నీటి గండం
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:12 AM
మనిషి మనుగడకు నీరే ఆధారం. నీరుండే చోటనే నాగరికత పుట్టింది.

పడిపోతున్న భూగర్భ జల మట్టాలు
సంరక్షణ తగ్గింది...వినియోగం పెరిగింది
నగరంలో చెరువులు మాయం
రోడ్డుకు ఇరువైపులా కాంక్రీట్
వర్షపు నీరు ఇంకే పరిస్థితే లేదు
తీర ప్రాంతంలో ఉప్పునీరు
విశాఖ జిల్లాలో ఐదేళ్ల క్రితంతో పోల్చితే 0.92 మీటర్లు తగ్గిన భూగర్భ జలాలు
ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలని నిపుణుల సూచన
అప్రమత్తం కాకుంటే 2030కల్లా తాగునీటికి మరింత కటకట
నేడు ప్రపంచ నేడు జల దినోత్సవం
విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
మనిషి మనుగడకు నీరే ఆధారం. నీరుండే చోటనే నాగరికత పుట్టింది. అంతటి ప్రాముఖ్యత కలిగిన నీటి సంరక్షణలో మనం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం ఉపరితలంలో నీరే కాదు. భూగర్భంలో నీటిని కూడా విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నాం. కానీ సంరక్షణ మాత్రం వదిలేశాం. అందుకే మార్చి మూడో వారంలోనే విశాఖ నగరంలో ప్రమాద ఘంటికులు మోగుతున్నాయి. మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం. ఈ ఏడాది నినాదం ‘హిమనీనదాలు పరిరక్షణ’. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భూగర్భ జలాలపై కథనం ఇది...
నగరంలోని ఎండాడ, రుషికొండ, మధురవాడ, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. తీర ప్రాంతాల్లో పరిమితికి మించి బోర్లు తవ్వకం, వినియోగం వల్ల సముద్ర జలాలు చొచ్చుకురావడంతో భీమిలి నుంచి పాయకరావుపేట వరకూ పలుచోట్ల ఉప్పునీరు వస్తోంది. భూగర్భ జలాలను సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో తీర ప్రాంతానికి 20 కి.మీ. వరకూ ఉప్పునీరు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షం తీరులో మార్పులు
నైరుతి రుతుపవనాల సీజన్ 120 రోజుల్లో గతంలో 75 నుంచి 80 రోజులు వర్షాలు కురిసేవి. వర్షం నీరు భూమిలో ఇంకిపోయేది. దీంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. చెరువులు, గెడ్డలు, బావుల్లో నీటి నిల్వలు నిండుగా కనిపించేవి. గత కొన్నాళ్లుగా పూర్తిగా వర్షాల తీరు మారిపోయింది. వర్షం కురిసే రోజుల సంఖ్య 70 కంటే తక్కువకు పడిపోయింది. ఒకేసారి భారీవర్షాలు కురవడంతో నీరు ఇంకే పరిస్థితి లేకుండాపోయింది. భూమిలో తేమ తగ్గిపోయింది. ఏటా 1200 మి.మీ. వర్షపాతం నమోదయ్యే విశాఖలో నీటి కోసం కటకటలాడాల్సి పరిస్థితి వచ్చేసింది.
చెరువులు మాయం
ఒకప్పుడు అల్లిపురం, ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్, జీవీఎంసీ కార్యాలయం ఉండే ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెరువులు ఉండేవి. అలాగే ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి సముద్రంలో కలిసే వాగు (ప్రస్తుతం ఎంవీపీ కాలనీ మధ్యగుండా వెళుతుంది) వేసవిలో మంచినీటితో ప్రవహించేది. అటువంటి వాగు ఇప్పుడు మురుగు కాల్వగా మారింది. అదేవిధంగా నగరు శివారులో పెందుర్తి నుంచి గోపాలపట్నం వరకూ గొలుసుకట్టు చెరువులు మాయమయ్యాయి. మధురవాడ, కొమ్మాదిలో గృహ నిర్మాణ సంస్థ కాలనీలు వెలిశాయి. రుషికొండ, పెదగంట్యాడ పరిసరాల్లో చెరువులు కప్పేశారు.
స్మార్ట్ సిటీ పేరుతో రోడ్లుకు ఇరువైపులా కాంక్రీట్...
స్మార్ట్ సిటీ పేరుతో నగరంలో రోడ్లకు ఇరువైపులా కాంక్రీట్ చేసేశారు. దీనివల్ల వర్షపునీరు భూమిలో ఇంకే అవకాశం పూర్తిగా మూసుకుపోయింది. చాలా దేశాల్లో రోడ్లకు ఇరువైపులా నీరు ఇంకే కాంక్రీట్‌ను వినియోగిస్తుంటారు. చిన్నచిన్న రంధ్రాలు వుండడంతో నీరు భూమిలోకి ఇంకిపోతుంది. అటువంటి విధానం జీవీఎంసీ పరిధిలో ఎక్కడా కనిపించదు. పార్కుల్లో కూడా సిమెంట్ నిర్మాణాలే పెరిగాయి.
