Share News

Varalakshmi Vratam: వరాలు కురిపించే వరమహాలక్ష్మి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఇదే..!

ABN , Publish Date - Aug 15 , 2024 | 02:03 PM

శ్రావణ మాసం ధనుర్మాసంలో భాగం. ధనుర్మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతి. ఇక మహావిష్ణువు సతిగా, అష్టైశ్వార్యాలు ప్రసాదించే కల్పవల్లిగా ఆ మహాలక్ష్మిని వర మహాలక్ష్మిగా పూజిస్తారు.

Varalakshmi Vratam: వరాలు కురిపించే వరమహాలక్ష్మి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఇదే..!
Varalakshmi Vratam

తెలుగు పంచాంగంలో కొన్ని మాసాలకు చాలా ప్రత్యేకత ఉంది. వాటిలో శ్రావణ మాసం ప్రముఖమైనది. ఒకవైపు పెళ్లిళ్ల హడావిడి జరుగుతుంటే.. మరొక వైపు వూజలు, వ్రతాలతో ప్రతి ఇల్లు శోభిల్లుతూ ఉంటుంది. శ్రావణ మాసం ధనుర్మాసంలో భాగం. ధనుర్మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతి. ఇక మహావిష్ణువు సతిగా, అష్టైశ్వార్యాలు ప్రసాదించే కల్పవల్లిగా ఆ మహాలక్ష్మిని వర మహాలక్ష్మిగా పూజిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఇతర శుక్రవారాలలో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. మహిళలకు సౌభాగ్యాన్ని, ఇంటిల్లిపాదికి అష్టైశ్వార్యాలను చేకూర్చే వరలక్ష్మి వ్రతానికి కావలసిన వూజ సామాగ్రి గురించి తెలుసుకుంటే..

పూజా సామాగ్రి..

  • అమ్మవారి పటం..

    పూజా సామాగ్రిలో మొదటి అంశం అమ్మవారి పటం. వరలక్ష్మి అమ్మవారు పటంలో నిలబడి కాకుండా కూర్చొన్న భంగిమలో ఉండాలి. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో.. అటూఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి పటం పూజకు శుభప్రదంగా భావించబడుతుంది.

  • కలశం..

    రాగి లేదా వెండి కలశం చెంబు. కలశపూజ కోసం.

  • కొబ్బరి కాయలు..

    రెండు కొబ్బరి కాయలు. ఒకటి కలశం మీద ఉంచేందుకు, ఇంకొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు.

  • జాకెట్ ముక్కలు..

    రెండు జాకెట్ ముక్కలు. ఒకటి కలశం పైన ఉంచాలి. మరొకటి అమ్మవారికి చీరతో పాటు వాయనంగా ఇచ్చేందుకు.

    ముత్తయిదువులకు జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలని అనుకునేవారు విడిగా జాకెట్ ముక్కలు సమకూర్చుకోవాలి.

  • పీటలు..

  • రెండు పీటలు కావాలి. అమ్మవారి పటాన్ని ఉంచడానికి ఆసనం కోసం ఒక పీట. రెండోది కలశాన్ని స్థాపించేందుకు. కలశాన్ని స్థాపించేందుకు పీట లేని పక్షంలో అరటి ఆకు లేదా విస్తరాకు అయినా ఉపయోగించవచ్చు.

  • బియ్యం..

    అరకిలో బియ్యాన్ని పీటల లేదా ఆకుల మీద పోసి బియ్యం మీద కలశాన్ని నిలపాలి.

  • శనగలు..

    అరకిలో శనగలు. ఈ శనగలను ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఇవి అమ్మవారికి నివేదన కోసం.. ముత్తయిదువులకు పంచేందుకు.

  • పానకం కోసం..

    అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు. ఈ పానకం కోసం మిరియాలు, యాలకలు, బెల్లం అవసరం. వీటితో పానకం చేసి నివేదించాలి.

  • పెసరపప్పు..

