Share News

Budget Session: ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేస్తారా.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే?

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:24 PM

శీతాకాల సమావేశాల సమయంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ‘పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్’ అంశంపై ప్రశ్నించినందుకు, దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేసినందుకు.. ఆ ఎంపీలపై వేటు వేయడం జరిగింది.

Budget Session: ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేస్తారా.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే?

శీతాకాల సమావేశాల సమయంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ‘పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్’ అంశంపై ప్రశ్నించినందుకు, దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేసినందుకు.. ఆ ఎంపీలపై వేటు వేయడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ సస్పెన్షన్‌ని రద్దు చేస్తారా? లేకపోతే కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. ఆ సస్పెన్షన్‌ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బడ్జెట్ సమావేశాలను సజావుగా, సున్నితంగా నిర్వహించడంలో భాగంగా.. ఈ సస్పెన్షన్‌ని ఎత్తివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతిపక్ష సభ్యులందరి సస్పెన్షన్‌లను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ప్రివిలేజెస్ కమిటీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని ప్రహ్లాద్ జోషి అన్నారు. నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇందులో భాగంగానే ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేయాలని తాము కోరామని చెప్పారు. బడ్జెట్ సెషన్ సమర్థవంతంగా సాగడంలో.. పార్లమెంటరీ సభ్యుల మధ్య సంభాషణ, సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఒకవేళ సభలో సహకరించకుండా అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తే మాత్రం.. స్పీకర్ తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.


బడ్జెట్ సెషన్ ఎజెండా

జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పణతో మొదలుకొని.. ఫిబ్రవరి 9న ఈ సెషన్ ముగుస్తుంది. ఈ సెషన్ సందర్భంగా.. అర్థవంతమైన చర్చలను కొనసాగించాలని, ఎంపీలందరూ ఈ చర్చల్లో భాగస్వామ్యం అవ్వాలన్న విషయాలపై దృష్టి కేంద్రీకరించబడింది. రాష్ట్రపతి ప్రసంగం, ఓట్ ఆఫ్ అకౌంట్స్‌పై చర్చలను సులభతరం చేసేందుకు గాను తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యసభ ప్రివిలేజెస్ ప్యానెల్‌కు చెందిన ఒక ప్రతినిధి మాట్లాడుతూ.. ఎంపీలందరూ చర్చల్లో పాల్గొనడానికి, అలాగే రాష్ట్రపతి ప్రసంగాన్ని వినడానికి అనుమతించే నిబద్ధతను పునరుద్ఘాటించారు.

Updated Date - Jan 30 , 2024 | 05:24 PM