రెయిన్ హార్వెస్ట్ విధానం విఫలం
నగరంలో వర్షపునీరు భూమిలోకి ఇంకే విధానం అమలు పూర్తిగా విఫలమైంది. వ్యక్తిగత గృహం నుంచి అపార్టుమెంట్ వరకూ నిర్మాణ సమయంలో విధిగా ఇంకుడుగుంతలు తవ్వాలి. అయితే పది శాతం మంది కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవడం లేదు. ఇంకుడు గుంతల ఏర్పాటుకు బిల్డర్లు సుముఖత చూపడం లేదు, వ్యక్తిగత ఇల్లు కట్టుకునేవారు కూడా బోరు వేస్తున్నారు తప్ప ఇంకుడు గుంతల ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు అలంకారప్రాయంగా ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు, మైదానాల్లో కూడా ఇంకుడు గుంతలు నిర్వహించడం లేదు. కనీసం వర్షం పడే నీటిని భూమిలోకి పంపే ఏర్పాట్లు కనిపించవు.
ప్రతి ఇంట్లో వర్షపునీటి నిల్వ చేయాలి
శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్,
భూగర్భ జల శాఖ, అనకాపల్లి జిల్లా (విశాఖ జిల్లా ఇన్‌చార్జి)
నగరం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వినియోగం పెరిగింది. భూమిలో నీటిని యథేచ్ఛగా తోడేస్తున్నాం. కానీ వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కాంక్రీట్ చేసేస్తున్నారు. 2030కల్లా నీటికి కటకట వచ్చే పరిస్థితి ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు తగినంతగా ప్రజలు సన్నద్ధం కావడం లేదు. ఇంటి నిర్మాణ అనుమతుల్లో తప్పనిసరిగా నీటి నిల్వకు ఏర్పాట్లు చేయాలనే నిబంధన అమలుచేయాలి. నేల స్వభావం, నిర్మాణం విధానం మేరకు వర్షపునీటి నిల్వ ట్యాంకులు నిర్మించాలి. నగరంలో కొండలున్నచోట చెక్‌డ్యామ్‌లు, రాక్‌ఫిల్ డ్యామ్‌లు నిర్మించాలి. గ్రామీణ ప్రాంతంలో సాధ్యమైనంతగా ఉపరితలంలో లభించే నీటిని వాడుకోవాలి. చెరువులు, వాగులు, పాడుపడిన బావులను నీటి నిల్వలకు అనుగుణంగా రూపొందించాలి. ఉమ్మడి విశాఖ జిల్లాలో తీర ప్రాంతాల్లో ప్రజలు 40 మీటర్లకు మించి బోర్లు వేయకూడదు. నీటి ప్రాధాన్యంపై ప్రజలను చైతన్య పరచాలి. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ ప్రాధాన్యం, ఇప్పుడు నగరంలో హెల్మెట్ ధారణపై పోలీసులు అవగాహన కల్పించినట్టు నీటి వినియోగం, నిల్వల సంరక్షణపై పెద్దఎత్తున చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.
సెంట్రల్ పార్కు వద్ద 15.88 మీటర్ల లోతులో భూగర్భ జలాలు
విశాఖ జిల్లాలో సుమారు 30 లక్షల మంది జనాభా ఉండగా, 25 లక్షల వరకు నగరంలోనే ఉంటున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల మేరకు ప్రతి మనిషికి రోజుకు (తాగడం, స్నానం, మరుగుదొడ్డి, బట్టలు ఉతుక్కోవడం, ఇతరత్రా వినియోగం) 150 లీటర్లు నీరు అవసరం. అయితే అంత నీరు ఉపరితలం నుంచి లభించడం లేదు కాబట్టి భూగర్భ జలాలపై ఆధారపడుతున్నాం. ఈ విధంగా నగరంలో రోజు లక్షల గ్యాలన్ల నీరు తోడేస్తున్నారు. భూగర్భ జల శాఖ లెక్కల ప్రకారం జిల్లాలోని 11 మండలాల్లో 31 పీజియో మీటర్లు ఉన్నాయి. అక్కడ గత ఏడాది భూగర్భ జలాలను పరిశీలిస్తే...సగటున 7.55 మీటర్ల లోతులో ఉన్నాయి. 2020లో 6.63 మీటర్ల లోతున ఉన్నాయి. అంటే 2020తో పోల్చితే 2024లో 0.92 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇక 2020 మే నెలలో 7.92 మీటర్లగా ఉండగా 2024 మే నెలలో 10.24 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలిస్తే...సెంట్రల్ పార్కు (మహారాణిపేట మండలం) వద్ద 15.88 మీటర్లు, కణితి కాలనీలో 12.63, ఆరిలోవ పోలీస్ స్టేషన్ వద్ద 12.4, మధురవాడలో 11.93, ఎండాడలో 11.54,మారికివలసలో 9.21, శివాజీపాలెంలో 8.48, పెందుర్తిలో 8.26, పెదరుషికొండలో 8.03 మీటర్లలోతున భూగర్భ జలాలు ఉన్నాయి. మిగిలినచోట్ల ఆరు మీటర్లు, అంత కంటే తక్కువలోతున నీటి మట్టాలు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబరులో కురిసిన వర్షాలు కొంతవరకు నగరం, పరిసరాల్లో భూగర్భ జల మట్టాలు మరింతగా పడిపోకుండా కాపాడాయి. అయితే జనవరి నుంచి వర్షాలు లేకపోవడం, వేసవి తీవ్రత పెరగడంతో ఈ ఏడాది మే నాటికి భూగర్భ మట్టాలు మరింతగా పడిపోయే అవకాశం ఉంది. భీమిలి, చిప్పాడ, కోట వీధి, చిలకపేట, జాలారిపేట ప్రాంతాల్లో కొన్నిచోట్ల నీటి వాడకం పెరగడంతో ఉప్పు నీరు వస్తోంది. గాజువాక పరిధిలో కణితి కాలనీలో ఫ్లోరైడ్ లక్షణాలు ఉన్నాయి.