వైసీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటాం
ABN , Publish Date - Jun 26 , 2024 | 11:57 PM
అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొని, ప్రజా అవసరాలకు వినియోగిస్తామని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులతో కలిసి హెచ్చెల్సీ కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం పరిశీలించారు.

అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం అర్బన/ క్లాక్‌టవర్, జూన 26: అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొని, ప్రజా అవసరాలకు వినియోగిస్తామని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులతో కలిసి హెచ్చెల్సీ కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం పరిశీలించారు. హెచ్చెల్సీ కార్యాలయ స్థలాన్ని కబ్జా చేసి.. క్వార్టర్స్, చెట్లను కూల్చివేసి, ప్రజల సొమ్ముతో అక్రమంగా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. నగరపాలక సంస్థ, అహుడా అనుమతులు లేకుండానే ప్యాలె్‌సను తలపించేలా వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నా నగరపాలక సంస్థ, హెచ్చెల్సీ, అహుడా అధికారులెవరూ నోటీసులు జారీ చేయకపోవడం దారుణమని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో త్వరలోనే వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చనేలా వైసీపీ పాలన సాగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ అన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. మంగళగిరిలో తమ పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తుంటే అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా కోర్టుకు వెళ్లారని, అయితే టీడీపీ చేపట్టిన ప్రతి నిర్మాణం సరైనదేనని కోర్టులు చెప్పాయని అన్నారు.
హెచ్చెల్సీకి కేటాయించండి..
వైసీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని హెచ్చెల్సీకి కేటాయించాలని ఏపీ ఎన్జీఓ, ఇరిగేషన ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. వైసీపీ కార్యాలయ భవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన అర్బన ఎమ్మెల్యేకి వారు వినతిపత్రం అందజేశారు. తెలుగుతల్లి కూడలిలో ఉన్న హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయాన్ని ఉన్నఫలంగా ఖాళీచేయించారని, ప్రత్యామ్నాయం చూపకుండా నిర్లక్ష్యం చేశారని ఏపీ ఎన్జీఓ నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఇరిగేషన ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసులు, మహబూబ్ దౌలా అన్నారు. హెచ్చెల్సీ కాలనీలోని మూడు గదుల్లో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి తమకు వైసీపీ కార్యాలయ భవనాన్ని కేటాయించాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.