SEBI : బోగస్ ఫిన్‌ఇన్‌ఫ్లుయెన్సర్లపై సెబీ వేటు
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:12 AM
క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. అనధికారిక పెట్టుబడి సలహాదారుల (ఫిన్‌ఇన్‌ఫ్లుయెన్సర్స్) భరతం పడుతోంది

70,000 సోషల్ మీడియా ఖాతాలు క్లోజ్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. అనధికారిక పెట్టుబడి సలహాదారుల (ఫిన్‌ఇన్‌ఫ్లుయెన్సర్స్) భరతం పడుతోంది. గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు ఇలాంటి 70,000 మంది ఫిన్‌ఇన్‌ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేయించింది. సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత్ నారాయణ్ ఈ విషయం వెల్లడించారు. స్టాక్ మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరడంతో చాలా మంది సెబీ వద్ద నమోదు కాకుండానే పెట్టుబడి సలహాదారులు, రీసెర్చ్ అనలిస్టుల పేరుతో సోషల్ మీడియా ద్వారా పెట్టుబడి సలహాలు ఇస్తూ మదుపరులను తప్పుదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సెబీ గత ఏడాది అక్టోబరు నుంచి వీరిపై చర్యలు ప్రారభించింది. ఇలాంటి కేటుగాళ్ల ఆటలు కట్టించేందుకు సెబీ వద్ద నమోదైన ఇన్వె్‌స్టమెంట్ అడ్వైజర్లు, అనలిస్టులు కూడా తమకు సహకరించాలని నారాయణ్ కోరారు.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
దేశీయ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులపైనా నారాయణ్ మాట్లాడారు. ఎఫ్‌పీఐ సంస్థల అమ్మకాలపై మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల వీటి అమ్మకాలు ఎంత ఉధృతంగా ఉన్నా గత నెలాఖరు వరకు చూసినా, వీటి పెట్టుబడులు మన ఈక్విటీ మార్కెట్లో రూ.62 లక్షల కోట్లు, డెట్ మార్కెట్‌లో రూ.5.9 లక్షల కోట్ల వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే కీలకమైన ఎఫ్‌పీఐల పెట్టుబడులపై ఉదాసీన వైఖరి కూడా పనికిరాదన్నారు. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి, పటిష్ఠమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, చక్కటి నిర్వహణ ద్వారా ఈ పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు.
జూలై 1 వరకు గడువు
లిస్టెడ్ కంపెనీలకు ఉద్దేశించిన సంబంధిత ఆర్థిక లావాదేవీల వివరాల వెల్లడిపై అభిప్రాయాల సేకరణ గడువును సెబీ ఏప్రిల్ 1 నుంచి జూలై 1 వరకు పొడిగించింది. లిస్టెడ్ కంపెనీలు తమ అనుబంధ కంపెనీలు, లేదా తమ ప్రమోటర్లు, బోర్డు సభ్యుల నిర్వహణలోని కంపెనీలతో జరిగే ఆర్థిక లావాదేవీల వివరాలను ఆయా కంపెనీల ఆడిట్ కమిటీలకు తెలియజేసేందుకు నిర్ణీత ప్రామాణికాలు రూపొందించాలని సెబీ తలపెట్టింది. దీనిపై ఏప్రిల్ 1లోగా తమ అభిప్రాయాలు తెలపాలని గత నెల పరిశ్రమ వర్గాలను కోరింది. అయితే ఫిక్కీ, సీఐఐ, అసోచామ్ ఇందుకు మరింత గడువు కోరడంతో ఈ గడువును ఈ ఏడాది జూలై 1 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.
బ్రోకర్లకు ఊరట
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ-ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్-ఐఎ్‌ఫఎ్‌ససీ)లో సొంత యూనిట్లు లేదా జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయాలనుకునే బ్రోకర్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని సెబీ భావిస్తోంది. ఇందుకు తన నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లేకుండానే వారిని అనుమతించాలని యోచిస్తోంది. అయితే గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేసే బ్రోకరేజీ సంస్థల అనుబంధ లేదా జాయింట్ వెంచర్ కంపెనీలు ప్రధాన కంపెనీతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తి స్వతంత్రగా, గిఫ్ట్ సిటీ నిబంధలకు లోబడి పని చేయాలని ప్రతిపాదించింది.
ప్రకటనలపైనా నియంత్రణ
మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ మరో కీలక చర్య తీసుకుంది. తన వద్ద నమోదైన సంస్థలు.. గూగుల్, మెటా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇచ్చే ప్రకటనలను మరింత కట్టుదిట్టం చేసింది. ఇక ఈ ప్రకటనలు ఇచ్చే సంస్థలు తమ ప్రచార ప్రకటనలతో పాటు సెబీ వద్ద నమోదు చేసిన తమ ఈ-మెయిల్, మొబైల్ నంబర్లను కూడా ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ సంస్థలు నిజమైనవా? కావా? అని నిర్ధారించుకుని వారి ప్రకనలను తమ ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టు చేస్తాయి. తమ వద్ద నమోదైన సంస్థలు, వ్యక్తులు వచ్చే నెలాఖరులోగా మారిన తమ ఈ- మెయిల్స్, మొబైల్ నంబర్లను ‘సెబీ ఎస్‌ఐ’ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాలని సెబీ కోరింది.సెబీ వద్ద నమోదైన గుర్తింపు సంస్థల పేరుతో కొన్ని బోగస్ సంస్థలు, కేటుగాళ్లు మదుపరులకు టోపీ పెడుతున్నట్టు వార్తలు రావడంతో సెబీ ఈ చర్య తీసుకుంది.

జియో బంపర్ ఆఫర్.. రీఛార్జ్ ప్లాన్లతోపాటు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్..

ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్

స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టాలు! కారణం ఇదే
