Air India Express: మూకుమ్మడి సెలవులతో 90 విమానాలు రద్దు
ABN , Publish Date - May 09 , 2024 | 03:29 AM
టాటాగ్రూప్ టేకోవర్ చేసిన విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 90కిపైగా విమానాలు రద్దయ్యాయి.
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 300 మంది సిక్‌లీవ్.. వివరణ కోరిన డీజీసీఏ
ప్రయాణికుల పడిగాపులు
వివరణ కోరిన డీజీసీఏ
‘టాటా’కు శిరోభారం ఏప్రిల్లో విస్తారా పైలట్ల లీవ్
న్యూఢిల్లీ, మే8: టాటాగ్రూప్ టేకోవర్ చేసిన విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 90కిపైగా విమానాలు రద్దయ్యాయి. వీటిలో అంతర్జాతీయ విమానాలూ ఉన్నాయి. కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలన్నీ రద్దవడంతో మళయాలీలు ఆయా విమానాశ్రయాల్లో ఆందోళన చేశారు.
అక్కడి ప్రయాణికులతో తమ సిబ్బంది సమ్మెలో ఉండడంవల్ల ఈ పరిస్థితి నెలకొందని అధికారికంగా చెప్పిన ఎయిరిండియా.. ఆ తర్వాత ఓ పత్రికా ప్రకటనలో సిబ్బంది మూకుమ్మడి సెలవులే కారణమని పేర్కొంది. ‘‘విమానాల్లో ప్రయాణికులకు సేవలందించే 300మంది వరకు సిబ్బంది మూకుమ్మడిగా సిక్‌లీవ్‌లు పెట్టారు. దీంతో పలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల టికెట్ ధరను పూర్తిగా రిఫండ్ చేస్తాం. లేదా వారు కోరుకున్న తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తాం’’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రద్దు ప్రభావం కేరళీయులపై ఎక్కువగా పడింది. కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలన్నీ రద్దవడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టా రు. ‘‘సెక్యూరిటీ, బ్యాగేజ్ చెక్‌ఇన్, ఇమిగ్రేషన్ పూర్తయ్యాక.. విమానం రద్దు సందేశం వచ్చింది. నేను గురువారమే నా ఉద్యోగంలో చేరాలి. లేకుంటే నా కొలువు ఊడిపోతుంది’’ అని కన్నూరుకు చెందిన ఓ మహిళ వాపోయారు. కొందరు ప్రయాణికులకు ఈ నెల 14 నుంచి 17 తేదీల్లో విమాన ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.
సిబ్బంది సమ్మెకు వెళ్తున్న విషయం తమకు 2 గంటల ముందే తెలిసిందని పేర్కొంది. కాగా ఆ తేదీల్లోగా తమ వర్క్‌వీసా గడువు ముగిసిపోతుందని, అదే జరిగితే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం ఉండదని పలువురు ప్రయాణికులు వాపోయారు. కొందరు దుబాయ్, బహ్రెయిన్, సౌదీల్లో ఉద్యోగాల కోసం షెడ్యూల్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది. ప్రయాణికుల అవస్థలు చూసిన కేరళ సర్కారు. విపక్ష పార్టీలు కేంద్ర విమానయాన మంత్రికి లేఖ లు రాశాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాయి.
వివాదంగా ఎందుకు మారింది?
అప్పుల్లో ఉన్న ఎయిరిండియాను టాటాగ్రూప్ కొనుగోలు చేసింది. అప్పటికే టాటాగ్రూప్ విస్తారా విమానయాన సంస్థ ను నిర్వహిస్తోంది. తాజాగా ఎయిరిండియాలో ఎయిరిండి యా ఎక్స్‌ప్రె్‌స (ఏఐఎక్స్ కనెక్ట్-- గతంలో ఎయిర్‌ఏషియా ఇండియా), విస్తారాను విలీనం చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి టాటాగ్రూప్ ఆయా విమానయాన సంస్థల్లో ని సిబ్బంది, ఉద్యోగుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోం ది.
గత నెల్లో విస్తారాలో పైలట్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో పలు విమానాలు రద్దుచేయాల్సి వచ్చింది..! తా జాగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకనేక కారణాలున్నాయని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సంఘం వివరించింది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల పట్ల టాటాగ్రూప్ అసమానతలను చూపుతోందని ఆరోపించింది. కాగా.. బుధవారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రద్దు తో తానూ బాధితుడిగా మారానని జమ్మూకశ్మీర్‌కు చెందిన డీపీఏపీ చీఫ్ గలామ్ నబీ ఆజాద్ అన్నారు.