Share News

అంతా అతడి కనుసన్నల్లోనే...

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:55 AM

నల్లగొండ జిల్లా డిండి కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు ఓ ఉద్యోగి కేంద్ర బిందువుగా మారాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అంతా అతడి కనుసన్నల్లోనే...

డిండి తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగిదే పెత్తనం

ప్రతి పనికో రేటు

అతడి నుంచి ఫైల్‌ వెళితేనే మోక్షం

డిండి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా డిండి కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు ఓ ఉద్యోగి కేంద్ర బిందువుగా మారాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ ఉద్యోగి అన్నీతానై కార్యాలయంలో చక్రం తిప్పుతూ తన గుప్పిట్లోకి తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇతడి వల్లే ప్రజలకు పారదర్శకంగా అందాల్సిన సేవలు ముడుపులిస్తేనే కాని పరిస్థితి చేరాయి. ప్రధాన ఉద్యోగిని పక్కనపెట్టి తన హోదాకు మించి ఆ ఉద్యోగి కార్యాలయాన్ని శాసిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇతడి ద్వారా వెళితే తప్ప పనులు కావనే స్థాయికి చేరింది. ధరణిలో తలెత్తిన భూసమస్యలు ఈ ఉద్యోగికి వరంగా మారాయి. మిస్సింగ్‌ నెంబర్లు, భూముల విస్తీర్ణం తక్కువగా నమోదుకావడం, ఫొటోల తారుమారు, పట్టాభూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడం, ఒకరి భూసర్వేనెంబర్‌లో మరొకరిపై నమోదుకావడం వంటి సమస్యలు ఈ ఉద్యోగికి కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీ సమస్య పరిష్కారానికి ఓ ధర నిర్ణయించి భారీగా నగదు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిస్సింగ్‌ నెంబర్లకు రూ.50వేలు మొదలుకొని ఆపైన రూ.లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. కోర్టుల్లో భూవివాదాల కేసులు నడుస్తున్నప్పటికీ అదనంగా వసూళ్లు చేస్తూ పాస్‌పుస్తకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మండలంలోని ఓ గ్రామంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు కొందరి వ్యక్తుల నుంచి హైదరాబాద్‌లోని ఓహోటల్‌లో డీల్‌ కుదుర్చుకొని ఇటీవల రూ.8లక్షల నగదు తీసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చేందుకే ఈ డీల్‌ కుదుర్చుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ అవినీతి అధికారిపై ఏసీబీ అధికారుల నజర్‌ పడినట్లు సమాచారం. లావాదేవీలు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈ ఉద్యోగి కుదుర్చుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. అయితే ఇతడిపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా భూముల వివరాలకు ప్రధాన ఆధారమైన 1956 నాటి డిండి కాస్రాను కార్యాలయంలో మిస్సయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో వివరాల ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూశాఖలో పనిచేస్తూ మృతి చెందినవారి కుటుంబ సభ్యులలో ఒకరికి(కారుణ్య నియామకం) ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సదరు ఉద్యోగి మృతుడి కుటుంబాల సన్నిహితుల నుంచి రూ.50వేల నగదు ఫోనపే ద్వారా రెండు విడతల్లో తన ఖాతాలో జమచేసుకున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు భూసమస్య కోసం రూ.20వేలు ఆ గ్రామానికి చెందిన మధ్యవర్తి ద్వారా తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇలా కార్యాలయాన్ని అవినీతి మయంచేశాడు. దీనిపై తహసీల్దార్‌ అంబటి ఆంజనేయులును వివరణ కోరగా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందితే సదరు ఉద్యోగిపై పోలీసుకేసులు నమోదు చేయించి బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తామన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:55 AM