మెడికల్ షాపులపై విజిలెన్స్
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:13 AM
ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో శుక్రవారం మందుల షాపులపై అధికారులు దాడులు చేశా రు. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈగల్ టీమ్, డ్రగ్ కంట్రోలు డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.

రాజమహేంద్రవరం, మార్చి 21 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో శుక్రవారం మందుల షాపులపై అధికారులు దాడులు చేశా రు. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈగల్ టీమ్, డ్రగ్ కంట్రోలు డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. నార్కో టిక్ మందులు (మత్తు మందులు) విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఎం.స్నేహిత దాడులు చేసినట్టు డ్రగ్స్ కంట్రోలు డిపార్ట్‌మెంట్ రాజమహేంద్రవరం ఏడీ డి.నాగమణి తెలి పారు. కొన్ని మందుల షాపుల్లో నార్కొటిక్(ఎన్‌ఆర్‌ఎక్స్- మత్తు) మందులు బిల్లులు లేకుండా డాక్టర్ ప్రిస్కిప్సన్ లేకుండా విక్రయించడం గమనించా మని,ఆ మందుల షాపులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని తిరుమల శ్రీనివాసా మెడికల్ ఏజెన్సీలో ట్రమడోల్ ఇంజక్షన్లు గుర్తించారు. అక్కడి లెక్కల ప్రకారం 1000 ఉండాలి.. కానీ 250 అమ్మేశారు. ఎవరికి అమ్మారు, ఎలా అమ్మారో వివరాలు లేవు. దీనిపై విచారణ చేస్తామని ఎస్పీ ఎం.స్నేహిత తెలిపారు. పద్మజ మెడికల్ ఏజెన్సీ, లైఫ్ మెకికల్ స్టోర్, సాయి మెడికల్ ఏజెన్సీల్లో దాడులు జరిగాయి. జిల్లా లో 16 చోట్ల దాడులు నిర్వహించారు. పలు చోట్ల మత్తు మం దులు దొరికినట్టు తెలిసింది. రాత్రి కూడా దాడులు నిర్వహిస్తున్నారు.
కోనసీమలో మెరుపు దాడులు
అమలాపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ గరుడలో భాగంగా జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలోని పలు కూ డళ్లలో ఉన్న మెడికల్ షాపులపై వివిధ శాఖల అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. దాంతో పట్టణంలో ఉన్న మెడికల్ షాపుల యజమానులు కొందరు ఆ సమాచారం తెలుసుకుని షాపులు కట్టివేసి వెళ్లిపోవడం కనిపించింది. ఎప్పుడూ వందలాది మందికి వినియోగదారులతో రద్దీగా ఉండే కీలక మెడికల్ షాపులే లక్ష్యంగా చేసుకుని ఈ బృందం సోదాలు నిర్వహించడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే వీటిలో కొన్ని షాపుల్లో మందులు తగ్గింపు ధరలకు ఇస్తుండడంతో వినియోగదారులు వాటిపైకి ఎగబడుతుండడం వల్ల నిత్యం రద్దీగా ఉంటాయి. ఆ సమాచారంతోనే సోదాలు జరిగాయని తెలిసింది. కాగా అమలాపురం పట్టణంలో రాష్ట్ర డీజీపీ హరీష్‌గుప్తా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడలో భాగంగా పట్టణంలోని మెడికల్ షాపులపై వివిధ శాఖల అధికారులతో కూడిన బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు, డ్రగ్స్ అధికారులతో కూడిన బృందం అమలాపురంలోని నాలుగు మెడికల్ షాపులపై తనిఖీలు చేపట్టారు. డాక్టర్ల ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు అమ్మినా, శాంపిల్స్ డ్రగ్స్ అమ్మినా చర్యలు తీసుకునే లక్ష్యంతో ఈ సోదాలు చేశారు. కాగా నాలుగు మెడికల్ షాపులపై ఈ బృందం జరిపిన తనిఖీల్లో ఎటువంటి నిషేధిత మందులు లభ్యం కాలేదు. కానీ షాపుల్లో సరైన రికార్డులు నిర్వహించకుండా విక్రయాలు చేస్తున్నారని విజిలెన్స్ సీఐ గుమ్మళ్ల మధుబాబు తెలిపారు. ఈ తనిఖీల్లో డీసీటీవో నవీన్‌కుమార్, డ్రగ్ ఇనస్పెక్టర్ మురళీ, లీగల్ ఇన్‌స్పెక్టర్ మురళీ తదితరులు పాల్గొన్నారు.