Share News

Bharat Ratna LK Advani : భారతరత్నం ఆడ్వాణీ

ABN , Publish Date - Feb 04 , 2024 | 04:45 AM

రాజకీయ కురువృద్ధుడు.. దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన రథ యాత్రికుడు.. ఢిల్లీ పీఠంపై కమలం పువ్వును కూర్చోబెట్టిన యోధుడు.. లాల్‌కృష్ణ ఆడ్వాణీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించింది. ఉప ప్రధానిగా పని చేసి.. ప్రధాని రేసులోనూ ముందంజలో ఉండి.. ‘మోదీ’ ప్రభంజనంలో పక్కకు

Bharat Ratna LK Advani : భారతరత్నం ఆడ్వాణీ

‘కమలం’ కురు వృద్ధుడికి అత్యున్నత పురస్కారం

రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన 2 వారాలకే..

‘ఎక్స్‌’లో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

అనంతరం రాష్ట్రపతి భవన్‌ నుంచి సమాచారం

ఒకే ఏడాదిలో ఇద్దరికి భారత రత్న అవార్డు

నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది

దశాబ్దాల నిస్వార్థసేవకు ప్రతిఫలం లభించింది

ఈ జీవితం దేశానికి అంకితం

కుటుంబం, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు

భారత రత్న ప్రకటన తర్వాత ఆడ్వాణీ స్పందన

అత్యంత వినయంతో భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్నా. ఇదం నమమ (ఈ జీవితం నాది కాదు.. దేశానిది) అన్న సంస్కృత సూక్తే నాకు ప్రేరణ. 14వ ఏట ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరా.

నా దేశం కోసం ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేశా. కుటుంబం, లక్షలాది మంది పార్టీ, సంఘ్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు.

- ఎల్‌కే ఆడ్వాణీ

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

రాజకీయ కురువృద్ధుడు.. దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన రథ యాత్రికుడు.. ఢిల్లీ పీఠంపై కమలం పువ్వును కూర్చోబెట్టిన యోధుడు.. లాల్‌కృష్ణ ఆడ్వాణీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించింది. ఉప ప్రధానిగా పని చేసి.. ప్రధాని రేసులోనూ ముందంజలో ఉండి.. ‘మోదీ’ ప్రభంజనంలో పక్కకు తప్పుకొన్న ఆయనకు ఇప్పుడు, ఇలా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. రాముడే నినాదంగా, రామజన్మభూమి సాధనే ధ్యేయంగా రాజకీయ ప్రస్థానం కొనసాగించిన ఆడ్వాణీకి.. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రెండు వారాలకే ‘భారత రత్న’ ప్రకటించడం గమనార్హం! బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, వెనుకబడిన వర్గాల నాయకుడు కర్పూరీ ఠాకూర్‌కు ఇప్పటికే ‘భారత రత్న’ ప్రకటించారు. అనూహ్యంగా... ఆడ్వాణీని కూడా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేస్తూ శనివారం ప్రకటన వెలువడింది. ప్రధాని మోదీ స్వయంగా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఈ ప్రకటన చేశారు. ఆ వెంటనే... రాష్ట్రపతి భవన్‌ కూడా అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ‘మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీకి భారత రత్న ప్రదానం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయించారు’ అని అందులో తెలిపారు. ఆ వెంటనే మీడియా ప్రతినిధులు ఆడ్వాణీ నివాసానికి చేరుకున్నారు. వారికి దూరం నుంచే ఆయన అభివాదం చేశారు. ‘భారత రత్న’ ప్రకటనపై తన తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారని ఆడ్వాణీ కుమార్తె ప్రతిభ తెలిపారు. బీజేపీ వ్యవస్థాపకులు, ఆ పార్టీ కీలక నేతలందరికీ మోదీ ఈ పదేళ్లలో ఉన్నత పౌర పురస్కారాలు ప్రకటించారు. మరీ ముఖ్యంగా... ‘ఇద్దరు మిత్రులు’ వాజపేయి, ఆడ్వాణీ ఇద్దరినీ ‘భారత రత్న’తో సత్కరించారు. వాజపేయికి 2015లో ఆయన అవసాన దశలో ఉన్న కాలంలో భారత రత్న ప్రకటించారు. 2017లో మరో బీజేపీ కురువృద్ధ నేత 89 సంవత్సరాల మురళీ మనోహర్‌ జోషికి కూడా పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని అందించారు. ఇటీవల వెంకయ్య నాయుడుకు ‘పద్మవిభూషణ్‌’ ప్రకటించారు. ఇలా బీజేపీలోని పాత తరం నేతలందరినీ మోదీ సత్కరించుకున్నారు.

2adwani3.jpg

ఆడ్వాణీ మహనీయుడు: కిషన్‌ రెడ్డి, సంజయ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఆడ్వాణీ మార్గదర్శకుడు, మహనీయుడు అని బీజేపీ తెలంగాణ నేతలు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ అన్నారు. ఆడ్వాణీతో నడిచిన ప్రతీ క్షణం కొత్త విషయం నేర్చుకోవచ్చునని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. దేశ భక్తుడిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందించిన ఆడ్వాణీ... రథయాత్రతో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ చేసిన మహనీయుడని బండి సంజయ్‌ అన్నారు.

Updated Date - Feb 04 , 2024 | 04:45 AM