ఉద్యోగ మార్కెట్‌కు మళ్లీ మంచి రోజులు
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:30 AM
ఉద్యోగ మార్కెట్ గాడిన పడుతోంది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో నియామకాలకు ఢోకా ఉండదని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా వెల్లడించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాలకు...
వచ్చే మార్చి వరకు నియామకాల జోరు
మ్యాన్‌పవర్ గ్రూప్
న్యూఢిల్లీ: ఉద్యోగ మార్కెట్ గాడిన పడుతోంది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో నియామకాలకు ఢోకా ఉండదని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా వెల్లడించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన 3,000 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి కంపెనీ మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ పేరుతో ఒక సర్వేను రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 53ు కంపెనీల ప్రతినిధులు వచ్చే మార్చిలోగా తమ ఉద్యోగుల సంఖ్య మరింత పెరుగుతాయని చెప్పారు. 13ు మంది తగ్గుతాయని, 31ు మంది ఎదుగూ బొదుగు ఉండదని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తామని చెప్పిన కంపెనీలను తీసివేసినా నికరంగా 40ు కంపెనీలు నియామకాలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది ఇదే కాలం లేదా ఈ ఏడాది డిసెంబరుతో పోల్చినా ఇది మూడు శాతం ఎక్కువ.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై కంపెనీలకు పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ చెప్పారు. ఈ నియామకాల్లో ఐటీ రంగం వాటా 50ు వరకు ఉండనుండగా ఆర్థిక, రియల్ ఎస్టేట్ వాటా 44ు, కన్స్యూమర్ గూడ్స్, సేవల రంగం వాటా 40ు వరకు ఉంటుందని సర్వే వెల్లడించింది.