Share News

అన్నం వడ్డించి.. ఆప్యాయంగా పలకరించి

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:05 AM

నారా దేవాన్ష్‌ 11వ పుట్టినరోజున ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం, అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనాలు వడ్డించారు.

అన్నం వడ్డించి.. ఆప్యాయంగా పలకరించి

దేవాన్ష్‌ పుట్టినరోజు సందడి

నుదుట తిరునామం.. తళతళ మెరిసే సరిగ పంచె, లాల్చీ.. మెడలో పట్టు కండువా.. సంప్రదాయ వస్త్రధారణతో తాతా మనవళ్లు ఇద్దరూ శుక్రవారం తిరుమలలో సందడి చేశారు. చిరునవ్వులతో భక్తులకు అన్నం వడ్డించారు. నారా దేవాన్ష్‌ 11వ పుట్టినరోజున ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం, అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనాలు వడ్డించారు. దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ఏటా ఈ సంప్రదాయాన్ని చంద్రబాబు కుటుంబం పాటిస్తోంది.

శ్రీవారి దర్శనం

సీఎం చంద్రబాబుతో పాటూ ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, దేవాన్ష్‌ ఉదయం 8.30గంటలకు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. సీఎం హోదాలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లే అవకాశమున్నప్పటికీ చంద్రబాబు ఎప్పటిలానే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారానే దర్శనానికి వెళ్లారు. ఉదయం 8.28 గంటలకు మహద్వారం వద్దకు చేరుకున్న సీఎంకు టీటీడీ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో వేదాశీర్వచనం అందుకుని 9.19 గంటలకు ఆలయం వెలుపలకు వచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు సీఎం కుటుంబం ఆలయంలో గడిపింది.అంతకు అరగంట ముందే ఏర్పాట్ల పర్యవేక్షణకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయంలోకి వెళ్లారు. సీఎం రాకకు ముందే టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు కూడా ఆలయంలోకి వెళ్లారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి కూడా వైకుంఠం కాంప్లెక్స్‌ ద్వారా ముందే ఆలయంలోకి వెళ్లారు. సీఎం కుటుంబం ఆలయంలోకి వెళ్లిన తర్వాత తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గురజాల జగన్మోహన్‌, మురళీ మోహన్‌ లోపలికి వెళ్లారు. ఆ తర్వాత మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,టీడీపీ నాయకులు నరసింహ యాదవ్‌, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఊకా విజయకుమార్‌, జేబీ శ్రీనివాసులు, శ్రీధరవర్మ, అన్నా రామచంద్రయ్య, అనితా యాదవ్‌, హేమాంబరధర నాయుడు,బుల్లెట్‌ రమణ, కృష్ణయాదవ్‌ తదితరులు ఆలయంలోకి ప్రవేశించారు.

అన్నప్రసాదాలు వడ్డిస్తూ..

శ్రీవారి దర్శనం అనంతరం ఉదయం 9.25గంటల ప్రాంతంలో చంద్రబాబు కుటుంబం వెంగమాంబ అన్నప్రసాదానికి చేరుకుంది. తొలుత వేంకటేశ్వర స్వామి పటం వద్ద పూజలు నిర్వహించారు.ముఖ్యమంత్రిననే హోదాను పక్కనబెట్టి మనవడికి అన్నదానం ప్రాధాన్యాన్ని వివరిస్తూ, చంద్రబాబు అన్నదాన సత్రంలో భక్తుల విస్తర్లలో అన్నప్రసాదాలను వడ్డించారు. దేవాన్ష్‌, చంద్రబాబు, లోకేశ్‌, భువనేశ్వరి, బ్రాహ్మణిలు భక్తులకు బెల్లం పొంగలి, మసాలా వడలను అరిటాకుల్లో వడ్డించారు. ఈ సమయంలో భక్తులతో కలుపుగోలుగా మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఏవైనా సమస్యలున్నాయా అని అడుగుతూ సీఎం అన్నప్రసాదాలను వడ్డించారు. అన్నప్రసాదాలు చాలా రుచిగా ఉన్నాయంటూ భక్తులు సీఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సీఎం కూడా కుటుంబ సభ్యులతో కలిసి అరిటాకుల్లో వడ్డించిన అన్నప్రసాదాలను స్వీకరించారు.

Updated Date - Mar 22 , 2025 | 02:05 AM