Share News

US Election 2024: అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 06 , 2024 | 07:38 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024పై భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఐదు అధ్యక్ష పదవీకాలలో అమెరికాతో సంబంధాల విషయంలో భారత్ స్థిరమైన పురోగతిని కొనసాగించిందని, ప్రస్తుత ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా అగ్రరాజ్యంతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

US Election 2024: అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jai Shankar

కాన్‌బెర్రా: అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకనుంది. పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ షురూ అయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024పై భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఐదు అధ్యక్ష పదవీకాలాలలో అమెరికాతో సంబంధాల విషయంలో భారత్ స్థిరమైన పురోగతిని కొనసాగించిందని, ప్రస్తుత ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా అగ్రరాజ్యంతో సంబంధాలు మరింత బలపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి కాన్‌బెర్రాలో సంయుక్త మీడియా సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన ‘క్వాడ్’ కూటమి భవిష్యత్తుపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. అయితే రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలుస్తారనే ఆందోళన ఉందా? ఆయన అధికారంలోకి వస్తే ‘క్వాడ్’పై ప్రభావం ఉంటుందా? అని ఇద్దరు మంత్రులను మీడియా ప్రశ్నించగా జైశంకర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.


జైశంకర్ ఏమన్నారంటే..

‘‘ క్వాడ్ పరంగా చూస్తే.. మీకో విషయం గుర్తుచేయాలనుకుంటున్నాను. 2017లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతనే ‘క్వాడ్’ పునరుద్ధరణ జరిగింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే శాశ్వత కార్యదర్శి స్థాయి నుంచి ఒక మంత్రి స్థాయికి కూటమి బలోపేతం అయింది ’’ అని జైశంకర్ గుర్తుచేశారు.

‘‘ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కొవిడ్ సమయంలో భౌతిక సమావేశాలు నిలిచిపోయాయి. అరుదుగా జరిగిన భౌతిక భేటీల్లో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కూడా ఒకటి. 2020లో టోక్యోలో ఈ భేటీ జరిగింది. దీనిని బట్టి క్వాడ్ ఎలా ఉండబోతోందనేది అర్థమవుతోంది కదా’’ అని జైశంకర్ తెలిపారు.


‘‘భారత్ విషయానికి వస్తే ట్రంప్ గత పాలనలో అమెరికాతో బలమైన బంధాన్ని కొనసాగించాం. అంతకుముందు ఐదు అధ్యక్ష పదవికాలాలలోనూ పురోగతిని చూశాం. కాబట్టి ప్రస్తుత ఎన్నికల్లో తీర్పు ఎలా ఉన్నా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై మాకు చాలా నమ్మకం ఉంది. బంధాలు మరింత మెరుగవుతాయి’’ అని జైశంకర్ అన్నారు.


ఇవి కూడా చదవండి

అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ మొదలు.. లీడ్‌లో ఎవరు ఉన్నారంటే

ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే

అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు

For more International News and Telugu News

Updated Date - Nov 06 , 2024 | 08:57 AM