    అమ్మవారికి వడపప్పు నివేదించాలి అనుకుంటే పెసరపప్పు అవసరం. అలాగే చలిమిడి నివేదించాలని అనుకుంటే బెల్లం కూడా సిద్దంగా ఉంచుకోవాలి. వీటితో పాటు ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరెలు ప్రసాదాలను సిద్దం చేసుకోవాలి.

  • విడిపూలు..

    అమ్మవారి పూజకు ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిది. ఆదు రకాలు కుదరకపోతే కనీసం తెలుపు, ఎరుపు రంగులో ఉండే పూలు అయినా సమకూర్చుకోవాలి.

  • పూలమాలలు..

    రెండు పూలమాలలు సమకూర్చుకోవాలి. ఒకటి అమ్మవారి కలశానికి, రెండోది అమ్మవారి చిత్రపటానికి. పూలమాలలు ఎరుపు, తెలుపు పూలతో అల్లి ఉంటే ఇంకా శుభప్రదం.

  • బియ్యం పిండి..

    ముగ్గు వేయడానికి బియ్యం పిండి సమకూర్చుకోవాలి.

  • పసుపు, కుంకుమ..

    అమ్మవారి కలశానికి, పీటలకు అద్దేందుకు, పూజస కోసం, అమ్మవారికి తాంబులంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు సమకూర్చుకోవాలి.

  • గాజులు..

    రెండు డజన్ల గాజులు సమకూర్చుకోవాలి. అమ్మవారికి, ముత్తయిదువులకు వాయనంలోకి ఇవి ఉపయోగించాలి.

  • చీర..

    అమ్మవారి పూజలో ఉపయోగించేందుకు ఆకుపచ్చ, తెలుపు లేదా ఎరుపు, పసుపు.. ఏదైనా రంగు చీర సమకూర్చుకోవాలి. నలుపు, నలుపులో కనిపించే రంగులు మంచివి కావు.

  • గంధము..

    అమ్మవారి పటానికి, ముత్తయిదువులకు పూసేందుకు గంధం సమకూర్చుకోవాలి.

  • తమలపాకులు..

    మూడు డజన్ల తమలపాకులు కావాలి. అమ్మవారికి కలశానికి, ముత్తయిదువులకు మూడు తమలపాకుల చెప్పున దక్షిణ ఇచ్చేందుకు.

  • అరటిపండ్లు..

    అరటిపండ్లు రెండు డజన్లు. ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమ.. ఇవన్నీ తమలపాకులలో ఉంచి తాంబులం ఇవ్వాలి.

  • మామిడి ఆకులు..

    మామిడి ఆకులు ఇంటికి తోరణాలు కట్టడానికి, పూజగది అలంకరించడానికి, కలశంలో ఉంచడానికి.

  • పంచామృతం కోసం..

    ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార.

  • పిండి వంటలు..

    అమ్మవారి నివేదనకు శక్తి కొలది పిండి వంటలు చేసుకోవాలి.

  • తోర బంధాలు..

    తోరపూజ సమయంలో అమ్మవారికి, ముత్తయిదువులకు , పూజ చేసుకునే వారికి కట్టేందుకు ఐదు తోర బంధాలు(దారపు పోగులు) కావాలి.

  • దీపారాధన సామాగ్రి..

    అమ్మవారికి రెండు వైపులా వెలిగించేందుకు రెండు దీపం కుందులు కావాలి(పెద్దగా ఉంటే మంచిది)

    అమ్మవారికి తామర వత్తులు అంటే ఇష్టం. కుదిరితే తామర వత్తులు కుదరని పక్షంలో పత్తి వత్తులు వాడచ్చు.

  • పంచపాత్ర..

    ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్దరణి, చిన్న పళ్లెం.

  • హారతి కోసం..

    హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం.

  • గంట..

    నివేదన సమయంలోనూ, హారతి సమయంలో ఉపయోగించేందుకు గంట.

  • ఇతర సామాగ్రి..

    అక్షతలు, అగరవొత్తులు, దీపారాధన నూనె లేదా నెయ్యి(అమ్మవారికి నేతి దీపం శ్రేష్టం. శక్తికొలది నేతి దీపం వెలిగించవచ్చు), అగ్గిపెట్టె.

Updated Date - Aug 15 , 2024 | 02:40 PM