Share News

Election: అన్నా.. ఓటేసేందుకు రావాలి! హైదరాబాద్‌లోని గ్రామీణ ఓటర్లకు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు

ABN , Publish Date - May 03 , 2024 | 05:31 AM

పల్లెల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్ల పక్రియ ముగిసిన నేపథ్యంలో పోటీలో నిలబడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో, గ్రామ, మండల స్థాయి నాయకులు హైదరాబాద్‌లో ఉండే గ్రామీణ ఓటర్లపై దృష్టి సారించారు.

Election: అన్నా.. ఓటేసేందుకు రావాలి! హైదరాబాద్‌లోని గ్రామీణ ఓటర్లకు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు

హైదరాబాద్‌ నగరంలోని గ్రామీణ ఓటర్లకు సొంతూరు నాయకుల పిలుపు

కుటుంబంతో కలిసి రావాలంటూ వినతి

రవాణా చార్జీలు, ఖర్చులూ చెల్లిస్తామని హామీ

ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా ముందస్తుగా కొంత డబ్బు చెల్లింపు

హైదరాబాద్‌ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్ల పక్రియ ముగిసిన నేపథ్యంలో పోటీలో నిలబడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో, గ్రామ, మండల స్థాయి నాయకులు హైదరాబాద్‌లో ఉండే గ్రామీణ ఓటర్లపై దృష్టి సారించారు. పోలింగ్‌కు మరో రెండు వారాల సమయం ఉన్నా.. తప్పకుండా రావాలంటూ ఇప్పటి నుంచే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే ఊరికి వచ్చి ఓటు వేశారో.. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా అలాగే రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల రోజు కుటుంబంతో కలిసి రావాలని కోరుతున్నారు.

వలస ఓటర్లకు ప్రత్యేక బృందాలు..

గ్రామాలు, నగరాల్లో బూత్‌ల వారీగా ఉన్న ఓటర్లను నిత్యం కలుసుకుని ఓట్లు అడిగేందుకు ఇప్పటికే ఐదారుగురితో కలిసి పార్టీల నేతలు టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వారితో ప్రచారం చేయిస్తున్నారు. నమ్మకం కలిగిన ఓటర్లకు మద్యం బాటి ళ్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆకర్షించేందుకు.. ఎన్నికల రోజు వారిని సొంతూళ్లకు రప్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా నుంచి వలస ఓటర్ల పేర్లు, వారి ఫోన్‌ నంబర్లను సేకరించి ఫోన్‌ చేయిస్తున్నారు. కొంతమందికి సెల్‌ఫోన్‌ మెసేజ్‌లు కూడా పంపిస్తున్నారు.


ఓటుకు రూ.1500-2000

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నగదు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలింగ్‌ రోజున స్వగ్రామానికి వచ్చి ఓటు వేస్తే రూ.1500-2000 వరకు ఇస్తామని హామీ ఇస్తున్నారు. కచ్చితంగా పడే ఓట్లకు సగం డబ్బులు ముందుగానే ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిగతా మొత్తాన్ని ఇంటికి వచ్చిన తర్వాత, లేకుంటే పోలింగ్‌ కేంద్రం వద్ద చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు. కాగా, నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో ఒకేచోట 30 నుంచి 50కి పైగా ఓట్లు ఉంటే వారిని ప్రత్యేక వాహనాల్లో కూడా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది డబ్బుల కంటే ఓటు హక్కును వినియోగించుకోవడం ముఖ్యమని భావిస్తూ.. పోలింగ్‌కు రెండు రోజుల ముందే కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


కరీంనగర్‌ జిల్లా మానకొండూరుకు

చెందిన సునీల్‌ ఆరేళ్లుగా గచ్చిబౌలిలో నివాసముంటున్నారు. జీవనోపాధి నిమిత్తం కుటుంబ సభ్యులతో ఇక్కడే ఉంటున్న ఆయనకు సొంతూరిలో నాలుగు ఓట్లు ఉన్నాయి. దాంతో, గురువారం ఉదయం ఓ పార్టీకి చెందిన నాయకుడు సునీల్‌కు ఫోన్‌ చేశాడు. ‘అన్నా.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈసారి మన కాడ పోటీ గట్టిగానే ఉంది. అన్నను గెలిపించాలంటే మీలాంటోళ్లు అందరూ ఓటేసేందుకు తప్పకుండా రావాలి. వదిన, పిల్లలను వెంట పెట్టుకుని పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఇంటికి వచ్చి ఓటేయాలి. ఓటుతోపాటు రానుపోనూ అన్ని ఖర్చులు ఇస్తాను’’ అని వ్యక్తి చెప్పాడు.

ముషీరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాములు, ఆయన భార్యకు వరంగల్‌ నగరంలో రెండు ఓట్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఓ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఫోన్‌ చేశారు. ‘మా పార్టీ నుంచి పోటీ చేస్తున్న అన్నకు ఎంపీ ఎన్నికల్లో ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలిసిన ఓట్లు పోకుండా మేమంతా బాగా కష్టపడుతున్నాం. ఓట్ల రోజు మీరిద్దరూ ఊరికి వచ్చి మాకు మద్దతు తెలపాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్నీ చూసుకుంటాను’ అని హామీ ఇచ్చారు. ఫోన్‌ పే ద్వారా ముందస్తుగా రూ.వెయ్యి పంపించి నమ్మకం కల్పించాడు.

Updated Date - May 03 , 2024 | 08:31 AM