Share News

ఏఐ పండించిన పంట

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:24 AM

వర్టికల్‌ ఫార్మింగ్‌ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే?

ఏఐ పండించిన పంట

  • ప్రపంచంలోనే తొలి ఇండోర్‌, ఏఐ ఆధారిత వర్టికల్‌ బెర్రీ ఫామ్‌

  • వర్జీనియాలో ఏర్పాటు.. కృత్రిమ మేధ పర్యవేక్షణతో 90ు నీరు ఆదా

న్యూయార్క్‌, సెప్టెంబరు 26: వర్టికల్‌ ఫార్మింగ్‌ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే? అదుగో.. అలాంటి ఆలోచనకు ప్రతిఫలమే ఇక్కడ కనిపిస్తున్న స్ట్రాబెరీ పంట. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం రిచ్‌మండ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇండోర్‌, ఏఐ-ఆధారిత వర్టికల్‌ బెర్రీ ఫామ్‌.. ‘ద ప్లెంటీ రిచ్‌మండ్‌ ఫామ్‌’ ఈ సరికొత్త వ్యవసాయ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. కేవలం 0.91 ఎకరా విస్తీర్ణంలో ఏడాదికి 18 లక్షల కిలోల స్ట్రాబెరీలను పండించడమే లక్ష్యంగా 30 అడుగుల ఎత్తున్న టవర్లను నిర్మించింది.

Untitled-1 copy.jpg

ఆ టవర్లలో నాటిన మొక్కలకు కావాల్సిన వేడి, వెలుతురు, తేమ వంటివాటిని ఏఐ సాయంతో నియంత్రించింది. దానివల్ల మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరగడమే కాక.. అత్యుత్తమ నాణ్యతతో కూడిన స్ట్రాబెరీలు పండుతున్నాయి. మామూలుగా అయితే స్ట్రాబెరీ పంట వేయాలంటే ఎకరానికి దాదాపుగా 22 వేల మొక్కలు నాటుతారు. ఎకరాకు దాదాపు 8 టన్నుల దిగుబడి వస్తుంది! కానీ.. కృత్రిమ మేధ పర్యవేక్షణ, వర్టికల్‌ విధానంలో సాగు చేయడం వల్ల.. సంప్రదాయ విధానంలో పండించే పంట కన్నా 90 శాతం తక్కువ నీటిని, 97 శాతం తక్కువ భూమిని ఈ ఫామ్‌ వినియోగించుకుంటోంది. భవిష్యత్తు ఆహారోత్పత్తికి కొత్త భరోసానిస్తోంది. కాగా.. ఈ ఆలోచనను అమల్లోకి తేవడానికి ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఆరేళ్లపాటు కృషి చేశారు. 200కు పైగా ట్రయల్స్‌ చేసి.. చివరికి అత్యుత్తమ విధానాన్ని రూపొందించారు. పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించకుండా మానవాళికి తగినంత ఆహారాన్ని సరఫరా చేయడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 03:24 AM