Ice Cubes: ఐస్ క్యూబ్స్‌ను ఇలా వాడితే చర్మ సమస్యల నుంచి ఉపశమనం!
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:12 PM
ఐస్ క్యూబ్స్‌తో చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఐస్ క్యూబ్స్ అంటే కేవలం వంటకు సంబంధించినవే కావు! వీటిని వినియోగించి అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచు ముక్కలతో కలిగే కూలింఫ్ ఎఫెక్ట్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందన్న విషయం ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. కాబట్టి.. చర్మం ఆరోగ్యం కోసం చేపట్టే చర్యల్లో ఐస్ క్యూబ్స్‌ను భాగం చేసుకుంటే వెలకట్టలేని ప్రయోజనాలు ఒనగూడుతాయి (Health).
చిన్న చిన్న చర్మ సంబంధిత సమస్యలకు ఐస్ క్యూబ్స్ అద్భుత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. చర్మంలో ఇబ్బందిగా ఉన్న చోట ఐస్ క్యూబ్స్ ఉన్న వస్త్రాన్ని అదిమిపెడితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ప్రభావిత ప్రాంతంలో వేడి తగ్గి చర్మం రిలాక్స్ అవుతుంది. తగినంత తేమ కూడా అంది సమస్య త్వరగా సమసిపోతుంది. ముఖ్యంగా సన్‌బర్న్ నుంచి కోలుకునేందుకు ఐస్‌క్యూబ్స్ మంచి తరుణోపాయమని డెర్మటాలజిస్టులు చెబుతుంటారు.
Morning Walk Vs Evening Walk: మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్.. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలంటే..
ఎక్కువ సేపు ఎండలో గడిపినప్పుడు చర్మం కందిపోయినట్టు అనిపిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ తలెత్తి నొప్పి, మంట మొదలవుతాయి. ఇలాంటి సందర్భాల్లో శుభ్రమైన వస్త్రాన్ని చల్లని నీటిలో తడిపి ప్రభావిత ప్రాంతంపై అదిమిపెట్టాలి. దీంతో, ఆ చోట రక్తప్రసరణ తగ్గి ఇన్‌ఫ్లమేషన్ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నిద్రలేవగానే కళ్లు ఉబ్బినట్టు ఉండటం సాధారణమే. ఇలాంటి సందర్భాల్లో కూడా ఐస్ అక్కరకు వస్తుంది. ఐస్ క్యూబ్స్‌ను ఓ వస్త్రంలో వేసి చుట్టి దాన్ని కంటిపై పెట్టుకుని కళ్లు ఉబ్బడం మటుమాయం అవుతుంది.
Health: వాకింగ్, జాగింగ్, సైక్లింగ్.. వీటిల్లో ఎవరు దేన్ని ఎంచుకోవాలంటే..
మొటిమల కారణంగా ఇబ్బంది తలెత్తినప్పుడు కూడా ఐస్ క్యూబ్స్‌తో ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొటిమల కారణంగా చర్మం కందిపోవడం, దురద మంటవంటి వాటి నుంచి కోల్డ్ కంప్రెస్ ఉపయోగించి సాంత్వన పొందొచ్చని చెబుతున్నారు.
అయితే, చర్మంపై నేరుగా ఐస్ క్యూబ్స్ తాకించొద్దని నిపుణులు చెబుతున్నారు. టవల్ లేదా వస్త్రంలో చుట్టి మాత్రమే చర్మంపై పెట్టాలని చెబుతున్నారు. ఇక ఐస్ ప్యాక్ కోసం వాడే వస్త్రం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. ఐస్ క్యూబ్స్‌తో ఉపశమనం లభిస్తుందే తప్ప ఇది శాశ్వత పరిష్కారం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. చర్మం సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి వారు సూచించే పరిష్కారం పాటించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.