Share News

India New Earthquake Zones: మారుతున్న భూకంప జోన్లు

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:54 AM

భారతదేశంలో భూకంప జోన్లను మార్చాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణలో భద్రాచలం తప్ప మిగతా ప్రాంతాలు సేఫ్‌జోన్‌గా ఉంటాయి

India New Earthquake Zones: మారుతున్న భూకంప జోన్లు

మరో రెండు నెలల్లో ఖరారు ప్రస్తుతం 5 జోన్లు.. 6కు పెంపు

భద్రాచలం మినహా సేఫ్‌జోన్‌లో తెలంగాణ

దేశంలోని భూకంప జోన్లు మారనున్నాయి. ప్రస్తుతం ఐదు జోన్లుండగా.. వాటి సంఖ్య ఆరుకు పెరగనుంది. 1962లో తొలిసారి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఐదు జోన్లను ఏర్పాటు చేయగా.. భారత ప్రమాణాల బ్యూరో(బీఐఎస్‌) 1970, 1984లో కొన్ని మార్పులు చేసి, జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. 2002లో ‘ఐఎస్‌ 1893:2002’ పేరుతో వాటిని అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి భూమి లోపల ఫలకాల కదలికలో వేగం(యాక్సలరేషన్‌) పెరుగుతూ.. ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. భూభౌతిక శాస్త్రవేత్తలు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు, భూకంపాల పరిశోధకులు, బీఐఎస్‌ అధికారులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలు భేటీల తర్వాత.. ప్రస్తుతం ఉన్న ఐదు జోన్లను ఆరుగా మార్చాలని నిర్ణయించింది. మరో రెండు నెలల్లో కొత్త జోన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.


అంకెలా? ఆంగ్ల వర్ణమాలా?

ప్రస్తుతం ఉన్న జోన్లు రోమన్‌ నంబర్లలో ఉన్నాయి. జోన్‌-5లో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలుండగా.. జోన్‌-2లో అత్యల్ప ప్రభావం ఉంటుంది. కొత్త జోన్లకు ఇదేవిధంగా రోమన్‌ నంబర్లను వాడాలా? పాత-కొత్త మధ్య అయోమయాన్ని తొలగించేందుకు ఆంగ్ల వర్ణమాలలోని ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌లను వాడాలా? అనేదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఈ కమిటీలోని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఈ అంశం మినహా.. ఏ జోన్‌ పరిధిలోకి ఏయే ప్రాంతాలు వస్తాయి? అనే దానిపై బీఐఎస్‌ రూపొందించిన ‘ఐఎస్‌ 1893:2025’ని కమిటీ ఖరారు చేసిందని వివరించారు. ప్రమాదకర ఆరోజోన్‌లో ఎగువ హిమాలయాలు, శివాలిక్‌ శ్రేణులు ఉన్నాయని తాజా మ్యాప్‌ చెబుతోంది. వీటితోపాటు.. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ ప్రాంతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌ ఈ జోన్‌లో ఉన్నాయి. హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, నేపాల్‌తో సరిహద్దులను పంచుకుంటున్న ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లోని పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ దీవులు ఇదే జోన్‌లో ఉన్నాయి. భూగర్భంలో ఫలకాల కదలికకు సంబంధించిన యాక్సలరేషన్‌ ఈ ప్రాంతాల్లో 5జీ(గ్రావిటీ)గా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో భూగర్భంలో ఫాల్ట్స్‌ కారణంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అంతర్‌-ఫలకల ప్రాంతం కావడంతో నష్టం తీవ్రంగా ఉంటుందని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రదీ్‌పకుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.



ఐదో జోన్‌ కొంత భాగమే

పాత జోన్‌-5లో భూగర్భ ఫలకాల యాక్సలరేషన్‌ 0.36జీగా ఉండేది. కొత్త జోన్‌-5లో ఈ వేగం 0.333జీగా ఉన్నట్లు సమాచారం. దిగువ హిమాలయ ప్రాంతాల్లోని గంగామైదానాలు కొంత వరకు ఐదోజోన్‌లోకి వస్తాయి. ఇక్కడ కూడా రివర్స్‌, స్ట్రైట్‌స్లిప్‌ ఫాల్ట్స్‌ ఉన్నా.. వాటి యాక్సలరేషన్‌ తక్కువగా ఉంటుంది. రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్‌లో ఉంటాయి. 0.233 గ్రావిటీ ఉండే ప్రాంతాలను జోన్‌-4లో చేర్చారు. ఇక్కడ భూకంపాలు వచ్చినా.. తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో న్యూఢిల్లీ, ఎన్‌సీఆర్‌-ఢిల్లీ, పట్నా, కోల్‌కతా నగరాలున్నాయి.

జోన్‌-3లో కీలక నగరాలు

జోన్‌-3(0.125జీ)లో లఖ్‌నవూ, పట్నా లోని కొన్ని ప్రాంతాలు, రాంచీ, భువనేశ్వర్‌, డామన్‌, ముంబై, ఏపీలోని అమరావతి, చెన్నై, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతాలు, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని థేని, కేరళలోని శబరిమల, పెరియార్‌ అడవులు కూడా ఈ జోన్‌లోనే ఉన్నాయి.

జోన్‌-2లో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క భద్రాచలం మినహా.. మిగతా ప్రాంతాలన్నీ గత జోన్లలో మాదిరిగానే జోన్‌-2లో ఉన్నాయి. ఇక్కడ భూగర్భంలో ఫలకం కదలిక 0.075 గ్రావిటీతో ఉంటుంది. ఈ కారణంగా పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం ఉండవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కర్ణాటకలోని 99% ప్రాంతాలు, కేరళలోని గురువాయూర్‌ ఈ జోన్‌లోనే ఉన్నాయి.

- సెంట్రల్‌డెస్క్‌


ఇవి కూడా చదవండి:

అందాల భామతో

బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 6 మంది మృతి

UP: నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Updated Date - Mar 31 , 2025 | 04:54 AM