ 30న రిటైర్‌కానున్నారు. దీంతో తన జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చేలా చూస్తానని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వాగ్దానం చేశారు. అతి త్వరలో రిటైర్ కానున్నందున ఎన్నికలు జరిగే జిల్లాలో ఈయనకు విధులు అప్పగించకూడదు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం.
పరమేశ్వర్ రెడ్డి, ఎస్పీ ప్రకాశం
తిరుపతి నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీగా ఈయన బదిలీపై వచ్చారు. ఎన్నికల్లో నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని పోలీసు ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలిచ్చి వారిలో తీవ్ర స్థాయి భయాందోళనలు రేపారు. వైసీపీ ఎమ్మెల్యేల అవసరాలకు అనుగుణంగానే డ్యూటీ చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ చిలకలూరిపేట సభ బందోబస్తు బాధ్యతల్లో ఆయన్ను కూడా నియమించారు. భద్రత అదుపు తప్పేలా చేశారు.