దద్దరిల్లిన లెబనాన్
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:56 AM
లెబనాన్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని 17 పట్టణాలు, పల్లెలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
ఇజ్రాయెల్ భీకర దాడుల్లో 356 మంది మృతి
1000 మంది పైగా తీవ్ర గాయాలపాలు
హిజ్బుల్లా అడ్డాలే లక్ష్యంగా దూకుడు
300కు పైగా లక్ష్యాలపై రాకెట్ల వర్షం
వేలాది వాహనాల్లో తరలిపోయిన ప్రజలు
మరో గాజాలా లెబనాన్: ఐరాస
వెయ్యి మందికి గాయాలు.. మృతుల్లో 24 మంది చిన్నారులు
బీరుట్, టెల్ అవీవ్, సెప్టెంబరు 23: లెబనాన్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని 17 పట్టణాలు, పల్లెలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హిజ్బుల్లా ఉగ్రవాదులు తలదాచుకున్నవిగా, ఆయుధాలను భద్రపరిచినవిగా భావిస్తున్న నిర్మాణాలపైన రాకెట్ల వర్షం కురిపించింది. అంతకుముందు ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని స్థానికులను హెచ్చరిస్తూ వేలాది ఫోన్ కాల్స్ చేసింది. 11 నెలలుగా ఓవైపు హమా్‌సతో యుద్ధం చేస్తూనే మరోవైపు హిజ్బుల్లాతోనూ తలపడుతున్న ఇజ్రాయెల్ ఈ స్థాయిలో దాడులకు దిగడం ఇదే తొలిసారి. సోమవారం చేపట్టిన దాడుల్లో 356మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 24 మంది పిల్లలున్నారు.
తాజా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని.. మరో పూర్తిస్థాయి యుద్ధం తప్పదనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంది. అగ్రరాజ్య రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్‌కు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ ఆత్మరక్షణకు అండగా ఉంటామన్నారు. తమ బలగాలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల నుంచి భారీఎత్తున ప్రజలు తరలిపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవాలని లెబనాన్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి, పెద్ద దేశాలను కోరింది. హిజ్బుల్లా, ఇజ్రాయెల్ ఎవరూ తగ్గడం లేదని వ్యాఖ్యానించిన ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్.. లెబనాన్ మరో గాజాలా మారునుందని ఆందోళన వ్యక్తం చేశారు.