CM Revanth Reddy: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్
ABN , Publish Date - Apr 27 , 2024 | 05:33 PM
భారతీయ జనతా పార్టీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 400 సీట్లు గెలువాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని మండిపడ్డారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని మండిపడ్డారు. దేశం అత్యంత ప్రమాదం వైపు అడుగులు వేస్తోందని వివరించారు. రిజర్వేషన్ల ప్రక్రియ తొలగించేందుకు దాడులు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పుస్తే తీసుకుంటారు. ఇళ్లు ఉంటే ఇళ్లు తీసుకుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి వివరించారు.
‘27 శాతం ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని వీపీ సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నాడు ఆర్ ఎస్ఎస్, అనుకూల వర్గాలు ఉన్నత వర్గాలకు అనుకూలంగా వ్యవహరించారు. కోర్టులో సవాల్ చేస్తే.. మండల్ కమిషన్ ఇచ్చిన తీర్పును ఆమోదించింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలు 7 శాతం రిజర్వేషన్. ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 50 శాతం మించకుండా రిజర్వేషన్ ఇవ్వాలని తేల్చిచెప్పింది. బీసీ, ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది. చట్ట సభల్లో రిజర్వేషన్ ఉండాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి పలువురు విజప్తి చేశారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని, బీసీ జనాభాను లెక్కించి, రిజర్వేషన్, నిధులు కేటాయిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని’ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
‘బీజేపీ విధానం ఏంటో చెప్పాలి. ఈ దేశాన్ని హిందూ దేశం చేస్తామని, రిజర్వేషన్లు లేని దేశం చేస్తామని ఆర్ఎస్ఎస్ ప్రకటన. మోదీ, అమిత్ షాకు అంబానీ, అదానీ తోడయ్యారు. సూరత్ నుంచి బయల్దేరిన అదానీ రిజర్వేషన్లు వద్దంటున్నారు. 2025లో రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగం మార్చే కుట్ర. దేశ సార్వభౌమాధికారంపై దాడి చేస్తున్నారు. 2/3 మెజార్టీ కావాలి. 400 సీట్లు కావాలి అంటున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి, రిజర్వేషన్ మార్చివేసే ఆలోచనలో బీజేపీ ఉంది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ మీద తప్పుడు ప్రచారం, వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు. రిజర్వేషన్లు రద్దు చేసి, హిందూ సమాజంగా చూపించాలని ఆర్ఎస్ఎస్ అనుకుంటోంది. ఆ ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోంది. ఈస్ట్ ఇండియా విధానాన్ని అంబానీ, అదానీ కొనసాగిస్తున్నారు. బీసీ జనాభా లెక్క కట్టడం చారిత్రాత్మక అవసరం, జనాభాను లెక్కించిన సమయంలో.. రిజర్వేషన్లను 27 శాతం నుంచి పెంచే అవకాశం ఉంటుంది అని’ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Latest Telangana News or Telugu News